సమయం రాత్రి ఒంటిగంట…
ఎక్కడ చూసినా జనం…అరుపులు..కేకలు…ఓ నలుగురు పెద్ద పళ్లెంలో హారతి పట్టుకుని సిద్దంగా ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా తెరపై సినిమా ప్రారంభమైంది. టైటిల్స్ పడుతూంటే తమ అభిమాన హీరో కనపడ్డాడు. అభిమాన హీరోకు హారతులు ఇస్తున్నారు… విజిల్స్ మారు మోగిపోయాయి. దాన్ని థియోటర్ లో ఉన్న జనం ఆస్వాదిస్తున్నారు. ఇదేమీ కల కాదు…మూడు నెలల క్రితం వరకూ పెద్ద హీరోల సినిమాల రిలీజ్ లు అప్పుడు జరిగిందే.కరోనా దెబ్బతో అని ఆ ఎట్మాస్మియర్ మాయమైపోయింది. ఏవి తల్లీ! నిరుడు మెరిసిన సినీ సమూహములు? అని నిర్మాత, ప్రేక్షకుడు కలిసి కవితాత్మకంగా కన్నీరు పెడుతున్న పరిస్దితి.
ఓ చేత్తో పాప్ కార్న్, మరో చేత్తో కూల్ డ్రింక్ పట్టుకుని, పెద్ద తెరపై వచ్చే సినిమా ఆస్వాదించే రోజులు ప్రస్తుతానికి కొద్ది కాలం వరకూ లేనట్లే. మరి షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు పరిస్దితి ఏమిటి..అన్నేసి కోట్లు పెట్టుబడి పెట్టి, తెచ్చిన ఫైనాన్స్ లకు వడ్డీలు కడుతూ ఎంతకాలం తమ దగ్గర సినిమా పెట్టుకుని గాల్లో లెక్కలు వేయగలరు. ఎన్ని రోజులు థియేటర్ల రిలీజ్ కోసం ఎదురుచూస్తుంటారు. సినిమా రిలీజ్ లేటయ్యే కొద్దీ పాత బడిపోయినట్టే లెక్క. ఆరు నెలలు దాటి సినిమా ఆగిపోయిందంటే దాని పై ప్రేక్షకులకు ఇంట్రస్ట్ పోతుంది. అలాంటప్పుడు ఏ నిర్మాత అయినా ఏం చేయగలడు? ఈ నేపథ్యంలో ఓటీటి ఒక అవకాశంగా కనిపించటంలో వింతేమీ లేదు.
నిన్నటివరకు సౌతిండియన్ ఇండస్ట్రీ ఓటీటిని వ్యతిరేకించింది. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ ఎప్పటికి పూర్తవుతుందో తెలి యని అయోమయ టైమ్ లో పెట్టిన పెట్టుబడి వచ్చినా చాలనుకుంటున్నారు చాలామంది చిత్ర నిర్మాతలు. అమెజాన్ ప్రైమ్ వీడియోకు పలు దక్షిణ భారత చిత్రాల హక్కులు ధారాదత్తం చేస్తున్నారు. ఇప్పటికే ‘అమృతారామమ్’ చిత్రం ఓటీటిలో విడుదలైంది. అమితాబ్, ఆయుష్మాన్ ఖురాన్ నటించిన ‘గులాబో సుతాబ్’ చిత్రం కూడా ఓటీటిలో రాబోతోంది. ఈ జాబితాలోకి ఇప్పుడు కొన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు కూడా చేరాయి.ఓటీటీ వల్ల తమ పెట్టుబడులు తిరిగిరావనేది నిజమే. ఎంతో కొంత నష్టాలు భరించాల్సిందే. ఆమేరకు నిర్మాతలు సిద్ధమైతే, ప్రస్తుత దా’రుణ’ పరిస్థితుల్లో స్వల్ప నష్టాలతో గట్టెక్కినట్టు అవుతుంది.ఇది నిర్మాతల యాంగిల్. మరి ప్రేక్షకుల మాటేంటి..
ఈ సినిమాలు ఇంట్లోనే మన లాప్ ట్యాప్ లోనే చూస్తే ..ఆ సినిమాటెక్ ఎక్సపీరియన్స్ వస్తుందా…అంటే కష్టమనే చెప్పాలి. ఎందుకంటే…సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడో చోట నుంచి ఫోన్ రావచ్చు. అదే థియోటర్ లో ఉంటే …సినిమా చూస్తున్నాం..తర్వాత కాల్ చేస్తాను అంటూ మెసేజ్ పెడతాం. కానీ ఇప్పుడు సినిమాని పాజ్ చేసి ప్రక్కకు వచ్చి మాట్లాడతాం. ఫోన్ మాట్లాడేసరికి మిగతా సినిమా చూద్దామనే ఇంట్రస్ట్ పోవచ్చు. మన ఆలోచనలు వేరే చోటకు వెళ్లిపోవచ్చు. అలాగే సినిమా ఏ మాత్రం ఇంట్రస్ట్ లేకపోయినా ..ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాం. పాటలు, ఫైటలు చూడాలనిపించకపోవచ్చు. అలాగే కథలో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యాక…సినిమా అంతా ఏం చూస్తాం…క్లైమాక్స్ ట్విస్ట్ చూసేస్తే సరిపోతుంది కదా అనిపించవచ్చు. ఇన్ని అడ్డంకులు..అవరోధాలు.
ముఖ్యంగా అద్బుతమైన విజువల్స్ ని చిన్ని తెరపై అంటే మన లాప్ టాప్ తెరపై చూడాల్సి రావటం ఇబ్బందే. అలాగే సినిమా మధ్యాహ్నం చూద్దాం, సాయింత్రం చూద్దాం, రేపు చూద్దాం అనే వాయిదా కూడా వేసేస్తూంటాం. అదే థియోటర్ కు వెళ్ళటానికి వాయిదా వెయ్యిం. ఎందుకంటే ఆన్ లైన్ లో టిక్కెట్ బుక్ చేసి అదో పనిగా వెళ్తాం. ఆ ఎక్సపీరియన్స్ ని అనుభవిస్తాం. ఇవన్నీ ఓటీటిలో రిలీజ్ చేసే సినిమావాళ్లు గమనించుకోవాలి. ఏ మాత్రం లాగ్ వచ్చినా …లాగటం కష్టం.