Reading Time: 3 mins

తెలుగు సినీ ర‌చ‌యిత‌ల సంఘం ఆధ్య‌ర్యంలో సిరివెన్న‌ల సీతారామ‌శాస్ర్తికి ఘ‌నంగా స‌న్మానం!

ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్ర్తికి ఇటీవ‌లే  కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ శ్రీ పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  ఈ సందర్భంగా తెలుగు సినీ రచయితల సంఘం బుధవారం హైదరాబాద్‌లో సిరివెన్నెలని ఘనంగా సత్కరించింది. ఈ సంద‌ర్భంగా సిరివెన్న‌ల సీతారామ‌శాస్ర్తి మాట్లాడుతూ, `  కళలో సాహిత్యం అనేది అనేక రూపాలుగా ఉంటుంది. అందులో విశిష్టమైనది నాటకం. ఆ నాటకానికి సాంకేతిక రూపమే సినిమా. సినిమాకి ఔన్నత్యం ఎంత అనేది ప్రశ్నించ  రానిది. సమాజాన్ని నిలువెత్తు అద్దంలా చూపిస్తుంది సినిమా తెర. సినిమా అంత గొప్పది కాబట్టే నేను సినిమా రంగాన్ని దేవాలయంగా భావిస్తాను. నా మాట పద్మమై పుట్టాలనే తపనతోనే ప్రతి పాటనీ రాస్తుంటాను. అమ్మవారులందరికీ పాదపీఠం పద్మమే కాబట్టి వాళ్లందరి ఆశీస్సులతోనే ప్రేక్షకుల అభిరుచులకి తగ్గట్టుగా రాస్తున్నాను. సినిమా పాట రాయడమంటే తేలిక అనుకుంటారు చాలామంది. వైవీఎస్‌ చౌదరి ఒక సినిమా కోసం రామాయణాన్ని ఒక పాట రూపంలో చెప్పండన్నారు. అదొక సవాల్‌. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడే పాట రాశాను. గౌరవాన్ని పొందాను. పాట ద్వారా భావాన్ని వ్యక్తం చేయాలి. అందుకోసం నాకు సంతృప్తి లభించే వరకు రాస్తూనే ఉంటాను. సమాజాన్ని ప్రభావితం చేసే  అద్భుతమైన మాధ్యమం సినిమా. ప్రేమ, స్నేహం అనేవి పంచుకోగలిగేవి కాబట్టే నేను ఆత్మీయంగా అందరితో ఉండగలుగుతున్నాను. పాట రాయడం తేలిక కాదు. నా జీవిత   భాగస్వామి పేరు పద్మావతి. దాంతో నేను  పరిశ్రమలోకి వచ్చినప్పుడే పద్మశ్రీతో వచ్చాను. నాకు భారతరత్న రావాలని మనవాళ్లంతా అంటున్నారు. నా దృష్టిలో భారతీయుడు అంటేనే భారతరత్న. భ‌విష్య‌త్ లో మ‌రిన్ని మంచి పాట‌లు రాస్తాన‌ని`  అన్నారు. 

పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘తెలుగు చిత్ర పరిశ్రమలో మాకు బాగా పరిచయమైన రచయిత శ్రీశ్రీ. ఆ తర్వాత వేటూరి, సిరివెన్నెలలే. భావో   ద్వేగంతో పాటు భావ పూరితమైన పాటలు రాస్తుంటారు సిరివెన్నెల’ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘జగమంత కుటుంబం నాది…’ అని పాట రాసిన సిరి   వెన్నెల రచయితల కుటుంబం మొత్తానికీ గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆయనకీ,   రచయితలకీ మధ్య అన్నదమ్ముల సంబంధం ఉంటుంది. పద్మశ్రీ అనేది తెలుగు సినిమా రంగంలో చాలామంది నటులకి వచ్చింది,  దర్శకుల్లో రాజమౌళికీ, సాహితీవేత్తల్లో సినారెకీ వచ్చింది. సినీ గీత రచయితగా వచ్చింది మాత్రం సిరివెన్నెల గారికే’ అన్నారు. 

జొన్న విత్తుల మాట్లాడుతూ ‘‘ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పాట రాశారు సిరివెన్నెల. ఆయన పాటలో సాత్వికత ధ్వనిస్తుంది. ఆయన పాట సన్నివేశాలకి బలం చేకూరుస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా రచయితలతో మైత్రీ బంధాన్ని కొనసాగిస్తుంటారు. ఆయన మరెన్నో పాటలు రాయాలి, మరిన్ని అత్యున్నత పురస్కారాలు పొందాలి’ అన్నారు.
 వెన్న‌ల కంటి మాట్లాడుతూ, ` సిరివెన్న‌ల సినిమాల్లోకి రాక‌ముందు నుంచి ప‌రిచ‌యం. తొలిసారి సినిమా క‌వికి ప‌ద్మ  శ్రీ రావ‌డం గొప్ప కాదు. ప‌ద్మ శ్రీ కే సిరివెన్నెల వ‌న్నె తీసుకొచ్చారు. గొప్ప ప్ర‌తిభాశాలి. ఆయ‌న పాట‌లు స్ఫూర్తితో నేను ఇండ‌స్ర్టీలో నిల‌దొక్కుకున్నాను. అంత‌టి ట్యాలెంట్ కు భార‌తర‌త్న ఎందుకు రాకూడ‌దు. రావాల‌ని కోరుకుంటున్నా`అని అన్నారు.

రామజోగ‌య్య శాస్ర్తి మాట్లాడుతూ, ` మాలాంటి ర‌చ‌యిత‌ల్లో ఆయ‌న ఎంతో స్పూర్తి నింపారు. ఆయ‌న వ‌ద్ద శిష్య‌రికం చేసాన‌ని గ‌ర్వంగా చెప్పుకుంటున్నాను. ఆయ‌న పాట‌లు స‌మాజాన్ని ఎంతో ప్ర‌భావితం చేస్తాయి. అలాంటి ఎన్నో గొప్ప పాట‌లు రాసారు. ఇంకా రాస్తూనే ఉంటారు. ప్ర‌వ‌చ‌నాలు చెప్ప‌డం సుల‌వే. కానీ వాటిని పాటించేది అతి కొద్ది  మందే. సిరివెన్నెల గారు చెబుతారు. వాటిని పాటిస్తారు. ఎవ‌రు రాసిన పాట బాగున్నా ఫోన్ చేసి మెచ్చుకుంటారు. ఆయ‌న తో పాటు స‌మానంగా ద‌గ్గ‌ర కూర్చెబెట్టుకుని నిరుత్సాహ ప‌డేవారిని ప్రోత్స‌హిస్తారు. అలా నా విష‌యంలో చాలాసార్లు జ‌రిగింది. ఆయ‌న‌కు మ‌రిన్ని అవార్డులు రావాలి` అని అన్నారు.

ఆర్ .పి. ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ, ` సిరివెన్నల‌ గారికి ప‌ద్మ శ్రీ రావ‌డం రావ‌డం ఆల‌స్య‌మైంది. ప‌ద్మ విభూష‌ణ్ అయినా త‌ర్వ‌గా రావాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

వ‌డ్డే ప‌ల్లి కృష్ణ మాట్లాడుతూ, ` తొలి త‌రం క‌వుల్లో కృష్ణ‌శాస్ర్తి గారి సాహిత్యం గురించి చెప్పుకుంటే..ఈత‌రం క‌వుల్లో సిరివెన్న పాట‌ల గురించే మాట్లాడుకోవాలి. ఆయ‌న ఆత్మాభిమానం గ‌ల వ్య‌క్తి.  అది కొంద‌రిలో నెగిటివ్ గాను వెళ్లింది. ఇప్ప‌టివ‌ర‌కూ సినిమా కవుల్లో ఎవ‌రికి ప‌ద్మ శ్రీ రాలేదు. తొలిసారి సిరివెన్న‌ల  గారికి రావ‌డం ఎంతో గొప్ప విష‌యం` అని అన్నారు.

భాస్క‌ర భ‌ట్ల మాట్లాడుతూ, ` అంద‌రూ సినిమా హీరోల్ని చూడ‌టానికి హైద‌రాబాద్ వ‌స్తారు. కానీ నేను రాజ‌మండ్రి నుంచి సిరివెన్నెల‌ గారిని చూడ‌టానికి వ‌చ్చాను. నా ల‌క్ష్యానికి  ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌కం. ఆయ‌న స్ఫూర్తితోనే ర‌చ‌యిత‌న‌య్యాను.ఆయ‌న పాట‌లు ఊరిస్తాయి. లాలిస్తాయి. పాలిస్తాయి` అని అన్నారు.

బుర్రా సాయిమాధ‌వ్ మాట్లాడుతూ, ` ఇటీవ‌ల కాలంలో అవార్డుల గౌర‌వం ద‌క్కింది. అవార్డులంటే! ఏముందులే కొనుక్కుంటే ఎవ‌రికైనా వ‌స్తుందంటున్నారు. కానీ  సిరివెన్నల గారికి వ‌చ్చిన ఈ అవార్డు ప్ర‌తిభ‌ను గుర్తించి నిజాయితీగా వ‌చ్చిన అవార్డు` అని అన్నారు.

వై.విఎస్ చౌద‌రి మాట్లాడుతూ, ` నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కొన్ని సినిమాల‌కు సిరివెన్నెల గారితోనే పాట‌లు రాయించుకున్నా. ద‌ర్శ‌కుడు ఆలోచ‌నను మించి ఆయ‌న పాట‌లు రాస్తారు. ఆయ‌న పాటే సినిమాకి వ‌న్నె తీసుకొస్తుంది. ఆయ‌న ప‌గ‌లు ప‌డుకుని రాత్రుళ్లు పాట‌లు రాస్తుంటారు. వేటూరి గారి త‌ర్వాత నాకు బాగాన‌చ్చిన సాహితి వేత్త సిరివెన్న‌ల గారు` అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రచయితలు విజయేంద్రప్రసాద్‌, బుర్రా సాయిమాధవ్‌, భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, వెన్నెలకంటి, వడ్డేపల్లి కృష్ణ, గుణ్ణం గంగరాజు, కె.ఎల్‌.నారాయణ, బలభద్రపాత్రుని రమణి, రామ్‌ప్రసాద్‌, ఆర్పీపట్నాయక్‌, రామకృష్ణ ఆకెళ్ళ, వై.వి.ఎస్‌.చౌదరి, వేమూరి, విజయలక్ష్మి, వెనిగళ్ల రాంబాబు, ఉమర్జీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.