విజయనిర్మల పుట్టినరోజు వేడుకలు
అభిమానుల అభిమానమే నా ఆయుష్షు – శ్రీమతి విజయనిర్మల
ప్రముఖ నటి, నిర్మాత, అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన శ్రీమతి విజయనిర్మల 74వ పుట్టినరోజు వేడుకలు ఫిబ్రవరి 20న హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ఆమె నివాసంలో దేశం నలుమూలల నుండి వచ్చిన అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీమతి విజయనిర్మల పుట్టినరోజు కేక్‌ను కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ, సీనియర్ నటి జయసుధ, నటుడు నరేష్, నిర్మాత శాఖమూరి మల్లికార్జునరావు, నిర్మాత బి.ఎ. రాజు, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నిర్మాత సురేష్ కొండేటి, నటి గీతా సింగ్ పాల్గొని శ్రీమతి విజయనిర్మలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా… సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ – ”విజయ నిర్మలగారు ‘మా’ అసోసియేషన్‌ను ప్రాణంగా చూసుకుంటూ ప్రతి సంవత్సరం డొనేషన్‌లు ఇస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ‘మా’ అసోసియేషన్‌కు ఇంతవరకూ ఎవ్వరూ ఇవ్వనంత డొనేషన్ ఇచ్చి తన సహృదయాన్ని మరోసారి చాటుకున్నారు. ఎన్నో దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానుల అభిమానం వల్లే మేమింత సంతోషంగా ఉండగలుగుతున్నాం. విజయనిర్మల ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.
శ్రీమతి విజయనిర్మల మాట్లాడుతూ – ”దేశం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. మీ అభిమానమే నా ఆయుష్షు. ఒక సందర్భంలో దాసరి నారాయణరావుగారు నన్ను అడిగారు. ‘మీరు సినిమాలు మానేసి చాలాకాలం అయ్యింది కదా! అయినా ఇంతమంది అభిమానులు మీ పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా ఎలా నిర్వహిస్తున్నారు’ అని. ఆ సంవత్సరం నా పుట్టినరోజు వేడుకలకు దాసరిగారు కూడా హాజరై దేశం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులను చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు నేను ఆయనకి చెప్పాను. ‘వాళ్ళకు నా మీద ఉన్న అభిమానం, నాకు వాళ్ళ మీద ఉన్న అభిమానంతోనే అంతమంది అభిమానులు వచ్చారు. మీ అందరి మధ్య నా పుట్టినరోజు వేడులు జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది” అన్నారు.
సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ – ”రాష్ట్ర నలుమూలల నుండి, ‘మా’ అసోసియేషన్ నుండి ఆదర్శ దంపతులను దీవించడానికి వచ్చిన అభిమానులకు నా ధన్యవాదాలు. విజయనిర్మలగారు ‘మా’ అసోసియేషన్‌పై ఎంతో ప్రేమతో ప్రతి నెలా రూ. 15,000, ‘మా’ కళ్యాణ లక్ష్మి`కి ఒక లక్ష రూపాయలు ఇస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం తన 74వ పుట్టినరోజు సందర్భంగా రూ. 74,000 అసోసియేషన్‌కు అందజేశారు. ఇటీవల పుల్వామా ఘటనలో మరణించిన వీర సైనికుల కుటుంబాలకు మా కుటుంబం తరపున లక్ష రూపాయలు చెక్కు రూపంలో పంపడం జరిగింది. ప్రతి సంవత్సరం ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ తనవంతు సహాయ సహకారాలను అందిస్తున్న విజయనిర్మలగారు ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అద్యక్షులు దుడ్డి రాంబాబు, ప్రధాన కార్యదర్శి టి.మల్లేష్, ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేన అద్యక్షులు ఖాదర్ గోరి తదితరులు పాల్గ్గొన్నారు.