Reading Time: < 1 min

బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలో తొలిసారి పోలీస్ పాట రాశా – గీత రచయిత సుద్దాల అశోక్ తేజ

తన మొత్త గీత రచన ప్రయాణంలో తొలిసారి పోలీస్ గురించి బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలో పాట రాశానన్నారు సుద్దాల అశోక్ తేజ. నిద్దుర లేని కళ్లకు అడ్రస్, అలసట లేని కాళ్లకు సిలబస్ పోలీస్ అంటూ పాట సుద్దాల రాసిన ఈ పాట శ్రోతలను బాగా ఆకట్టుకుంటోంది. ఈ పాట రాసిన అనుభవాలను సుద్దాల అశోక్ తేజ తెలుపుతూ…దర్శకుడు నాగసాయి మాకం నా దగ్గరకు పాట రాయమని వచ్చారు. కథ నచ్చితేనే రాస్తానని చెప్పా. సాయి చెప్పిన కథ చాలా బాగుంది. ఒక పాట మాత్రమే రాస్తానని పోలీస్ గురించి రాయడం మొదలుపెట్టాను. ఈ పాటలో పోలీస్ గొప్పదనానన్ని, అతని అసహనం, ఓ అమ్మాయి పట్ల ప్రేమ కనిపించాలి. ఇలా రెండు మూడు ఛాయలున్న గీతమిది. మొదట్లో రాసిన నిద్దుర లేని కళ్లకు అడ్రస్, అలసట లేని కాళ్లకు సిలబస్ అంటూ సాగే పల్లవి పోలీసు ఉద్యోగంలోని నిరంతర బాధ్యతను, శ్రమనూ చూపిస్తాయి. నాకు తెలిసిన పోలీస్ అధికారులకు ఈ పాట వినిపిస్తే అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఒక ఊరికి పోలీసు అధికారిగా వచ్చిన యువకుడు జేమ్స్ బాండ్ లా అన్నీ సాధిద్దామని అనుకుంటాడు. కానీ అక్కడ అతనికి కోడి, దూడ కేసులు ఎదురవుతాయి. వాటితో అతనిలో అసహనం ఏర్పడుతుంది. అలా నవ్విస్తూ సాగుతుంటుంది సినిమా. నా పాటతో పాటు గోరటి వెంకన్న రాసిన పాటలన్నీ బాగుంటాయి. ఆయన పూర్తిస్థాయి పాత్రలో చక్కగా నటించారు. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. అన్నారు.

ప్రణవి, ఆర్ ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – తోట వి రమణ, ఎడిటింగ్ – ఎస్ బీ ఉద్ధవ్, సంగీతం – సాబూ వర్గీస్, రీ రికార్డింగ్ – జీబూ, డీటీఎస్ – రాజశేఖర్, పాటలు – గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనశ్రీ మల్లిక్, నీల నర్సింహా, కథా, నిర్మాత – మహంకాళి శ్రీనివాస్, రచన, దర్శకత్వం – నాగసాయి మాకం.