36 వయసులో మూవీ రివ్యూ
నీ వయస్సు ఎంత?: ’36 వయసులో’ (రివ్యూ)
Rating:2.5
అన్ని సినిమాలు కమర్షియల్ యాంగిల్ లో చూడలేం. మన చుట్టూ ఉన్నవాళ్ల గురించి, మన ఇళ్లల్లో వాళ్ల గురించి తీసిన సినిమాలను ఆ కోణంలోనే చూడాలి. అప్పుడు అవి మనకు నచ్చుతాయి. ఆలోచింపచేస్తాయి. ఆయా సినిమాల మీద మన ఇంప్రెషన్స్ ఖచ్చితంగా అవసరం అవుతాయి. అయితే అలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘హౌ ఓల్డ్ ఆర్ యూ’ . అప్పుడెప్పుడో 2004లో వచ్చిన ఈ సినిమా మళయాళ సినీ పరిశ్రమను ఓ కుదుపు కుదిపింది. ఆ సినిమా ఆ తర్వాత తమిళంలోకి రీమేక్ అయ్యింది. ఆ తమిళ సినిమా డబ్బింగ్ అయ్యి ఇప్పుడు మన ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..మనవాళ్లకు నచ్చుతుందా…అసలు ఈ సినిమాలో చర్చించిన విషయాలంటి..అసలెందుకు అంత గొప్ప పేరు తెచ్చుకుంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్..
ఆడవాళ్ల ఆశలకు, కలలకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? అనే ప్రశ్న చుట్టూ తిరిగే ఈ కథలో వసంతి (జ్యోతిక) ఓ మిడిల్ క్లాస్ మహిళ. వయస్సు 36. ఆడవాళ్లు వయస్సు అడక్కూడదంటారు కానీ ఆమెకు ఉద్యోగానికి వెళ్లినప్పుడు అదే ప్రశ్న..ఆమెకు ఎదురై, వెనక్కి లాగేస్తుంది. ఏం 36 వస్తే జీవితంలో అన్ని అయ్యిపోయినట్లేనా?ఈ ప్రశ్న ఆమెను కలిచి వేస్తుంది. ఎందుకంటే ఆమెకు కేవలం ఉద్యోగం విషయంలోనే కాక సంసారిక జీవితంలోనూ ఈ ప్రశ్న పదే పదే గుర్తుకు వస్తుంది. పెద్దగా పట్టించుకోని భర్త..కూతురు ఆమెను ఆలోచనలో పడేస్తూంటారు. ఈ ప్రశ్నకు జవాబు వెతికే ప్రాసెస్ లో ఉండగానే ..ఆమెకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం వస్తుంది. అయితే అది అనుకోకుండా జరిగిన ఓ సంఘటనతో మిస్ అవుతుంది. దాంతో అందరూ ఆమెను ఓ దోషిలా చూస్తారు. తన తప్పేమీ లేకపోయినా ఇందుకిలా జరుగుతోంది. తను యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఫైర్ లా ఉండేది. ఇప్పుడదంతా ఏమైపోయింది. అని మళ్లీ ఆలోచనలో పడుతుంది. ఆ నిర్వేదం, డిప్రెషన్ లోంచి బయిటపడి ఆమె ఏం సాధించింది. అసలు ఆమెను రాష్ట్రపతి ఎందుకు కలవాలనుకున్నారు…చివరకు ఏమైంది వంటి విషయాలు సినిమా చూస్తూనే బాగా అర్దమవుతాయి.
కథ,కథనం
ఇదేమీ గొప్ప కథకాదు. జీవితాన్ని ఏ అలంకారాలు లేకుండా వొట్టి ముడి సరుకుగా చూపించే సినిమా ఇది. సినిమా అంతా జ్యోతిక పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆమె ఆలోచనలు, ఆశలు, అవి ఆవిరి అవ్వటం మీద దర్శకుడు కాన్సర్టేట్ చేసారు. ఎక్కడా ఏ విధమైన మలుపులు,చెణుకులు ఉండవు. ఓ పుస్తకం చదువుతున్నట్లు ఉంటుంది. కాకపోతే కాస్త ఓపిగ్గా చదవాల్సిన పుస్తకం. దీన్ని ఏ మాత్రం కమర్షియలైజ్ చేసే ప్రయత్నం చేసినా చెప్పాలనుకున్న విషయం ప్రక్కకు పోయేది. ఇది డైరక్టర్ బాగా గమనించి అటు,ఇటు వెళ్లకుండా ఆ పాత్ర ఎటువైపు ప్రయాణిస్తే అటే తనూ ప్రయాణం పెట్టుకుని స్క్రిప్టుని రాసుకున్నాడు. అంతే అందంగా తెరకెక్కించాడు. ఇదో క్లాసికల్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పాలి. అందరికి ఈ సినిమా ఎక్కుతుందని చెప్పలేం కానీ డీసెంట్ సినిమా చూడాలనుకునేవాళ్లకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్టాఫ్ మాత్రం కాస్తంత ఎక్కువ లాగారనే చెప్పాలి. జ్యోతిక పాత్ర ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఎక్కువ టైమ్ తీసుకున్నారు. మిగతాదంతా నల్లేరుమీద నడకలా వెళ్లిపోయింది.
నచ్చే ఎలిమెంట్స్
సహజమైన పాత్రలు
జ్యోతిక నటన
నచ్చనవి
దాదాపు ఆరేళ్లు లేటుగా డబ్బింగ్ చేయటం
పూర్తి సీరియస్ టోన్ లో వెళ్లటం
అక్కడక్కడా మిత్ర్ మై ప్రెండ్ (రేవతి), ఇంగ్లీష్ వింగ్లీష్(శ్రీదేవి) సినిమాని గుర్తు చేయటం
రహమాన్ పాత్రని మరీ నెగిటివ్ గా చిత్రీకరించటం
అసహజంగా అనిపించే క్లైమాక్స్
టెక్నికల్ గా
డబ్బింగ్ క్వాలిటీగా ఉంది. కెమెరా వర్క్ క్లాస్ గా ఉంది. ఎడిటింగ్ మన తెలుగు వెర్షన్ కు స్పీడ్ తక్కువనే ఫీలింగ్ తెచ్చింది. రీరికార్డింగ్ కొన్ని సీన్స్ లో అదిరింది. అలాగే డైలాగులు బాగా రాసారు. జ్యోతిక, రెహమాన్ అదరకొట్టారు.
చూడచ్చా
మగవాళ్ల కన్నా ఇంట్లో గృహిణి పోస్ట్ లో ఉన్న ఆడవాళ్లకు బాగా నచ్చుతుంది. వాళ్లకు చూపించండి.
ఎవరెవరు..
నటీనటులు: జ్యోతిక, రెహ్మాన్, అభిరామి తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: ఆర్. దివాకరన్
ఎడిటింగ్: మహేష్ నారాయణన్
దర్శకత్వం: రోషన్ ఆండ్రూస్
నిర్మాత: సూరియా
రన్ టైమ్:1 hour 55 minutes
విడుదల = ఆహా ఓటీటీ