మానవత్వాన్ని ప్రదర్శించిన యాక్టర్ సోనూ సూద్
నటుడు సోనూసూద్ దాతృత్వాన్ని చాటుకున్నారు. రైతు, నాగేశ్వరరావు ఆయన భార్య, కూతుళ్లు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయారు. నాగేశ్వరరావుకు ట్రాక్టర్‌ను కొని ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్‌ను అందించారు. దీంతో నాగేశ్వరరావు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సోనూసూద్‌కు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా సోనూకు రైతు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా నాగేశ్వరరావు ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లెలో టీ హోటల్ నిర్వహించేవాడు. అయితే లాక్డౌన్ కారణంగా ఆయన కుటుంబానికి ఉపాధి పోయింది. దీంతో నాగేశ్వరావు కుటుంబంతో సహా తన స్వంత గ్రామానికి వెళ్లాడు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. దున్నేందుకు ఎద్దులు లేక సతమతమవుతుంటే.. ఆయన కన్నబిడ్డలే కాడి పట్టుకు నడిచారు. వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే… వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వస్తున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియో సోనూసూద్ కంటపడింది. ఇంకేముంది ఆయన చలించిపోయారు. వారి కష్టాన్ని చూడలేక పోయారు. ‘‘రేపు మీకు రెండు ఎద్దులు ఉంటాయి. కాదు ఈ కుటుంబానికి ఓ ట్రాక్టర్ ఉండాలి. సాయంత్రానికల్లా మీకు ఓ ట్రాక్టర్ పంపిస్తాను. ఇకపై ఆ ఆడపిల్లలు ఇద్దరు చక్కగా చదువుకోవచ్చు’’ అని ట్వీట్ చేశాడు.*