Reading Time: 2 mins
నాట్ ఓకే  (సూర్య ‘ఎన్జీకే’ రివ్యూ)
 
రేటింగ్  :  1.5/5


నంద గోపాల కృష్ణ అలియాస్ NGK కాస్తంత సామాజిక స్పృహ ఎక్కువ. దాంతో చేస్తున్న ఉద్యోగం వదిలేసి, మహర్షిలో మహేష్ లా వ్యవసాయం అంటూ తన ఊరు శృంగవరపు కోటకు వచ్చేస్తాడు. వచ్చినవాడు వచ్చినట్లు ఉండక అక్కడ  ఊళ్లో జనాలకి సహాయ..సహకారాలు చేసే పోగ్రామ్ లు పెట్టుకుంటాడు. కానీ అతని వల్ల ఏమౌతుంది..లోకల్ గా ఉండే రాజకీయ నాయకుల అండలేనిదే గడ్డిపరక కూడా కదలదు  అని కొద్ది  రోజులకు ఓ చింతచెట్టు క్రింద జ్ఞానోదయం అవుతుంది.  దాంతో రాజకీయనాయకుడే అవుదాం…ఇంకెందుకు ఆలస్యం అని ఆ ఊరి ఎమ్మల్యే దగ్గర కార్యకర్తగా చేరి, పాలిటిక్స్ ని అబ్జర్వ్ చేస్తూంటాడు. అయితే ఈ క్రమంలో అతనికి జనాల్లో కాస్తంత పలుకుబడి పెరుగుతుంది. పేరు వచ్చేస్తుంది. దాంతో ఎన్నాళ్లనుండో రాజకీయాల్లో ఉంటున్న తమకు రాని పేరు ..ఈ మధ్యలో వచ్చిన ఈ ఎన్ జీ కే కొట్టుకుపోతున్నాడనే ఆవేదన అక్కడ రాజకీయనాయకులలో కలుగుతుంది. దాంతో మనోడిని అణగ తొక్కేయాలని స్కెచ్ లు వేస్తాడు. కానీ మన హీరో తక్కువ వాడా..వాళ్లని తొక్కేసుకుంటూ సీఎం అయ్యిపోతాడు. ఈ జర్నీలో  భార్య (సాయిపల్లవి) తో విభేధాలు…విలన్స్ తో ఫైట్స్ కామన్. వీళ్లను వదిలేస్తే  వ‌నిత (ర‌కుల్ ప్రీత్ సింగ్‌) కూడా మనోడి పొలిటికల్ జర్నీలో సాయిపడుతుంది. ఇంతకీ ఈ వనిత ఎవరు…అసలు ఎన్జీకే ఏం ఎత్తులు వేసాడు…చివరకు ఏం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా అయినా చూడండి..లేదా చూసి వచ్చిన స్నేహితులను (పూర్తిగా చూస్తే) అడగండి.
  
 
సోల్ లేని సోది

ఎలక్షన్స్ పుణ్యమా అని రాజకీయనాయకుల బయోపిక్ లు వచ్చాయి కానీ సాధారణంగా  రాజకీయ చైతన్యం కలిగించే సినిమాలు మనకు తక్కువే.  అందునా స్టార్స్ చేసే సినిమాల్లో రాజకీయాలు ప్రస్తావన తేవటానికి భయపడతారు. పొరపాటున ఏదన్నా రాజకీయనాయకుడుని టచ్ చేస్తే అనవసరంగా దాని ఇంపాక్ట్ సినిమాలపై ఉంటుందని. అయితే విభిన్నమైన కథలే కలిసొస్తాయని నమ్మే సూర్య మాత్రం అటువంటివేమీ పెట్టుకోకుండా ఓ పొలిటికల్ సినిమా చేసాడు.  అయితే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక, ఆ మూడ్ మొత్తం గాయిబ్ అయ్యాక సినిమా రిలీజ్ చేసాడు. దాంతో సూర్య సినిమా అని వెళ్లేవారు తప్ప..ఫలానా టైప్ సినిమా అని ఆలోచించి థియోటర్ లో అడుగు పెట్టేవారు తక్కువ అయ్యారు. ట్రైలర్ సైతం నిరాశపరిచిన ఈ సినిమా థియోటర్ లోనూ అదే స్దాయిలో పడుకుంది. సెల్వ రాఘవన్ ఎక్కడా మనస్సు పెట్టి చేసినట్లు కనపడదు. కొన్ని సీన్స్ ఎగ్జైటింగ్ గా అనిపించినా మిగతాదంతా మామూలు రొటీన్ స్టఫ్. మారిన సినేరియోని పట్టించుకోకుండా రాసుకున్న స్క్రీన్ ప్లే పరమ బోర్ కొట్టింది. రియలిస్టిగా తీస్తున్నామనుకుని తీసిన టేకింగ్ పాత కాలం సినిమా తీస్తున్న ఫీల్ తీసుకు వచ్చింది. అలాగే దర్శకుడు ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడే పాయింట్ ఎక్కడా కనపడదు. ఏదో సెట్ లో అప్పటికప్పుడు రాసుకున్న సీన్స్ లా వస్తూంటాయి..పోతూంటాయి. ఎక్కడా మన మనస్సులో స్ట్రాంగ్ ముద్ర వేయవు. టోటల్ గా సోల్ మిస్సైంది. 
 
స్క్రీన్ ప్లేనే సావకొట్టింది

గతంలో ఇదే హీరో సూర్య తమ్ముడు కార్తి ..శకుని అనే టైటిల్ తో ఓ సినిమాని చేసారు. ఆ సినిమాకు ..నేనే రాజు నేను మంత్రి కలిపితే ఎలా ఉంటుందో అలా ఉందీ ఈ సినిమా. అసలు సెల్వరాఘవన్ ఈ సినిమా చేసాడంటే నమ్మబుద్ది కాదు. సెల్వరాఘవన్ కాబట్టే ఇలాంటి కథ సూర్య ఒప్పుకున్నాడని మాత్రం అర్దమవుతుంది. లేకపోతే ఎటు నుంచి ఎటు వెళ్తోందో తెలియని కథను పట్టుకుని సినిమా నడపటం ఏమిటి…స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ..కథలోకి లేటుగా రావటమే అనే బోరింగ్ కుదారి తీసే  తప్పుని చేయటమే కాక వచ్చిన తర్వాత కూడా అదే పాయింట్ మీద సస్టైన్ చేయకుండా తన ఇష్టం వచ్చినట్లు కథ కదలదు. పోనీ ఏ కామెడీనో, మసాలా నో ఏదో ఒక ఎలిమెంట్ ఎంగేజ్ చేస్తే భరించవచ్చు. అదీ లేదు. ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు కాస్తంత రీసెర్చ్ వర్క్ లాంటిది చేయాలి. ఫిక్షన్ గా అల్లేస్తే కథలో  బిలీవుబులిటీ మిస్సవుతుంది. వాస్తవంగా చెప్పాలనుకున్న కథను అలాగే చెప్పేలి. ఫిక్షన్ గా చెప్పాలనుకున్న కథను అదే మోడ్ లో చెప్పాలి. అంతేకానీ కాస్త ఫిక్షన్..కాస్తంత వాస్తవం కలిపితే అటు ఇటూ కాకుండా పోతుంది. 

ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్

సాధారణంగా లోకల్ ఓ ఎమ్మెల్యే స్థానికంగా ప‌లుకుబ‌డి క‌లిగిన యువ‌కులను ఎలా త‌న దారిలోకి తెచ్చుకుంటారు? ఎమ్మెల్యే, అత‌ని అనుచ‌రుల జీవితాలు ఎలా ఉంటాయి? హైక‌మాండ్ ద‌గ్గ‌ర ఎలా న‌డుచుకుంటుంటారనే విష‌యాలు కాస్త ఇంట్రస్టింగ్ గా చెప్పారు. 

టెక్నికల్ గా ..

సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ ఓకే. డైరక్షన్ లో పెద్దగా మెరుపులు ఏమీ లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ సూర్య సినిమా స్దాయికి తగినట్లుగా లేవు. 
 
చూడచ్చా

యస్..టీవీలో వచ్చినప్పుడు

ఆఖరి మాట

ఓ మూడు నెలల క్రిందట..ఎలక్షన్స్ కు ముందు ఈ సినిమా రిలీజ్ అయితే జనం కనెక్ట్ అవుదురేమో.  


తెర ముందు…వెనక

నటీనటులు: సూర్య, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, దేవరాజ్‌, బాలా సింగ్‌ తదితరులు

సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా

సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌

కూర్పు: ప్రవీణ్‌

నిర్మాణ సంస్థ: డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సెల్వ రాఘవన్‌

విడుదల: 31-05-2019