‘బొట్టు’ మూవీ రివ్యూ
ఒట్టు…ఇది బుర్ర పనిపట్టు (‘బొట్టు’ మూవీ రివ్యూ)
రేటింగ్ : 1/5
చిన్న స్టార్స్ తో కొన్ని కామెడీ సీన్స్, కాస్తంత మసాలాతో కూడిన ప్లాష్ బ్యాక్ కలిగలిపి కొడితే అది హర్రర్ కామెడీ అయ్యి కూర్చుంటుంది. హిట్ అయితే ఆ చిన్న సినిమాకు పెద్ద రాబడి. ప్లాఫ్ అయితే పెద్దగా పోయేదేమీ ఉండదు. షూటింగ్ లొకేషన్ కు తీసుకున్న హౌస్ రెంట్ తప్ప. దాంతో చిన్న హీరోలకు, ఫేడవుట్ హీరోయిన్స్ కు డిమాండ్ పెరిగింది. దెయ్యం కధలను వండి వడ్డించే వాళ్లు పెరిగారు. కొంతకాలం గడిచాక నిర్మాతలు ఇంకాస్త ముందుకు వెళ్ళి తమిళంలో తీసి తెలుగులో డబ్ చేసి వదిలారు. దెయ్యాలకు లాంగ్వేజ్ బారియర్స్ ఏమిటని జనం బాగానే చూసారు. దాంతో చాలా మంది ఆ తరహా సినిమాలను ఓ వృత్తిలా చేయటం మొదలెట్టారు. ఆ హవా కొంతకాలం బాగానే నడిచింది. అయితే దీనికైనా ఆది,అంతం ఉంటుంది కదా. ఇప్పుడు అంతం నడుస్తోంది. అయితే ఈ సినిమాలు మంచి ఊపు మీద నడిచిన రోజుల్లో మొదలెట్టిన ఓ సినిమా…ఆ ఎరా ముగిస్తున్న సమయంలో మన ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా మళ్లీ హర్రర్ కామెడీలకు నాంది పలుకుతుందా? లేక అంతానికి ఆజ్యం పోస్తుందా? చూద్దాం.
కథ ఇదే…
కొల్లిమలై లో కొందరి అన్యాయానికి బలైన బొట్టు అనే గిరిజన యువతి ఆత్మ పగదీర్చుకునే కథ ఇది.
మెడికల్ స్టూడెంట్ అయిన అర్జున్ (భరత్ ) ఇంకో స్టూడెంట్ అంజలి (సృష్టీ డాంగే) ని ప్రేమిస్తూంటాడు. ఓ రోజు పరీక్షల్లో కాపీ కొడుతూ కాలేజీ యాజమాన్యానికి దొరికిపోతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల కారణంగా, అతని శరీరంలోకి బొట్టు (ఇనియా) అనే గిరిజన యువతి ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తరువాత బొట్టు ప్రభావంతో అర్జున్ అమ్మాయిగా మారిపోతాడు. ఆ గిరిజన యువతి ఆత్మ అతణ్ణి ఆవహించటంతో కాలేజీలో బీభత్సం సృష్టిస్తూంటాడు. దాంతో కాలేజీ యాజమాన్యం తట్టుకోలేక పరమేశ్వరి (నమిత) అనే మంత్రగత్తెని ఆశ్రయిస్తుంది.
ఆమె వచ్చి శ్మశానం మీద కాలేజీ కట్టారు.అందుకే ఈ సమస్యలు. అసలు నేను ఇక్కడ కాలేజీ కట్టద్దు అంటే ఎందుకు కట్టారని సీరియస్ అవుతుంది. అయినా నేను ఆ దురాత్మని నిర్వీర్యం చేశా కదా? మళ్ళీ ఎలా వచ్చిందని తన మంత్ర శక్తిని ప్రయోగిస్తుంది. ఆ మంత్ర శక్తితో కాలేజీ చుట్టూ రక్షణ వలయం ఏర్పడుతుంది.
దాంతో అర్జున్ రూపంలో వున్న బొట్టు ఆత్మ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇక ఆ ఆత్మకీ, మంత్రగత్తెకీ పోరాటం మొదలవుతుంది. అసలు బొట్టు ఆత్మ అర్జున్ శరీరంలోకే ఎందుకు ప్రవేశిస్తోంది ? ప్రవేశించిన బొట్టు లక్ష్యం ఏమిటి ? బొట్టుకి ఆ మెడికల్ కాలేజీకి ఏమిటి సంబంధం? ఇంతకీ బొట్టు కథ ఏమిటి ? ఈ బొట్టు ఆత్మ కారణంగా అర్జున్ జీవితంలో చోటు చేసుకున్న పరిస్థితులు ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ఎలా ఉంది…
సినిమా ఎలా ఉంది అనడిగితే… ఎలాగయితే హర్రర్ కామెడీ తీయకూడదో అలాంటి లక్షణాలు అన్ని కలుపుకుని మన ముందుకు దిగింది. ఇక భరత్ అఘోరగా, ట్రాన్స్ జెండర్ గా అతని లుక్స్ ఎక్కడా సెట్ కావు. చాలా వింతగా ఉంటాయి. ఇక నమిత ని చూస్తే భయం వెయ్యదు సరికదా కామెడీగా ఉంటుంది. అయినా నమితను అఘోరగా చూపాలనే ఛండాలమైన ఆలోచన రావటం వింతే. ఆ చిత్రమైన హెయిర్ స్టైల్, ఆ డ్రస్ ఊహించటానికే కష్టంగా ఉంటుంది. మిగతా క్యారక్టర్స్ లో చాలా వాటికి లిప్ సింక్ నడవదు. అంటే అంత జాగ్రత్తగా సినిమా డబ్బింగ్ చేసారని అర్దం చేసుకోవాలి.
టెక్నికల్ గా …
అసలు ఈ సినిమాని ఏ ఉద్దేశ్యంలో ప్లాన్ చేసారో కానీ ఏ డిపార్టమెంట్ వర్క్ ఇంప్రెసివ్ గా ఉండదు.అసలు డైరక్టర్ ఏం చెప్పి హీరో డేట్స్ తెచ్చుకున్నాడో, నిర్మాతను ఒప్పించాడో అనేది ఆశ్చర్యం. అంత కంగాళిగా ఉంటుంది. ఎక్కడా కొంచెం కూడా ఇంటరెస్టింగ్ గా ఉండదు.
దర్శకుడు గురించి చెప్పాలంటే..హర్రర్ సినిమాలు తీయటం కూడా ఓ కళే. అందులో కొందరు మాస్టర్ డిగ్రీలు పొందితే మరికొందరు మామూలుగా కూడా పాస్ కూడా కాలేరు. అదే ఈ దర్శకుడు విషయంలో జరిగింది.
చివరి మాట
ఈ సినిమాని చివరిదాకా చూసిన వాళ్లకు ఏదైనా గిప్ట్ ప్రకటిస్తే…అది పొందటానికి ప్రయత్నించేవాళ్లు దొరకటం కూడా కష్టమే.
బ్యానర్ : శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: భరత్, నమిత, ఇనియా, సృష్టిటాంగేలు, తంబిరామయ్య, భరణి, మొట్టై రాజేంద్రన్, ఊర్వశి, షియాజి షిండే, మన్సూర్ అలీఖాన్, రంగనాథన్లు ఇతర తారాగణం.
సంగీతం: అమ్రీష్,
కెమెరా: ఎనియాన్ జె. హ్యారీస్,
మాటలు: ఎం.రాజశేఖర్రెడ్డి,
ఫైట్స్: సూపర్ సుబ్బరాయన్,
ఎడిటర్: ఎలీనా,
పాటలు: శివగణేష్.
కథ, స్క్రీన్ప్లే ,దర్శకత్వం: వడివుడయాన్.
నిర్మాత: జి.కుమార్ బాబు
విడుదల తేదీ: 08-03-2019