83 చిత్రo పి.ఆర్.మాన్‌సింగ్ పాత్రలో పంకజ్ త్రిపాఠి
పి.ఆర్.మాన్‌సింగ్ పాత్రలో నటించిన పంకజ్ త్రిపాఠి గురించి ‘83’ దర్శకుడు కబీర్‌ఖాన్ స్పందన
ఇండియన్ క్రికెట్‌ను గతిని మార్చిన ఏడాది 1983. ఈ ఏడాది భారతదేశం క్రికెట్ ప్రపంచంలో రారాజుగా అవతరించింది. కపిల్ డేర్ డెవిల్స్ సాధించిన అపూర్వ విజయంతో చాలా మందికి క్రికెట్ ఫేవరేట్ గేమ్‌గా మారింది. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ‘83’ పేరుతో వెండితెరపై ఆవిష్కరించారు డైరెక్టర్ కబీర్‌ఖాన్. ఇందులో నటించిన తారాగణం వారు పోషించిన పాత్రలకు సంబంధించిన పోస్టర్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేస్తూ వచ్చింది.
1983లో వరల్డ్‌కప్ సాధించిన ఇండియన్ టీమ్‌కు స్టాఫ్ మెంబర్‌గా, మేనేజర్‌గా అన్నీ తానై నడిపించిన వ్యక్తి పి.ఆర్.మాన్‌సింగ్. ఆ సమయంలో టీమ్‌కు కోచ్‌గానీ, ఇతర సిబ్బందిగానీ, వంటవాడు ఇలా ఎవరూ లేరు. వీరందరిలా మాన్‌సింగ్ అవతారం ఎత్తి టీమ్ సభ్యులకు అండగా నిలబడ్డారు. జట్టుకు అవసరమైన వాటిని సిద్ధం చేసిచ్చారు. ఇలాంటి ఓ పాత్రను ‘83’ చిత్రంలో పంకజ్ త్రిపాఠి పోషించారు. ఈ పాత్ర గురించి డైరెక్టర్ కబీర్‌ఖాన్ మాట్లాడుతూ ‘‘పంకజ్ త్రిపాఠి టాలెంట్‌పై నాకు అపారమైన నమ్మకం ఉంది. నేను చూసిన విలక్షణ నటుల్లో పంకజ్ త్రిపాఠి ఒకరు. ఆయనైతేనే పి.ఆర్.మాన్‌సింగ్ పాత్రకు న్యాయం చేస్తారనిపించింది. మాన్‌సింగ్ పాత్రను ప్రేక్షకులు తెరపై చూసినప్పుడు గొప్ప అనుభూతిని పొందుతారు. 1983 వరల్డ్‌కప్ సాధించిన టీమ్‌లో మాన్‌సింగ్ అంతర్భాగమైయ్యారు. ఆయన లేకుంటే వరల్డ్‌కప్ సాధించడం కష్టమయ్యేదని నాతో టీమ్ సభ్యులు తెలిపారు. ఇలాంటి పాత్రలో పంకజ్ త్రిపాఠి అద్భుతంగా నటించారు’’ అన్నారు.
1983 వరల్డ్‌కప్ సాధించిన కపిల్ డెవిల్స్ టీమ్‌లో మాన్‌సింగ్ చాలా కీలక బాధ్యతను పోషించారు. దీంతో 1987 ఇండియన్ వరల్డ్‌కప్ టీమ్‌కు కూడా మేనేజర్‌గా వ్యవహరించారు. 1987లోనూ ఇండియన్ టీమ్ సెమీఫైన్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. 1983లో కపిల్ సేన సాధించిన ఈ క్రికెట్ వరల్డ్‌కప్‌తో క్రీడా రంగంలో భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి పెట్టింది. ఆ అద్భుతమైన ప్రయాణాన్ని 83 సినిమాలో వెండితెరపై ఆవిష్కరించారు డైరెక్టర్ కబీర్ ఖాన్.
రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటమ్ ఫిలిమ్స్ బ్యానర్స్ సమర్పణలో కబీర్‌ఖాన్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ పతాకంపై దీపికా పదుకొనె కబీర్‌కాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నడియడ్ వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.