సూర్యాస్తమయం చిత్రం ఫిబ్రవరి విడుదల
బండి సరోజ్ కుమార్ చిత్రం సూర్యాస్తమయం
తొలి కాపీ సిద్ధం
ఫిబ్రవరి ద్వితీయార్ధంలో విడుదల!
పక్కా ప్రణాళిక, మొక్కవోని దీక్ష ఉండాలేగానీ కొండల్ని సైతం పిండి చేయొచ్చు అని అంటారు. అదే నమ్మకంతో బండి సరోజ్‌కుమార్ ప్రయత్నించి ఫలితం చూశారు. సినిమా అంటేనే 24 శాఖల సమ్మిళితం. అందులో 11 శాఖలను ఒంటి చేతి మీద నిర్వహించి అరుదైన ఫీట్ చేశారు బండి సరోజ్ కుమార్. ఆయనే కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు రాసి సంగీతాన్ని సమకూర్చి, స్టంట్లు డిజైన్ చేసి, సినిమాటోగ్రాఫీని హ్యాండిల్ చేసి, ఎడిటింగ్ బాధ్యతలను భుజానికెత్తుకుని, ప్రొడక్షన్ డిజైన్ చేసుకుని ప్రధాన పాత్రలో నటించిన `సూర్యాస్తమయం` తొలి కాపీ సిద్ధమైంది. ఓజో మీడియా పతాకంపై రఘు పిల్లుట్ల, రవికుమార్ సుదర్శి నిర్మించిన చిత్రం `సూర్యాస్తమయం`. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా బండి సరోజ్‌కుమార్ మాట్లాడుతూ “ఇటీవల విడుదల చేసిన `ఉరిమే మేఘం స్నేహం, కురిసే వర్షం స్నేహం..` అనే పాటకు చాలా మంచి స్పందన వస్తోంది. స్నేహం గురించి పదికాలాల పాటు నిలిచిపోయే అద్భుతమైన పాట చేశావని పలువురు ప్రశంసిస్తున్నారు. నేను రాసిన పాటకు, సమకూర్చిన బాణీకి గాయకుడు శ్రీకర్ జొన్నలగడ్డ న్యాయం చేశారు. ఆయన గాత్రంలో పాట వినసొంపుగా ఉంది. సినిమాలోని ప్రతి పాటా అదే స్థాయిలో ఉంటుంది. `సూర్యాస్తమయం` ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సహజసిద్ధమైన లొకేషన్లలో ఆర్టిస్టులకు ఎలాంటి మేకప్ ఉపయోగించకుండా, చాలా నేచురల్‌గా తెరకెక్కించాం. ఇది నేచురల్ యాక్షన్ మూవీ. ఒక పోలీస్‌కీ, గ్యాంగ్‌స్టర్‌కీ మధ్య జరిగే అంతర్యుద్ధం ఈ సినిమాలో ప్రధాన కథాంశం. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నేను, గ్యాంగ్‌స్టర్‌గా త్రిశూల్ రుద్ర యాక్ట్ చేశాం. తమిళ నటుడు డేనియల్ బాలాజీ కీలకమైన పాత్ర పోషించారు. హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, రామోజీ ఫిల్మ్ సిటీ, కడప, కర్ణాటకల్లో చిత్రీకరణ జరిపాం. తొలి కాపీ సిద్ధమైంది. త్వరలోనే ట్రైలర్‌ని, ఫిబ్రవరి ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం“ అని తెలిపారు.
త్రిశూల్ రుద్ర, హిమాన్సీ కాట్రగడ్డ, బండి సరోజ్ కుమార్, కావ్యా సురేష్, డేనియల్ బాలాజీ, మాస్టర్ అక్షిత్, మాస్టర్ చరణ్ సాయికిరణ్, బేబీ శర్వాణీ, మోహన్ సేనాపతి, వివేక్ ఠాకూర్, సాయిచంద్, కేకే బినోజీ, ప్రేమ్‌కుమార్ పాట్రా, షానీ, వంశీ పసలపూడి, శరత్‌కుమార్ తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం.
ఈ చిత్రానికి డీటీయస్ మిక్సింగ్: వాసుదేవన్, డీ ఐ కలరిస్ట్: ఎం. మురుగన్.