
గుణ 369 చిత్రం సక్సెస్ మీట్
`ఆర్.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ హీరోగా, అనఘ హీరోయిన్గా నటించిన చిత్రం `గుణ 369`. ఆగస్టు2న సినిమా విడుదలైంది. ఈ చిత్రానికి అర్జున జంధ్యాల దర్శకుడు. ప్రవీణ కడియాల సమర్పిస్తున్నారు. అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మాతలు.
ఈ సినిమా సక్సెస్ మీట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో…
హీరో కార్తికేయ మాట్లాడుతూ – “మా గుణ 369 ఆగస్టు 2న విడుదలైంది. సినిమా హిట్టైంది, బ్లాక్ బస్టర్ అయింది అనేదానికన్నా, నాకు చాలా బాగా నచ్చింది. సినిమా విడుదలకు ముందు “నేను ఈ సినిమా తర్వాత ఏ స్టేజ్‌కి వెళ్తానో తెలియదు కానీ, జీవితాంతం నేను గుర్తుపెట్టుకునే సినిమా గుణ369“ అని అన్నాను. సినిమా విడుదలయ్యాక వచ్చిన ప్రశంసలు చూస్తుంటే, భవిష్యత్తులో వంద బ్లాక్ బస్టర్లను ఇవ్వగలననే ధైర్యాన్నిచ్చింది. ఆ ధైర్యాన్ని నాలో నింపినందుకు దర్శకుడికి ధన్యవాదాలు. నేను థియేటర్లో ప్రేక్షకుల మధ్య ఈ సినిమాను చూసినప్పుడు క్లైమాక్స్ లో చెప్పిన డైలాగులకు, మధ్య మధ్యలో చేసిన యాక్షన్‌కు వాళ్లు రియాక్షన్ అయ్యే తీరు చాలా బాగా అనిపించింది. ఇకపై నేను ఎంపిక చేసుకునే కథల మీద ఈ సినిమా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ సినిమాలో రెస్పాన్సుబుల్ యాక్టర్‌గా పేరొచ్చింది. ఆ పేరు ఎంత ఖర్చుపెట్టినా రాదు. ఆ పేరు వచ్చినందుకు రుణపడి ఉంటా. 60శాతానికి పైగా ఫ్యామిలీస్‌ని థియేటర్లో చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. సినిమా పూర్తయ్యాక కొందరు మహిళలు నన్ను పట్టుకుని ఏడిస్తే, వాళ్లు ఎంత కనెక్ట్ అయ్యారో అర్థమైంది. సినిమా చూసి తొలిసారి మా అమ్మ ఏడవడం చూశాను. మా కుటుంబం నన్ను చూసి గర్వపడుతోంది. అభిమానులు ఇంకా ఇష్టపడుతున్నారు. ఇంకా గొప్పగా సాధించగలనని నమ్ముతున్నారు. కొత్త అభిమానులు యాడ్ అయ్యారు ఈ సినిమాతో. గుణ369 నాకు జీవితాంతం గుర్తుండిపోయే సినిమా. నేను జీవితాంతం గర్వపడే సినిమా. నిర్మాతలకు స్పెషల్ థాంక్స్. ఈ కథను నమ్మి తీయడం అంత తేలిక కాదు. అయినా వాళ్లు నమ్మి చేశారు. మా చైతన్, రామిరెడ్డితో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలి. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. మా హీరోయిన్ అనఘ ఇలాంటి పాత్రను పోషించినందుకు ఎంతో గర్వపడుతోంది. ఆమె పాత్రను ఆడియన్స్ అంత బాగా రిసీవ్ చేసుకోవడం ఆనందంగా ఉంది. మహేష్ చాలా బాగా చేశాడు. ఫస్ట్ టైమ్ తను ఇలాంటి పాత్రను పోషించాడు. ప్రేక్షకులు చక్కగా రిజీవ్ చేసుకున్నారు. నా అభిమానులు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయను“ అని అన్నారు.
దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ – “తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. టూర్‌కి కూడా వెళ్లాం. కర్నూలు నుంచి వైజాగ్ వరకు దాదాపుగా అన్నీ థియేటర్లకు వెళ్లాం. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు చాలా హ్యాపీగా ఉన్నామని అంటుంటే చాలా మంచి సినిమా చేశామని ఆనందం కలిగింది. ఈ కథ చెప్పినప్పటి నుంచి నమ్మి చేసిన కార్తికేయగారికి ధన్యవాదాలు. తన పెర్ఫార్మెన్స్ గురించి అందరూ అప్రిషియేషన్ చేస్తున్నారు. యూత్, లేడీస్ అందరూ మెచ్చుకుంటున్నారు. సినిమా మొదలై, పూర్తై, సక్సెస్ చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. నా నిర్మాతలకు ధన్యవాదాలు. ప్రవీణగారు మంచి సినిమా అవుతుందని బాగా నమ్మారు. ఆ నమ్మకం నిజమైంది“ అని చెప్పారు.
నిర్మాత ప్రవీణ కడియాల మాట్లాడుతూ – “మా సినిమాను గుండెల్లో పెట్టుకుని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు. తిరుమల్ రెడ్డిగారు సైమా అవార్డుల్లో బిజీగా ఉన్నారు. అనిల్‌గారు స్వరాభిషేకంతో బిజీగా ఉన్నారు. ప్రతి శుక్రవారం గోడల మీద పోస్టర్లు పడుతూనే ఉంటాయి. కొన్ని మాత్రం మనసుల్లో గుర్తుండిపోతాయి. మా గుణ369 అలాంటి చిత్రమే. నాతో చాలా మంది మంచి సినిమా చేశారండీ అని అన్నారు. వాళ్లు అభినందిస్తుంటే నేనే ఆశ్చర్యపోయాను. చాలా సినిమాలు చేశాను. చూశాను. కానీ గుణ369కి ఆడియన్స్ నుంచి వస్తున్న సపోర్ట్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇటీవల ఓ పాపకి అన్యాయం జరిగిన సంగతి మనం తెలుసుకున్నాం. వాళ్ల పాపకు అన్యాయం చేసి వారికి ఉరిశిక్ష పడినా వాళ్ల మనస్సు శాంతించడం లేదట. వాళ్లు నాతో ఈ విషయం మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపించింది. ఆ పాపకు ఈ సినిమాను అంకితం చేయమని తిరుమల్గారు చెప్పారు“ అన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు మహేశ్, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ తదితరులు పాల్గొన్నారు