‘లవ్ గేమ్’ రివ్యూ
క్లైమాక్స్ లో డ్రాప్ అయిపోయిన… (‘లవ్ గేమ్’రివ్యూ)
రేటింగ్ : 2/5
మరి కాస్సేపట్లో పెళ్లి.ఈలోగా ఊహించని విధంగా ఓ అపరిచితుడైన కుర్రాడు వచ్చి గన్ చూపించి పెళ్లికి వచ్చిన వారందరినీ బెదిరించి, భయపెట్టి…పెళ్లి కూతురుని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెను ప్రపంచానికి దూరంగా తీసుకెళ్లి పెడతాడు. ఈ సెటప్ ఊహించగానే మనకు ఏం అనిపిస్తుంది. మరీ సినిమాలు చూడటం కొత్తవాడైతే ఎవరో పెళ్లి కూతుళ్లను ఎత్తుకుపోయే సైకో ఈ అమ్మాయిని ఎత్తుకుపోయాడు. ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంటుంది అని ఆసక్తి ఎదురుచూడబుద్ది వేస్తుంది. అదే రెగ్యులర్ గా మన మసాలా సినిమాలు చూసేవాడైతే టక్కున చెప్పేస్తాడు ఆ ఎత్తుకెళ్లింది హీరో, ఆ అమ్మాయి మాగ్జిమం హీరోయిన్ అవుతుంది అని, ఎత్తుకెళ్లటానికి కారణం ఓ లవ్ స్టోరీ అని. దాదాపు ఇలాంటి ఓపినింగ్ తోనే మొదలైన సినిమా ‘లవ్ గేమ్’. ఈ చిత్రం ద్వారా ప్రముఖ దర్శకుడు భాగ్యరాజా తనయుడు శంతన్ భాగ్యరాజా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆది రూపన్ దర్శకత్వంలో రూపొందిన తమిళం చిత్రం ‘ముప్పరి మనమ్’ అక్కడ బాగానే ఆడింది. మరి తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందా? లేదా? రివ్యూలో చూద్దాం.
కథ చూద్దాం…
చరణ్ (శాంతను భాగ్యరాజ్) అనే ఎటువంటి పరిచయం లేని ఓ కుర్రాడు అనూష ( శృతి దంగే ) అనే అమ్మాయి పెళ్లి అవుతుంటే కిడ్నాప్ చేస్తాడు. ఆమె తరపు బంధువులు అంతా పోలీస్ ల సాయంతో వెతుకుతుంటారు. ఈ ప్రాసెస్ లో మనకు మెల్లిగా రివీల్ అయ్యే విషయం ఏమిటీ అంటే… వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి ఒకరినొకరు ప్రేమించుకుంటూ పెరిగారని, పెద్దయ్యాక పెళ్లి చేసుకుందామనుకున్నారని. ఆ అమ్మాయితో ఈ కుర్రాడికి చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయని. అయితే అనూష ఇంట్లో వాళ్లకు వీళ్ల ప్రేమ ఇష్టం లేదు. అందుకు కారణం పోలీస్ అధికారి అయిన చరణ్ తండ్రి వలన అనూష సోదరుడు జైలుకు వెళ్తాడు.దాంతో ఆమెను మెడిసిన్ చదువుకోమని సిటీకి పంపిస్తారు. ఈలోగా చరణ్ తండ్రి కు ట్రాన్సఫర్ రావటం, సిటీకి వెళ్లిపోవటం జరుగుతుంది.
కొన్ని సంవత్సరాల తర్వాత చరణ్ కుటుంబం మళ్లీ ఆ విలేజ్ కు వస్తారు. చరణ్ ఆమె కోసం తనకు ఎంతో ఇష్టమైన యుఎస్ చదవుకు కూడా వెళ్లకుండా ఆమె కోసం వెయిట్ చేస్తుంటాడు. అనూష మాత్రం మెడికల్ కాలేజ్ లో చేరుతుంది. అక్కడ కు వెళ్లాక చరణ్ ని ఎవాయిడ్ చేయటం మొదలెడుతుంది. హఠాత్తుగా ఆమె అలా ఎందుకు చేసిందో అర్దం కాదు. మరో ప్రక్క అనూషని స్టార్ హీరో సంతోష్ కి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. అలా సరిగ్గా పెళ్లి జరుగుతున్నప్పుడే అనూష ను కిడ్నాప్ చేస్తాడు చరణ్. కథ ఓ రెగ్యలర్ లవ్ స్టోరీ అనకుంటాం కానీ ఊహకు అందని ఓ ట్విస్ట్ తో మలుపుతిరుగుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి? అనూష కాలేజీ లో వున్నప్పుడు ఏం జరిగింది ? చివరికి చరణ్,అనూష లు ఒక్కటైయ్యారా ? అసలు ఎందుకు చరణ్ ని ఎవాయిడ్ చేసింది? అనేదే మిగితా కథ.
ఎలా ఉంది…
చాలా థ్రిల్లర్ కథ లు ప్రారంభమయినట్లుగానే ఈ చిత్రం కూడా నాన్ లీనియర్ నేరేషన్ స్క్రీన్ ప్లే లో ఇంట్రస్టింగ్ గా మొదలవుతుంది. సినిమా ను ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేసి సినిమాపై మంచి ఇంట్రస్ట్ ని తీసుకొచ్చాడు. అలాగే ఇంటెర్వేల్ ట్విస్ట్ కూడా బాగా పేలింది. ఇక హీరోయిన్ బ్యాక్ డ్రాప్ ను రివీల్ చేసిన పద్దతి కూడా బాగుంది. అయితే ఆ థ్రిల్లంగ్ మూడ్ ని ఎంతో సేపు మెయింటైన్ చెయ్యడు దర్శకుడు. ఒక్కసారి ఎప్పుడైతే లవ్ స్టోరీకి సంబందించిన ప్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుందో అప్పుడు స్లో అవటం మొదలవుతుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాయమైపోయి…వాటి స్దానంలో స్పీడు బ్రేకర్స్ తగులుతూంటాయి. ట్విస్ట్ లు బాగానే ఉన్నాయి కానీ కథలో ఇమడలేదనే చెప్పాలి. డైరక్టర్ సెకండాఫ్ రివీల్ చేసిన ట్విస్ట్ నీరసంగా వెళ్తున్న కథను లేపి కూర్చో పెట్టింది. కానీ ఆ ట్విస్ట్ అంతే థ్రిల్లింగ్ తర్వాత సీన్స్ తో నడపలేక చతికిలపడింది. క్లైమాక్స్ అయితే అసలు మనకు ఎక్కడం కష్టం.
టెక్నికల్ గా … నటనా పరంగా…
సిన్సియర్ ప్రేమికుడిగా చరణ్ పాత్రలో నటించిన భాగ్యరాజ్ కుమారుడు తమిళ నటుడు శాంతను భాగ్యరాజ్ బాగా నటించాడు. అలాగే తన శక్తి మేరకు ట్విస్ట్ తో కూడిన హీరోయిన్ పాత్రలో శృతి దంగే చక్కగా నటించింది. ఇక విలన్ పాత్రలో నటించిన రవి ప్రకాష్ కూడా చాలా బాగా చేసారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన మ్యూజిక్ ప్లస్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. వివేక్ హర్షన్ సినిమాటోగ్రఫీ సినిమా హైలెట్స్ లో ఒకటి.ఎడిటింగ్ కూడా బాగుంది.
ఆఖరి మాట…
థ్రిల్లర్ సినిమాకు ట్విస్ట్ లు ఎంత ముఖ్యమో…క్లైమాక్స్ అంతకన్నా గొప్పగా ఉండాలి. లేకపోతే అది లవ్ గేమ్ అవుతుంది.
తెర ముందు…వెనక…
నటీనటులు : శాంతను భాగ్యరాజ్ , శృతి దంగే , రవి ప్రకాష్ ,తంబీ రామయ్య తదితరులు
దర్శకత్వం : అదిరూపాన్
నిర్మాత : భువన్ కుమార్ అల్లం
సంగీతం : జీవి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫర్ : వివేక్ హర్షన్
విడుదల తేదీ : మార్చి 08, 2019