‘మెమరీ లాస్’ తో మంగళం మహత్ (‘పడి పడి లేచె మనసు’ రివ్యూ)
రేటింగ్ : 2/5
తెలుగు సినిమా మళ్లీ ‘వసంత కోకిల’ రోజుల్లోకి వెళ్తోంది. తలకు దెబ్బ తగలటాలు..మెమరీలు లాస్ అవ్వటాలు అనే కాంఫ్లిక్ట్ ని బ్రతికించే ప్రయత్నం చేస్తోంది. A Moment to Remember (2004) అనే కొరియా సినిమాని దర్శకులు మర్చిపోలేక, మనస్సులోంచి పోక అలాంటి కథలే ఉత్సాహంగా అల్లేస్తున్నారు. అయితే దురదృష్టమేమిటంటే…ప్రేక్షకులకు మెమరీలాస్ లేదు. వాళ్లు చాలా విషయాలు..ముఖ్యంగా సినిమా కథలు గుర్తు పెట్టేసుకుంటున్నారు. అప్పుడు చేసేదేముంటుంది. వాళ్లకు మన సినిమా చూసేటప్పుడైనా మెమరీలాస్ రావాలని దేవుడికి దణ్ణం పెట్టడం తప్ప. ఈ రోజు రిలీజైన ‘పడి పడి లేచె మనసు’కూడా మెమరీలాస్ చుట్టూ తిరుగుతుంది. అదేంటి మొన్నీ మధ్యనే కదా…తేజూ ఐలవ్యూ అంటూ మతిమరుపు కథ వచ్చిందికదా అనిపిస్తోందా…ఏం చేస్తాం..ముందే చెప్పుకున్నాం కదా ఇది మతిమరుపు సీజన్ అని. ఇంతకీ ఈ సినిమా కథేంటి..వర్కవుట్ అవుతుందా అంటారా అయితే రివ్యూలో కి వెళ్లిపోదాం.
కథేంటి
సింపుల్ గా చెప్పుకుంటే…ఫుట్ బాల్ ప్లేయర్ సూర్య (శర్వానంద్) కు మెడికో వైశాలి (సాయిపల్లవి) పిచ్చి ప్రేమ. వాళ్లిద్దరూ ఫస్టాఫ్ అంతా ప్రేమించుకుంటారు. పెళ్లికి రెడీ అవుతారు. అయితే ఓ రోజు చిన్న జ్ఞానోదయం జరిగి సూర్య..అబ్బబ్బే..పెళ్లి చేసుకుంటే ప్రేమ అనేది ఉండదు. ఇద్దరు కలిసి ఉండటానికి పెళ్లి చేసుకోవటం ఏమిటి…కలిసి ఉండలేకపోతే బ్రతకలేం అనుకున్నప్పుడే పెళ్లి చేసుకోవాలి అని ఓ వింత లాజిక్ చెప్పి ఆమెను లాక్ చేస్తాడు. ఆమెకు ఆ లాజిక్ అర్దమైందో లేదో కానీ సరేనని ..ప్రస్తుతానికి ఇద్దరం విడిపోయి ఓ ఏడాది గడుపుదాం.అప్పుడు మనకు విడిపోయి ఉండగలుగుతున్నామో, లేక పోతే విడిపోతే బ్రతకలేం అనిపిస్తుందో ప్రాక్టికల్ గా చూద్దాం అనుకుని ఇద్దరూ విడిపోతారు. ఏడాది గడిచి కలిసే సమయానికి …వీళ్లు కలవటం ఇష్టం లేనట్లుగా ఓ ప్రకృతి భీభత్సం వచ్చి..ఆమెకు మెమరీ లాస్ చేసేస్తుంది. అక్కడ నుంచి వీళ్లిద్దరూ కలుస్తారా..కలవరా..కలిస్తే ఇద్దరూ ప్రేమను కొనసాగిస్తారా లేదా అనే విషయం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
రెండు కథలు…ఒకటే సినిమా
ఈ సినిమాకు ప్రధాన సమస్య మరో చరిత్రలాంటి ఓ కాంప్లిక్ట్, మరొకటి..మెమెరీలాస్. ఏది హైలెట్ చేయాలి..ఏది ప్రధాన కాంప్లిక్ట్ చేయాలి, ఏది సబ్ ప్లాట్ చేయాలి అనేది కన్ఫూజ్ అయ్యారని అర్దమవుతుంది. అలాగే ఈ రెండు కాంప్లిక్ట్ లో ఏదీ కొత్తది కాకపోవటం సినిమాకు పాత వాసన తెచ్చేసింది. అలా కాకుండా ఏదో ఒక థ్రెడ్డే పట్టుకుని చివరి దాకా వెళ్లాల్సింది. అప్పుడు చూసేవారికి ఇబ్బంది ఉండదు.
కలర్ ఫుల్లే కానీ…
సినిమా మొత్తం దర్శకుడు హను రాఘవపూడి మణిరత్నం స్దాయిలో కలర్ ఫుల్ విజువల్స్ తో నింపేసాడు. అయితే ఎంచుకున్న కథ ఏ సమస్య అయితే ఆ కథకు తీసుకున్న లీడ్ పెయిర్…ఏదో ఇంకా టీనేజ్ పిల్లల్లా మాట్లాడుకుంటూ…చిత్రమైన లాజిక్ లతో లాక్ చేసుకుని విడిపోవటం వంటివి కన్వీసింగ్ గా ఉండవు. ఈ కాలంలో యూత్ అంతలా టెస్ట్ లు పెట్టుకుందాం విడిపోదాం అనే ప్రపోజల్ పెట్టదు. అలాగే దర్శకుడు ప్రతీది కవితాత్మకగా చూపించాలనే తపనతో ఫ్రేమ్స్ వరస పెట్టుకుంటూ వెళ్లిపోయాడే కానీ విషయం మాయమైపోతోందని గమనించలేదు.
సాంకేతికంగా..
దర్శకుడు గా స్క్రిప్టు విషయంలో తప్ప మిగతా వాటిల్లో ఎక్కడా హనుకు వంక పెట్టలేం. అంతలా షాట్స్ కంపోజింగ్ ఉంది. ఆయనకు గుమ్మడి జయకృష్ణ సినిమాటోగ్రఫి బాగా ప్లస్ అయ్యింది. ఓ పీసి శ్రీరామ్ లా అందాలను అలవోకగా బంధించారు. లవ్ స్టోరీలకు కావాల్సిన సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందించారు.అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం సినిమాకు హైలెట్ గా ఉంది. ఆర్ట్ వర్క్ సైతం సూపర్బ్ అనిపిస్తుంది.సెకండాఫ్ బోర్ వచ్చినప్పుడు ఎడిటర్ మీదే కోపం వస్తుంది. చివరికు కథ,కథనం ఎప్పుడూ కత్తిలా సూటిగా దూసుకోపోలి తప్ప పడుతూ లేవకూడదు.
తెర వెనక..తెర ముందు
నటీనటులు: శర్వానంద్, సాయిపల్లవి, మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఛాయాగ్రహణం: జయకృష్ణ గుమ్మడి
కూర్పు: ఎ.శ్రీకర్‌ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకుడు: హను రాఘవపూడి
సంస్థ: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
విడుదల: 21 డిసెంబరు 2018