Reading Time: < 1 min

గాడ్ ఫాదర్ చిత్రం ముంబై షెడ్యూల్ పూర్తి

చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న‌ `గాడ్ ఫాదర్` ముంబై షెడ్యూల్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం ముంబై లో చిత్రీకరణ జరుపుకుంటుంది.

ఇటీవ‌లే బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. `మీ ఉనికి ప్రేక్షకులకు  అద్భుత కిక్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు.’ అని చిరంజీవి ఈ సంద‌ర్భంగా పోస్ట్‌ చేశారు.

స‌ల్మాన్ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ను పోషిస్తున్నారు. చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌పై తెర‌కెక్కిస్తున్న స‌న్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయ‌ని చిత్ర‌యూనిట్ చెబుతోంది. తెలుగులో స‌ల్మాన్‌ఖాన్ న‌టించ‌డం ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌లు ఇద్ద‌రూ ఒకేచోట కనిపించ‌డం అభిమానుల‌కు పండుగే.

సోమ‌వారంతో `గాడ్ ఫాదర్` ముంబై షెడ్యూల్ పూర్త‌యింది. త‌దుప‌రి షెడ్యూల్ త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు RB చౌదరి, NV ప్రసాద్ ముంబై సెట్లో  మ‌ర్యాద‌పూర్వ‌కంగా చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌ని క‌లిశారు. ఇందులో ద‌ర్శ‌కుడు మోహన్ రాజా కూడా వున్నారు. ఈ ఫొటోను చిత్ర యూనిట్ సోమ‌వారం(21.03.2022) విడుద‌ల చేసింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నయనతార కీలక పాత్ర పోషిస్తోంది.

కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

స్క్రీన్ ప్లే & దర్శకత్వం: మోహన్ రాజా,  నిర్మాతలు: RB చౌదరి, NV ప్రసాద్,  సమర్పకురాలు: కొణిదెల సురేఖ, బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్ & సూపర్ గుడ్ ఫిల్మ్స్,  సంగీతం: S S థమన్, DOP: నీరవ్ షా, ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : వాకాడ అప్పారావు