83 మూవీ రివ్యూ

Published On: December 24, 2021   |   Posted By:

రణ్‌వీర్‌ సింగ్ “83” మూవీ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

👍

ఈ మధ్యకాలంలో సిని అభిమానులు ఎక్కువగా ఎదురుచూసిన చిత్రాలలో ఒకటి ‘83’. టీమ్‌ఇండియా మాజీ సారథి, 1983 ప్రపంచకప్‌ విజేత జట్టు కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం . కపిల్‌దేవ్‌ పాత్రను రణ్‌వీర్‌సింగ్‌ పోషించారు. కపిల్‌దేవ్‌ భార్యగా రణ్‌వీర్‌ సరసన దీపికా పదుకొణె నటించారు. కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది. చిత్రంలో అప్పటి ప్రపంచకప్‌ ఎలా సాగిందో చూపించే ప్రయత్నం చేశారు. మెగా టోర్నీలో భారత జట్టు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆనందక్షణాలను మరోసారి ఈ సినిమా రివైండ్ చేస్తుందని ట్రైలర్ వచ్చినప్పటినుంచి క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది…అభిమానుల అంచనాలకు అందుకుందా వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

అప్పటిదాకా ఇండియా క్రికెట్ టీమ్‌ను ఒక జట్టుగా కూడా పరిగణించలేదు క్రీడా ప్రపంచం. అనేక అవమానాలు..అందరిలో అనుమానాలు. ఈ నేపధ్యంలో
భారత జట్టు ప్రపంచ కప్‌ పోటీల కోసం ఇంగ్లండ్‌ బయలుదేరింది. జట్టు మీద అసలు ఎవరికీ ఎక్సపెక్టేషన్స్ లేవు. అక్కడ జరిగిన వార్మప్‌ మ్యాచ్‌ చాలా పేలవంగా జరిగింది . ఆ తర్వాత జరిగి మ్యాచుల్లో వెస్టిండిస్, జింబాబ్వే జట్లతో గెలుపు.. తర్వాత వరుసగా జట్టు ఓటమి. అప్పుడు ప్రపంచానికి పరిచయం అయ్యాడు ఓ క్రికెట్ వీరుడు. అతనే కపిల్ దేవ్. ఇంక భారత్ వెనక్కి తిరుగుతుందా అన్న పరిస్దితుల్లో కపిల్ దేవ్ తన క్రీడా నైపుణ్యంతో , ఓ విధమైన కసితో క్రికెట్ పిచ్ పై చెలరేగిపోయారు. అప్పటిదాకా ఎవరూ ఊహించని విజృంభణ అది. అప్పటికే రెండు సార్లు ప్రపంచకప్‌ గెలుచుకున్న వెస్టండీస్‌ ప్రత్యర్ది. వారిపై ఎలాంటి ఎక్సపెక్టేషన్స్ లేని భారత్‌ గెలిచింది. వరల్డ్‌ కప్‌ ని వీరోచితంగా పోరాడి కొల‍్లగొట్టింది. ఈ క్రమంలో జరిగిన తుది పోరు.. ఉత్కంఠగా సాగిన ఇండియన్‌ క్రికెటర్ల పోరాటమే ఈ సినిమా. మధ్య మధ్యలవో క్రికటర్స్ కు కుటుంబ సభ్యులకు ఉన్న రిలేషన్‌ ఎలా ఉంది. వరల్డ్‌ కప్‌ గు కప్‌ గెలవడానికి ముందు క్రికెట్‌లో ఇండియాను ..ప్రపంచం ఎలా చూసింది, ఆ పరిస్దితిని మార్చిన ఓ విజేత కథే 83.

విశ్లేషణ

గత కొంతకాలంగా దాదాపు అన్ని చిత్ర పరిశ్రమలలో బయోపిక్స్‌ ట్రెండ్ నడుస్తోంది చరిత్రలో జరిగిన ముఖ్య సంఘటన ఆధారంగా మన దర్శక, నిర్మాతలు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అందులో ఎక్కువగా క్రీడలతో లింక్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలుస్తున్నాయి. అదే కోవలో దాదాపు 38 ఏళ్ళ కింద అందించిన మధురమైన విజయం 1983 వరల్డ్ కప్. దాన్ని తెరపై చూపాలనే ఐడియానే అద్బుతం అని చెప్పాలి.

‘అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి ఊహించని విధంగా విజయం సాధించిన నిజ జీవిత అద్భుతమైన కథ ’ ఇది. ఈ కథ ఓ తరానికి ఇప్పటికి కళ్ళకు కట్టినట్లే ఉంటుంది. దాన్ని ఈ తరానికి ఆసక్తిగా అందించటమే దర్శకుడు చేసిన పని. భార‌త క్రీడా చరిత్ర‌లో ఎప్పటికి మర్చిపోలేని సంవత్సరం “1983” అనేదాన్ని మరోసారి గుర్తు చేసారు. ముఖ్యంగా 1983 నాటి ఇండియా వరల్డ్ కప్ గెలవటానికి ముందు ఉన్న వాస్తవ పరిస్దితులను ఈ సినిమా మన ముందు పరుస్తూ సినిమాని ఓపెన్ చెయ్యటం బాగుంది. అలాగే వరల్డ్ కప్ ను గెలుచుకున్న క్రమాన్ని, ఆ క్రమంలో ఎదురుకున్న ఇబ్బందులను, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను స్ఫష్టంగా చూపించారు. అయితే కపిల్ దేవ్ జీవితం గమనం ఏమిటి ? ఆయన సాధించిన విజయాల వివరాలు తాలూకు సంఘటనల ఏమిటి మాత్రం పెద్దగా మనకు ఈ సినిమాలో కనపడదు. ఇది కపిల్ దేవ్ బయోపిక్ కాదు కదా అని ప్రక్కన పెట్టినట్లున్నారు. అయితే కపిల్ దేవ్ పర్సనల్ లైఫ్ పాయింటాఫ్ నుంచి కథ చెప్తే బాగుండేది. కపిల్ దేవ్ కెప్టెన్‌గా ఎలా ఎదిగాడు? లాంటివి ఉంటే మరింత ఇంట్రస్టింగ్ గా ఉండేదనటంలో సందేహం లేదు. అయితే 83 చిత్రం ఓ సినిమాగా కాకుండా… కులం, మతం, ప్రాంతాలను ఏకం చేసే ఒక ఎమోషనల్ జర్నీ గా దీన్ని మలిచే ప్రయత్నం చేసారు. ఈ మేరకు స్క్రీన్ ప్లే రాసుకున్నారు. కాకపోతే ఒక్క వరల్డ్ కప్ మీదే కాన్సర్టేట్ చేసి పూర్తి డీటైలింగ్‌తో కథ చెప్పే సరికి సినిమా అంతా బాగా స్లోగా సాగిన ఫీలింగ్ వచ్చింది. రన్‌ టైమ్ కూడా ఎక్కువే అనిపించింది. ఎందుకంటే కేవలం క్రీడాభిమానులే కాకుండా సినిమాని ఇష్టపడేవాళ్ళూ ఈ సినిమాకు వెళ్తారు కాబట్టి. దర్శకుడు స్లో మోషన్‌ను సృజనాత్మకంగా వాడుకుని క్లిష్టమయిన షాట్‌లతో ప్రేక్షకుడికి ఆట అర్ధమయ్యేలా చేసారు.

టెక్నికల్ గా …

బయోగ్రఫీ సినిమాల నిర్మాణం అనుకున్నంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా ప్రధాన పాత్రలు బ్రతికుండి కళ్ళదెరుగా తిరుగుతూంటే మరీ కష్టం. సినిమా అటూ ఇటూ అయితే ఖచ్చితంగా సినిమా తీయటంలో తొందరపడ్డారంటారు. కబీర్ ఖాన్ అవన్ని గుర్తు పెట్టుకున్నారు. అప్పటి జట్టు సారథి కపిల్ దేవ్‌తో పాటు అప్పటి జట్టు సభ్యులను కలిసి ఆనాటి పరిస్థితులను రీ క్రియేట్ చేసారు. అపుడు జరిగిన కొన్ని వివాదాలను ఇందులో చూపించారు. దాంతో చాలా భాగం సినిమా ఆసక్తికరంగానే సాగుతుంది. తెరపై కనబడే సీన్స్ ని ఆసక్తిగానే చూస్తూంటాం. చాలా దృశ్యాలకి స్పందిస్తాము. ఇలాంటి సినిమాల్లో ప్రధానపాత్ర పట్ల ప్రేక్షకులకు అభిమానం కలగాలి. ఆ పాత్ర పట్టుదల, దీక్ష, లక్ష్య సాధన కోసం చేసిన త్యాగాలవంటి అంశాలపై ప్రేక్షకులకు ఉత్సాహం కలిగాలి. వారితో ఎమోషనల్ జర్నీ చేయాలి. అయితే కేవలం 83 అనేది ఆ కాలంలో జరిగిన ఓ అద్బుత సంఘటనగానే ప్రజెంట్ చేసారు. కానీ కపిల్ దేవ్ ని ప్రత్యేకంగా సెంటర్ చేయలేదు. ఇందుకు ప్రధాన కారణం సినిమా స్క్రిప్టు –కపిల్ దేవ్ మనస్తత్వం, వ్యక్తిత్వం వంటి విషయాలలోతులోకి వెళ్ళకపోవటం, అందుకు తగ్గ దృశ్యాలను రచించకపోవటం జరిగింది. అయినా సినిమా స్లో నేరేషన్ తప్పించి ఎక్కడా ఇబ్బంది అనిపించదు. మేకింగ్ పరంగా కూడా సినిమా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ మామూలుగా లేవు. సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ అని చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా సార్లు కాపాడింది. ఎడిటింగ్ కూడా ప్లస్ అయ్యింది. టెక్నికల్‌గా 83 చాలా రిచ్‌గా ఉందనే చెప్పాలి.

నటీనటుల విషయానికి వస్తే..

కపిల్ దేవ్ పాత్రలో రణ్ వీర్ సింగ్ జీవించాడు. కొన్ని షాట్స్ లో రణ్ వీర్ సింగ్ కాదు కపిల్ దేవ్ తెర మీద ఉన్నాడా అనిపిస్తుంది. కృష్ణమాచారిగా జీవా , కపిల్ దేవ్ భార్య రోమి భాటియా పాత్రలో నటించిన దీపికా పదుకొనే ఉన్నంత సేపు పాత్రకు లైఫ్ ఇచ్చింది.

ప్లస్ లు : రణ్ వీర్ సింగ్
సెకండాఫ్
సినిమాటోగ్రఫీ
క్లైమాక్స్

మైనస్ లు:

ఫస్ట్ ఆఫ్ లో కథ సెటప్ కే ఎక్కువ టైమ్ తీసుకోవటం
స్లో నేరేషన్

చూడచ్చా

పిల్లలతో ఒక్కసారి తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. కనీసం పిల్లల దృష్టి ఆటవైపు కాస్సేపయినా మళ్ళుతుంది. ఓ చరిత్రను పరిచయం చేసినట్లు అవుతుంది.

ఎవరెవరు..

నటీనటులు: రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొణె, పంకజ్‌ త్రిపాఠి, తాహిర్‌ రాజ్, జీవా, తఖీబ్‌ సలీం, జతిన్, చిరాగ్‌పాటిల్, తదితరులు;
సంగీతం: జులీస్‌ పాకియమ్, ప్రీతమ్;
సినిమాటోగ్రఫీ: అసీమ్‌ మిశ్రా;
నిర్మాణ సంస్థ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటమ్‌ ఫిల్మ్స్, విబ్రి మీడియా, కా ప్రొడక్షన్స్, నదియవాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్, కబీర్‌ఖాన్‌ ఫిల్మ్స్; దర్శకత్వం: కబీర్‌ఖాన్;
నిర్మాతలు: మధు మంతెన, విష్ణు ఇందూరి
విడుదల: 24-12-2021.
రన్ టైమ్: 2h 32m