Reading Time: 3 mins

ఒరేయ్ బుజ్జిగా మూవీ రివ్యూ

రాజ్ తరణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’  రివ్యూ

Rating: 2/5

కమ్యూనికేషన్ గ్యాప్, కామెడీ..ఒకప్పుడు జంధ్యాల గారి సినిమాలకు, ఆ తర్వాత తరంలో ఇవివి సినిమాలకు కధా పెట్టుబడి.  ప్రతీ సినిమాలో ఈ తరహా ఎపిసోడ్స్ ఉండేవి. ఎస్వీ కృష్ణా రెడ్డి సైతం హంగామా వంటి సినిమాల్లో అదే పద్దతిని అనుసరించారు. ఇక హిందీలో ప్రియదర్శన్ అయితే పూర్తిగా ఈ స్కీమ్ నే నమ్ముకుని వరస హిట్స్ కొట్టారు.

మరి ఈ తరంలో ఎవరు ఈ కామెడీ వారసత్వాన్ని అందుకున్నారు అంటే దాదాపు ఎవరూ లేరనే చెప్పాలి. శ్రీను వైట్ల కామెడీ తరహా వేరు. అయితే ఆ మధ్యన నితిన్,నిత్యామీనన్ లతో  విజ‌య్ కుమార్ కొండా తీసిన `గుండె జారి గ‌ల్లంత‌య్యిందే` అలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ కామెడీ డ్రామానే. ఫోన్ నెంబ‌ర్ మార్పిడి వ‌ల్ల జ‌రిగే రొమాంటిక్ కామెడీ ఆ క‌థ‌. అందులో అన్ని పాళ్లూ సరిగ్గా పడ్డాయి.  దాంతో మళ్లీ అలాంటి కథే తీసుకుని హిట్ కొట్టాలనకున్నారు విజయ్ కుమార్.  `ఒరేయ్ బుజ్జిగా` అంటూ వచ్చిన ఈ సినిమా ఎంతవరకూ మనని అలరిస్తుంది..నవ్విస్తుందో చూద్దాం.
 
స్టోరీ లైన్

బుజ్జి(రాజ్‌ తరుణ్‌) వాళ్ల నాన్న  కోటేశ్వరరావు(పోసాని మురళీకృష్ణ) కొడుక్కి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేయడానికి రెడీ అవుతాడు. మరో వైపు అదే నిడదవోలు టౌన్ లో ఉండే చాముండేశ్వరి(వాణీ విశ్వనాథ్‌) తన కుమార్తె కృష్ణవేణి(మాళవిక నాయర్‌)కి కూడా ఇష్టంలేని పెళ్లిని తన మేనల్లుడుకి ఇచ్చి చేయాలనుకుంటుంది.  దాంతో ఇద్దరూ తమ తమ ఇళ్లల్లోంచి పారిపోతారు. వాళ్లిద్దరూ నిడదవోలు స్టేషన్ లో ఒకే ట్రైన్ ఎక్కుతారు. వీళ్లిద్దరూ ఇలా ట్రైన్ ఎక్కడం చూసిన ఆ ఊరి వాడు ఒకడు వీళ్ళిద్దరూ కలిసి లేచిపోతున్నారని ప్రచారం చేసేస్తాడు. దాంతో ఊళ్లో ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు అయ్యిపోతాయి.  ఇక ట్రైన్ లో వీళ్లిద్దరూ ఒకరికొకరు పరిచయం అవుతారు. అయితే తమ సొంత పేర్లు చెప్పుకోరు. బుజ్జిగాడు తన అసలు పేరు అయిన శ్రీను అని చెప్తే ఆమె స్వాతి అని చెప్తుంది. అయితే బుజ్జి గాడు..హైదరాబాద్ వచ్చింది తన గర్ల్ ప్రెండ్ సృజన (హెబ్బా పటేల్) కోసం. అయితే తనకు తెలియకుండానే బుజ్జిగాడు కృష్ణ వేణి తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా సేమ్ టు సేమ్. అయితే ఈ లోగా ఈ ప్రేమ కథకు అనేక అవాంతరాలు వస్తాయి.అవేంటి.. అస‌లు కృష్ణవేణినే స్వాతి అని బుజ్జిగాడికి, శ్రీ‌నివాసే బుజ్జిగాడ‌ని కృష్ణవేణికి ఎలా తెలిశాయి? సృజన పాత్ర ఏమైంది? రెండ కుటుంబాల వాళ్లు కలిసారా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
   
స్క్రీన్ ప్లే ఎనాలసిస్..

వాస్తవానికి ఇలాంటి కథలు, కమ్యూనికేషన్ గ్యాప్ కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అయితే పాత విషయాన్నే కొత్తగా చెప్తే ఎప్పూడు అలరిస్తుంది. అదే ఇక్కడ మిస్సైంది. పాత కాన్సెప్టుని అంతే పాతగా చెప్పే ప్రయత్నం చేసారు దర్శకుడు. ఇలాంటి చోటే ప్రముఖ దర్సకుడు  ప్రియదర్సన్ గుర్తుకు వస్తారు. ఎప్పుడో ఇరవై ఏళ్లనాటి సినిమాని  ఇప్పుటి కాలం లో తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కోర్ కాన్సెప్టు అదే ఉంచినా ఈ కాలం వాతావరణం అద్దే ప్రయత్నం చేసి , సక్సెస్ అవుతూంటాడు. ముఖ్యంగా బ్యాక్ డ్రాప్ ని మార్చటంలో ప్రియదర్శన్ మాస్టర్. అందుకే ఆయన బాలీవుడ్ ని తమ పాత మళయాళ కామెడీలతో ఏలారు. ఇలాంటి మ్యాజిక్ కొండా విజయ్ కుమార్ లో లేదు. కామెడీ ఎపిసోడ్స్ తో సినిమాని లాగేద్దామనే ప్రయత్నమే కానీఅవి ఎంత సిల్లీగా అనిపిస్తాయనేది చూసుకోలేదు. కథలో కాంప్లిక్ట్ కు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్లిపోవటం..నవ్వులు కోసం సీరియస్ సీన్ నిసైతం సిల్లీగా మార్చేయటమే కొంప ముంచింది. అలాగని ఆ కామెడీ పండిందా అంటే అదీ లేదు.
 
 నటీనటుల్లో..

రాజ్ తరుణ్ కు ఇలాంటి  పాత్రలేమీ కొత్త కాదు. కెరీర్ మొదటనుంచి ఇలాంటి పాత్రలే అదే హెయిర్ స్టెయిల్,బాడీ లాంగ్వేజ్ , యాసతో  చేస్తూ వస్తున్నాడు. హెబ్బా పటేల్ కెరీర్ చివరకు వచ్చిందని అర్దమవుతుంది. మాళవిక నాయర్ మంచి నటి అని మరోసారి ప్రూవ్ చేసుకుంది. అయితే ఇలాంటి కథల్లో నటి కన్నా …గ్లామర్ ఉన్న అమ్మాయి అయితే ఇంకా బాగుండేది.  పోసాని, వాణీ విశ్వనాథ్‌, నరేశ్‌ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. సప్తగిరి, సత్య తదితరుల కామెడీ బాగుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ..వచ్చే  హాస్పటిల్ ఎపిసోడ్ బాగుంది.

 టెక్నికల్ గా

అనూప్‌ రూబెన్స్‌ అందించిన పాటలు అద్బుతం అనలేము కానీ బాగున్నాయి. ముఖ్యంగా ‘ఈ మాయ పేరేమిటో’, ‘కృష్ణవేణి’ పాటలు నచ్చుతాయి. ప్రవీణ్‌పూడి ఎడిటింగ్ విషయానికి వస్తే మొహమాటం లేకుండా చాలా చోట్ల ట్రిమ్ చేయచ్చు.  ఆండ్ర్యూ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్. డైరక్టర్ రాతే కాదు..తీసే విధానం కూడా పాత కాలంలోనే ఆగింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. ఏవీ బాగున్నా సినిమాకు ప్రాణంగా నిలవాల్సిన స్క్రిప్టు మాత్రం బాగోపోవటం మాత్రం దెబ్బ కొట్టింది.

చూడచ్చా

అక్కడక్కడా కొన్ని కామెడీ బిట్లు చూసినట్లు ట్రై చేయచ్చు

తెర వెనక..ముందు

బ్యానర్‌:   శ్రీసత్యసాయి ఆర్ట్స్‌
నటీనటులు : రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ ,  హెబా పటేల్‌ ,వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌

కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ తదితరులు.
మాటలు: నంద్యాల రవి,
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి,
సంగీతం‌: అనూప్ రూబెన్స్
డాన్స్‌: శేఖర్‌,
ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌,
ఫైట్స్‌: రియల్‌ సతీష్‌
 సమర్పణ‌:  శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌
నిర్మాత:  కె.కె.రాధామోహన్‌
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం:   విజయ్ కుమార్ కొండా
రన్ టైమ్: 2 గంటల 44 నిముషాలు
విడుదల తేదీ‌: అక్టోబ‌ర్ 1,2020
ఓటీటీ‌:  ఆహా