Reading Time: 3 mins

ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు మూవీ రివ్యూ

చంద్రబాబే నాయకుడు (ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు రివ్యూ)

రేటింగ్ :  2.5/5

కథనాయకుడు ఖర్చైపోయింది. కొసరు మిగిలిన మహానాయకుడు మునిగిపోకుండా తేల్చాలి. ఇది పార్టీ వాళ్లు, డిస్ట్రిబ్యూటర్స్, దర్శక,నిర్మాతలు ముక్కోటి దేవతలను కోరుకున్న మాట. అయితే ఆ దేవతలు కన్నా ప్రేక్షకులు చాలా పవర్ ఫుల్ అని చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. మరి ఈ సారి మహానాయకుడు ఎలాంటి రిజల్ట్ ఇచ్చారు. బాలయ్యకు ఈ సినిమా ఏమన్నా లాభాలు తెచ్చిపెడుతుందా..అంతర్గత లక్ష్యమైన పార్టీ ప్రచారానికి ఈ సినిమా ఏ మాత్రం ఉపయోగపడుతుంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ ఏంటి

బయోపిక్ లలో చెప్పబడినదాన్ని కథ అంటే దాన్ని అవమానం చేసినట్లే. కానీ ఊహలేకుండా బయోపిక్ ఉండదు కాబట్టి…దాన్ని కథ అనుకుంటా చెప్పుకుందాం. నందమూరి తారక రామారావు (బాలకృష్ణ ) తెలుగు దేశం పార్టీ పెట్టి.. కేవలం తొమ్మిది నెలల్లోనే తన ఇమేజ్ ని పెట్టుబడిగా పెట్టి ప్రచారం చేసి  అఖండ విజయం సాధిస్తారు.  ఆ తర్వాత ప్రచారంలో తను చేసిన హామీలను నెరవేర్చటం కోసం…ప్రజలకు తను ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని ఎన్నో మంచి పనులు చేస్తారు. అనేక పథకాలు అమలు చేస్తారు. అయితే ఈలోగా ఆయన భార్య బసవతారకం (విద్యాబాలన్)కు కాన్సర్ రావటం, హార్ట్ ప్లాబ్లం రావటంతో అమెరికా తీసుకెళ్లాల్సి వస్తుంది. అక్కడ ట్రీట్మెంట్ చేయించి వచ్చేసరికి ఇక్కడ తన నమ్మి, తన వెనక తిరిగిన నాదెండ్ల భాస్కరరావు కుర్చీ లాగేస్తాడు. కాంగ్రేస్ పార్టీ అండతో చేసిన ఈ పనికి షాక్ అయ్యిన ఎన్టీఆర్…తిరిగి కొన్ని నాటకీయ పరిణామాల మధ్య…తన అల్లుడు చంద్రబాబు (రానా) అండతో  తిరిగి ఎన్టీఆర్ ఎలా ముఖ్యమంత్రి అవుతారు.  ఆ క్రమంలో ఎన్టీఆర్ ఎలాంటి అవమానాలను ఎదురుకున్నారు ? ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవ్వడానికి చంద్రబాబు చేసిన కృషి ఏమిటి ? వంటి  విషయాలు తెలియాలంటే  ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ఇదేం న్యాయం

ఈ సినిమా ఏ ప్రయోజనం ఆశించి తీసారో చూసే వాళ్లలో నూటికి నూరు శాతం మందికి తెలుసు.
అలాంటిది డైరక్టర్ కు  తెలియకుండా ఎలా ఉంటుంది. ఆయన కూడా నిర్మాతల ఉద్దేశాన్ని బుర్రలోకి ఎక్కించుకుని బుర్రా సాయి మాధవ్ చేత స్క్రిప్టు రాయించుకున్నారు. దాంతో ఈ సినిమా మొదటి నుంచి ప్రచారం చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ బయోపిక్ గా కాకుండా చంద్రబాబు గొప్పతనాన్ని వివరించే ఓ భజనపిక్ గా మారింది. 

అయితే ఇక్కడ దర్శకుడు క్రిష్ తెలివైనవాడు, బ్రిలియెంట్ అనే విషయం మర్చిపోకూడదు. డైరక్ట్ గా చంద్రబాబుని ఎలివేట్ చేయకుండా ఎన్టీఆర్ ని అడ్డం పెట్టి…ఆయన్ని డిల్లీలో పెట్టి..చంద్రబాబు ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీని నిలబెట్టారని వివరించారు.  కాబట్టి తెలుగుదేశానికి ఆయన నాయకుడు..ఆ పార్టినుంచి ముఖ్యమంత్రి అవటంలో తప్పేమి లేదు..తప్పదు..అంతటి వారు పార్టీలో లేరు..వేరే ఆల్టర్నేటివ్  లేదు అన్న ధృక్పధాన్ని తెలివిగా చొప్పించే ప్రయత్నం చేసారు. 

అఫ్ కోర్స్ చంద్రబాబు సమర్దడే…అది కాదననేని సత్యం. అయితే అదేదో ఆయన పాయింటాఫ్ వ్యూలోనే సినిమా ఓపెన్ చేసి…పార్టీని సంక్షోభ సమయంలో ఆదుకున్న ఆపద్భాంధవుడుగా చూపితే సరిపోయేదిగా. యాత్ర సినిమాలా ఓ ఈవెంట్ బేసెడ్ కథ అనుకుంటే జస్టిఫై అయ్యేది కదా. అదేమీ కాకుండా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నాం చూతుము రారండి అని పిలిచి..చంద్రబాబు కథ చెప్పటం న్యాయమా   ఇంట్రస్ట్ ఏమి ఉంటుంది

నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ అనేది ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో గొప్ప మలుపే అనేది కాదనలేని సత్యం. అయితే అంతమాత్రాన ఈ తరానికి నాదెండ్ల తెలియాలని రూల్ లేదు కదా. ఆయన లైమ్ లైట్ లో ఉండి ఉంటే..ఈ కథ ఇంట్రస్ట్ గా అనిపించేది. దాంతో నాదెండ్ల మీద ప్రత్యేకమైన కోపం రాదు..ఎన్టీఆర్ పై ప్రత్యేకమైన సానుభూతి పుట్టదు. దాంతో కథ మొత్తం నాదెండ్ల,ఎన్టీఆర్, చంద్రబాబుల మధ్య తిరిగటంతో పెద్దగా ఇంపాక్ట్ రాలేదు. 

సాంకేతికంగా ..

దర్శకుడుగా  క్రిష్ రాణించనంతగా రచయితగా కాలేకపోయారు . పొలిటికల్ ఫిల్మ్ నుంచి ఏమి ఆశిస్తారు అనేది చూసుకోకుండా  ఎమోషనల్ సన్నివేశాలతో నింపేసి బోర్ కొట్టించేసారు. అయితే అదే సమయంలో సాయిమాధవ్ బుర్రా మాటలు  సినిమాకు ప్లస్ అయ్యాయి. సంగీత దర్శకుడుగా  కీరవాణి ని ఎందుకు ఎంచుకున్నారు అనేది ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని చూస్తే అర్దమవుతుంది.  జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది.  ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త పాస్ట్ గా ఉండేలా చూసుకోవాల్సింది.  నిర్మాణ సంస్థలు ఎన్ బి కె ఫిలిమ్స్ . వారాహి , విబ్రి మీడియా నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.  

డైలాగ్స్  సూపర్బ్

‘నిశబ్దాన్ని చేతగాని తనం అనుకోవద్దు.. మౌనం మారణాయుధంతో సమానం అని మరిచిపోవద్దు’, ‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను’ వంటివాటికి  మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే  అధిష్టానం ఆదేశిస్తే..పిల్ల నిచ్చిన మామ గారి పైన అయినా పోటీకి సిద్ధం అంటూ చంద్రబాబు చెప్పే డైలాగు హైలెట్ గా నిలిచింది.

బాలయ్య ఎలా చేసారు

తొలి చిత్రంలో బాలకృష్ణ ..పాత్రకు తగ్గట్లుగా  లేరంటూ విమర్శలు వచ్చాయి. ఆయన వయస్సు..ఎన్టీఆర్ యువకుడుగా ఉన్నప్పుడి వయస్సుకు సింక్ కాలేదు. కానీ ఇక్కడ ఈ సినిమాలో బాలయ్య …తన తండ్రి ఎన్టీఆర్ వయస్సుకు సమానంగా ఉండటం కలిసొచ్చింది. అలాగే చాలా సీన్స్ లో బాలయ్య తన తండ్రి ని గుర్తు చేసారు. ఇక విద్యాబాలన్  పాత్ర ఎమోషనల్ గా సాగింది. చంద్రబాబు పాత్రలో రానా, నాదెండ్ల భాస్కర్‌రావు పాత్రలో సచిన్‌ కేద్కర్‌లు ఆకట్టుకున్నారు. మిగతా పాత్రలు తమ పరిధి మేరకు నటించారు. 

ఆఖరి మాట

తెలుగుదేశం నిలబడటానికి చంద్రబాబు ఎంత కష్ట పడ్డారో  చెప్పాలనుకునేవాళ్లకు రిఫెరెన్స్ గా ఉపయోగపడుతుందీ చిత్రం.

ఎవరెవరు  

నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, ఆమని, కల్యాణ్‌రామ్‌, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా, సచిన్‌ ఖేడ్కర్‌, సుప్రియ వినోద్‌, పూనమ్‌ బజ్వా, మంజిమా మోహన్‌, వెన్నెల కిషోర్‌, భానుచందర్‌, తదితరులు

సంగీతం: ఎం.ఎం.కీరవాణి.సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వీఎస్‌. ఎడిటింగ్‌: అర్రం రామకృష్ణ. సంభాషణలు: బుర్రా సాయిమాధవ్‌. నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి. దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి. సంస్థ: ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా. విడుదల తేదీ: 22-02-2019