నట్టికుమార్ సినిమారంగంలో చోటుచేసుకున్న సమస్యలను విలేకర్ల ముందుంచారు
కొందరి లాబీయింగ్ వల్ల థియేటర్లు తెరుచుకోలేదు: నిర్మాత నట్టికుమార్
కోవిడ్ పేరుతో థియేటర్లను ఇంకా ఓపెన్ చేయకపోవడం వల్ల ముందు ముందు అన్ని రాష్రాల్లో థియేటర్ల ఉద్యమం రానున్నదని ప్రముఖ నిర్మాత, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సు జాయింట్ సెక్రటరీ నట్టికుమార్ అన్నారు. గత 8నెలలుగా సినిమారంగంలో చోటుచేసుకున్న సమస్యలను సోమవారంనాడు ఆయన విలేకర్ల ముందుంచారు.
థియేటర్లు మూసివేయడం వల్ల పిఠాపురంలోని థియేటర్లో ఫర్నిచర్ దొంగలపాలయింది. మరికొన్ని చోట్ల ఎలుకలు వల్ల కుర్చీలు నాశనం అయ్యాయి. దీనికి బాధ్యులు ఎవరు? అంటూ ఆయన ప్రశ్నించారు. సినిమారంగంలోని కొందరు లాబీయింగ్ వల్ల థియేటర్లు మూతపడ్డాయని వాపోయారు. విమానాలు, రైల్లో కూడా సీటింగ్ కెపాసిటీ ఎందుకు మార్చలేదు. వున్న సీట్లతోనే వారు రన్ చేస్తున్నారు. మరి థియేటర్లకు వచ్చేసరికి రూల్సు ఎందుకు మారాయి? అంటూ ప్రభుత్వాలను నిలదీశారు.
థియేటర్ల మూసివేయడం వల్ల వేలాది కార్మికులు నష్టపోయారు. అలాగే షూటింగ్లు ఆపివేయడం వల్ల లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వారిని ఏ ప్రభుత్వం ఆదుకోలేకపోయింది. సి.సి.సి. తరఫున చిరంజీవిగారు ఆధ్వర్యంలో మూడుదఫాలుగా కార్మికులకు రోజువారీ సరుకులు అందించారు. ఇలా ఎంత కాలం జరుగుతుంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది పట్టదా? ఒక్క పైసా కూడా వారికి ఖర్చుపెట్టలేకపోయింది. సినిమారంగం నుంచి పన్నలు రూపేణా వారికి ఆదాయం వస్తున్నా వారు పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
ఓటీటీ వల్ల చిన్న సినిమాలు నష్టపోతున్నాయి
థియేటర్ల మూసివేత సాకుతో ఓటీటీ ద్వారా పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. హీరోలందిరకీ కోట్లు మార్కెట్ వుందంటే కేవలం థియేటర్ల వల్లనే అని గుర్తు చేసుకోవాలి. నాని -వి- సినిమా ఓటీటీలో విడుదల చేశారు. ముందుముందు మరికొందరు పెద్ద హీరోల చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇది ఎంత వరకు కరెక్ట్. ఇలా జరిగితే ఇక థియేటర్లు మూసివేయాలా?. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి పెద్దలు సమాధానం చెప్పాలని ఆయన సూటింగా ప్రశ్నించారు.
అలాగే ఎల్.ఎల్.ఎల్.పి. అనే గ్రూప్ పెట్టి 21మంది సినిమా రంగాన్ని శాసిస్తున్నారు. వారు చెప్పిందే వేదం. పబ్లిసిటీ వారు చెప్పనట్లే చేయాలి. చిన్నసినిమాలకూ పబ్లిసిటీ నియంత్రణ చేశారు. దాని వల్ల కేవలం కొన్ని పత్రికలకు మినహా మిగిలిన వారికి ఇవ్వడం సాధ్యపడడంలేదు. అన్నీ తెలిసిన ఛాంబర్ ఎందుకు మౌనం వహించింది? కొందరు చేస్తున్న లాబీయింగ్ వల్ల వారు నోరు మెదపడంలేదు. ఇది ఎంతవరకు సమంజసం? అంటూ ఆయన వెల్లడించారు.
కొత్త సినిమాలు
మంగళవారంనాడు తన పుట్టినరోజు సందర్భంగా నట్టికుమార్ తమ సంస్థలో తీయబోయే పలు సినిమాలను ప్రకటించారు. కొన్నింటిని రాంగోపాల్ వర్మ తో కలసి తీయబోతున్నామని చెప్పారు. ఈ నెల 9న సైకో వర్మ చిత్రం షూటింగును ప్రారంభిస్తామని అన్నారు. దెయ్యంతో సహవాసం అనే మరో చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రెండు చిత్రాలకు తానే దర్శకత్వం వహిస్తున్నానని చెప్పారు. గతంలో 8 చిత్రాలకు దర్శకత్వం వహించానని, నిర్మాతగా 65 చిత్రాలు నిర్మించానని తెలిపారు
నిర్మాతలుగా మా పిల్లలు ముందుకు వచ్చి సినిమాలు చేస్తున్నారు. దిశ ఎన్కౌంటర్ సినిమా ముగింపు దశకు వచ్చింది. ఇంకా ఆరు సినిమాలు రన్నింగ్లో వున్నాయని తెలిపారు.