Reading Time: 3 mins

777 చార్లీ మూవీ రివ్యూ

777 చార్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Emotional Engagement Emoji
?

కొన్ని సినిమాలు కళ్లతో చూడాలి..మరికొన్ని సినిమాలు మనస్సుతో చూడాలి. వేటి దృక్కోణం నుంచి వాటిని చూస్తే అవి తమదైన ముద్రను వేయగలుగుతాయి. ప్రతీ సినిమా కమర్షియల్ యాస్పెక్ట్ లో ఇమడకపోవచ్చు కానీ పలకరిస్తే మాత్రం అద్బుతంగా ఉంటుంది. అలాంటి సినిమాలలో ఒకటి 777 చార్లీ. ఫీల్ గుడ్ సినిమాగా మన ముందుకు వచ్చిన ఈ కన్నడ డబ్బింగ్ చిత్రం ఓ లాబ్రడార్ డాగ్ టైటిల్ పాత్రలో కనిపించిందంటే ఆశ్చర్యపోతాం. ఓ కుక్కతో రెండున్నర గంటలు సేపు కథను నడిపించిన విధానం ముచ్చట వేస్తుంది. ఆ వేశేషాలు ఈ విశ్లేషణలో చూద్దాం.

స్టోరీ లైన్

చిన్నతనంలో తల్లిదండ్రులు మరియు తోబుట్టువుని ఓ యాక్సిడెంట్లో కోల్పోతాడు.. ధర్మ (రక్షిత్ శెట్టి). పూర్తి ఒంటరితనంతో ఇల్లు, ఫ్యాక్టరీ తప్ప వేరే ప్రపంచం ఏమీ తెలియకుండా బ్రతికేస్తుంటాడు. అలాంటి జీవితంలోకి సడన్ ఎంట్రీ ఇస్తుంది ఓ లాబ్రడార్ కుక్క. దానికి తనకు ఇష్తమైన చార్లీ చాప్లిన్ లోని చార్లీ అనే పేరు పెడతాడు. చార్లీ ఎంట్రీతో ధర్మ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ధర్మ-చార్లీ కలిసి చేసిన ప్రయాణం ఏ తీరానికి చేరింది? అనేది “777 చార్లీ” కథాంశం. .

విశ్లేషణ

కథగా చెప్పుకోవటానికి ఈ సినిమాలో పెద్దగా ఏమి లేదు. కానీ సినిమా అనేది విజువల్ మీడియం అనేది ఈ సినిమా దర్శకుడు బాగా అర్దం చేసుకున్నారని తెలుస్తుంది. ఆ దిశగానే కథ,కథనం, విజువల్స్ నడుపుతాడు. అయితే చాలా చిన్న స్టోరీ లైన్ కావటంతో పెద్దగా ఏమీ జరిగినట్లు అనిపించదు. వరసపెట్టి సీన్స్ తెరపై వెళ్లిపోతూంటాయి. ఫస్టాఫ్ అంతా కూడా ధర్మ పాత్ర పరిచయానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు.. చిన్నప్పుడే తల్లిదండ్రులను, చెల్లిని కోల్పోయిన ధర్మ దేవుడికి, మిగతా మనుషులకు దూరంగా తన ప్రపంచంలో తాను బతుకేయటానకే సరిపోతుంది. కేవలం ఇల్లు, ఫ్యాక్టరీ, తిండి లోకంగా బతుకుతున్నాడు అని చెప్పటానికి కొద్దిపాటి సీన్స్ చాలు చాలా స్క్రీన్ సమయం తీసుకోవటం విసుగేస్తుంది.

సరిగ్గా అదే సమయంలో ఒక బ్రీడర్ నుంచి తప్పించుకున్న చిన్న కుక్క పిల్ల యాదృచ్చికంగా ధర్మ ఇంటికి చేరుకోవటం నుంచి కథలో కాస్త రిలీఫ్ స్టార్ట్ అవుతుంది. మొదట దాన్ని చీదరించుకుంటూ ఎన్నోసార్లు వదిలించుకోవాలని చూసినా అది వదలక పోవడంతో నెమ్మదిగా దానికి అలవాటు పడి దానితో ప్రేమలో పడి చార్లీ అనే పేరు పెట్టడంతో కథలో మొదటి మలుపు వస్తుంది. దానితో ప్రేమ పెంచుకుంది దానికి ఒక నయం కాని జబ్బు ఉందన్న విషయం తెలుసుకుని దానికి బాగా ఇష్టమైన ఒక చోటికి తీసుకు వెళ్లాలని ఫిక్స్ అవటమే కథలో కాంప్లిక్ట్,కీలకం.

ఇక సెకండాఫ్ మొత్తం ధర్మ -చార్లీ ప్రయాణంతో సాగుతుంది. చార్లీ ఎక్కువ రోజులు బతకదనే విషయం తెలుసుకున్న ధర్మ దానికి బాగా ఇష్టమైన ఒక ప్రాంతానికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించటం మన హృదయానికి పడుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా వారి ఇద్దరి మధ్య అనేక ఇంట్రస్టింగ్ సీన్స్ ఉన్నాయి. కానీ రిపీట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అఖరికి ఎన్నో కష్టనష్టాలు పడిన తరువాత ధర్మ ఎట్టకేలకు చార్లీని తీసుకు వెళ్లాల్సిన చోటికి తీసుకు వెళ్తాడు. ఈ మధ్యలో పరిచయమైన అనేకమంది కూడా వారికీ మంచి స్నేహితులుగా మిగిలిపోవటంతో సినిమా ముగిస్తాడు. సినిమా మొత్తం మీద చెప్పుకోదగ్గ మలుపులు, ట్విస్టులు ఏమీ లేవు. కానీ సీన్స్ ని ఇంట్రస్టింగ్ గా మలిచే ప్రయత్నం చేసాడు.

టెక్నికల్ గా …

ఒక మనిషి కుక్కను ఎంత ప్రేమించాడు అనేది ఈ సినిమాలో ప్రధాన పాయింట్. దర్శకుడు కిరణ్ రాజ్ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా తెరకెక్కించారు. ఇటువంటి సబ్జెక్ట్‌ని ఎంచుకోవడమే సాహసం. డైరక్టర్ కిరణ్ రాజ్ కష్టం మనకు అడుగడుగునా కనిపిస్తుంది. ఆయన చాలా ఓపిగ్గా తను అనుకున్నది తెరకెక్కించారని అర్దమవుతుంది. అలాగే విజువల్స్ కు ఆయన ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. కుక్క చేత కూడా చాలా సీన్స్ లో అద్బుతంగా నటింపచేసారు. ప్రేక్షకుల్ని ఆ ఎమోషన్స్ లో లీనం చేశాడు. స్క్రీన్ ప్లే పరంగా కాస్త తడబడినా.. దర్శకుడిగా మాత్రం విజయం సాధించాడు కిరణ్ రాజ్. నోబిన్ పాల్ మ్యూజిక్ , బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయి. అరవింద్ కాశ్యప్ సినిమాటోగ్రఫీ కూడా అద్బుతంగా ఉంది. కశ్మీర్ నేపథ్యంలో వచ్చే సీన్స్ విజువల్‌గా అద్భుతంగా ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

నటీనటులు విషయానికి వస్తే…

కుక్క తో ఎమోషన్స్ పండిచటం అంటే డైరక్టర్ కు సవాలే. ఎంత ట్రైనింగ్ ఇచ్చిన కుక్క అయినా.. కెమెరా ముందు చెప్పినట్లు వినదు. కాబట్టి డైరక్టర్, ఆయన టీమ్ తో పాటు దర్శక కుక్కతో కుస్తీ పడుతూ నటించిన రక్షిత్ శెట్టి ఓపికను మెచ్చుకోవాల్సిందే. చిన్న క్యారక్టరే అయినా .. హీరోయిన్ సంగీత ఆకట్టుకుంది. రాజ్ బి శెట్టి డాగ్ డాక్టర్ గా తన కామెడీ టైమింగ్ తో అలరించాడు. ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా కామియో కూడా ఆకట్టుకుంటుంది.

చూడచ్చా…

పెట్ లవర్స్ కు బాగా నచ్చే సినిమా 777 చార్లీ. మిగతా వాళ్లు పిల్లలతో కలిసి ఓ ట్రైల్ వేయచ్చు. ‘ఛార్లి 777’ మిమ్మ‌ల్ని న‌వ్విస్తుంది, ఏడిపిస్తుంది.. థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు న‌వ్వు ముఖంతో బ‌య‌ట‌కు వ‌స్తారు.

బ్యాన‌ర్‌: ప‌ర‌మ్ వ‌హ్ స్టూడియోస్‌
నటీనటులు: ర‌క్షిత్ శెట్టి, సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ త‌దిత‌రులు
సంగీతం: నోబిన్ పాల్‌
సినిమాటోగ్ర‌ఫీ: అర‌వింద్ ఎస్‌.క‌శ్య‌ప్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైనర్ : ఉల్లాస్ హైదుర్‌
ఎడిట‌ర్‌: ప్ర‌తీక్ శెట్టి
డైలాగ్స్‌: కిర‌ణ్ రాజ్.కె, రాజ్ బి.శెట్టి, అభిజీత్ మ‌హేశ్‌, కె.ఎన్‌.విజ‌య్ కుమార్ (తెలుగు)
స్టంట్స్‌: విక్ర‌మ్ మోర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: బినాయ్ కందేల్‌వాల్‌, సుధీ డి.ఎస్‌
కాస్ట్యూమ్స్ : ప్ర‌గ‌తి రిష‌బ్ శెట్టి
కానినె ట్రైన‌ర్ : ప్ర‌మోద్ బి.సి
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: కిర‌ణ్ రాజ్‌.కె
నిర్మాత‌లు: జి.ఎస్‌.గుప్తా, ర‌క్షిత్ శెట్టి
రన్ టైమ్: 2 గంటల 16 నిముషాలు
విడుదల తేదీ: జూన్ 10, 2022