Reading Time: 3 mins

బీస్ట్ మూవీ రివ్యూ

‘బీస్ట్’ సినిమా రివ్యూ &

Emotional Engagement Emoji (EEE)

?

“కో కో కోకిల, డాక్టర్” వంటి సక్సెస్ ఫుల్  సినిమాలతో ప్రామిసింగ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు  నెల్సన్ దిలీప్ కుమార్. ఆయన  దర్శకత్వం వహించిన “బీస్ట్” సినిమా విడుదలైంది. స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో విశేష ప్రేక్షక ఆదరణ చూరగొన్న “మనీ హేస్ట్” మాదిరి కంటెంట్ తో తెరకెక్కింది  “బీస్ట్” అనే ప్రచారం నడిచింది. కామెడీ విషయంలో నెల్సన్ కు మంచి గ్రిప్ ఉందన్న విషయాన్ని, తొలి రెండు సినిమాలు “కో కో కోకిల, డాక్టర్” స్పష్టం చేసాయి.  అదొక ప్లస్ గా మారింది. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం ఏ మేరకు సగటు ప్రేక్షకుడుని ఎంటర్టైన్ చేసింది…అసలు చిత్రం కథేంటి…తెలుగులో విజయ్ కు మార్కెట్ పెంచే సినిమానేనా వంటి విషయాలు చూద్దాం.

Storyline:

`రా` ఏజెంట్‌ వీర రాఘ‌వ (విజ‌య్‌)  ఓ ఆప‌రేష‌న్‌లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్ర‌రిస్ట్ ఉమ‌ర్ ఫ‌రుక్‌ని ప‌ట్టుకుంటాడు. అయితే.. ఈ క్రమంలో జరిగిన ఓ పొరపాటుతో ఓ చిన్న పాప చ‌నిపోతుంది.  దాంతో వీర గిల్టీ ఫీలింగ్‌ ని మనుస్సులో ఉండటంతో ఉద్యోగం చెయ్యలేక ఆ  పాప నే గుర్తు చేసుకుంటూ గడుపుతూంటాడు. ఆ పాప జ్ఢాపకాల నుంచి బయిటక పడటానికి ఓ సైక్రాటిస్ట్ (ఫృధ్వి) ని కూడా సంప్రదిస్తాడు. ఆయన చొరవతో ప్రీతి (పూజాహెగ్డే) పరిచయం అవుతుంది. ప్రీతి.. రాఘవని చూసిన వెంటనే వేరే పనేమీ లేనట్లు క్షణాల్లో  ప్రేమలో పడుతుంది.  ఓ పాట పాడి  ఆమె సాయంతో ఒక సెక్యరిటీ ఏజెన్సీలో ఉద్యోగం కోసం చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్‌కు వెళ్తాడు. అక్కడ  వీరరాఘవకు ఆ మాల్‌ను టెర్రరిస్ట్‌లు హైజాక్ చేశారని అర్దమవుతుంది. షాపింగ్ మాల్ ని హైజాక్ చేసి.. అందులో ఉన్న జనాలని బంధీలుగా ప‌ట్టుకుని, ప్ర‌భుత్వాన్ని బెదిరించి… ఉమ‌ర్ ఫారుక్‌ని విడిపించుకోవాల‌న్న‌ది ప్లాన్‌. అయితే  అక్కడే ఉన్న వీర రాఘవ సీన్ లోకి దూకుతాడు. ఆ టెర్ర‌రిస్టుల నుంచి… ప్ర‌జ‌ల్ని కాపాడటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. యాక్షన్ లోకి దిగి టెర్రిరిస్ట్ లను వరసపెట్టి చంపేస్తాడు. అలా తన ప్రాణాలను పణం పెట్టి రకరకాల సాహసాలు చేసి  ఉమ‌ర్ ఫారుక్ పాకిస్థాన్ పారిపోకుండా అడ్డుకుంటాడు. ప్రజలను సేవ్ చేస్తాడు.

Screenplay Analysis:

సినిమాలో కొన్ని చోట్ల‌… నెట్ ప్లిక్స్ సూపర్ హిట్ మ‌నీ హీస్ట్ రిఫ‌రెన్సులు క‌నిపిస్తాయి. కానీ.. `మ‌నీ హీస్ట్‌`లో ఉండే లాజిక్, మ్యాజిక్, ఇంటిలిజెన్స్ ఏవీ  ఈ సినిమాలో ఉండ‌వు. క్లైమాక్స్ లో అసలు పాకిస్దాన్ వెళ్లి విలన్ ని ఎత్తుకు రావాలనే ఆలోచన గమ్మత్తుగా ఉంటుంది.  అప్పటిదాకా సహజంగా నడిచిన సీన్స్ ఒక్కసారిగా క్లైమాక్స్ పాకిస్దాన్ కు షిప్ట్ అవ్వగానే చాలా కృత్తిమంగా అనిపిస్తుంది.  ఇక ఈ సినిమా ఎక్సపెక్టేషన్స్ రీచ్ కావటం దేవెడెరుగు.. హార్డ్ కోర్ అభిమానులను సైతం  రంజింప చేయడంలో విఫలమైందనే చెప్పాలి. ఈ సినిమాలో ఫన్, యాక్షన్ ఉన్నా వాటిని కనెక్ట్ చేసే …  ఏమోషన్ ను పండించకపోవడమే ఈ సినిమాకు ప్రధాన మైనస్ గా మారింది. అలాగే సినిమాలో  మాట్లాడితే హీరో  గన్ తీసేసి కాల్చేస్తూంటాడు .  బాంబ్ లు విసిరేస్తూంటాడు. కానీ దాని ఇంపాక్ట్ తర్వాత సీన్స్ పై  ఏమి ఉండదు.

ఎక్కువగా యాక్షన్ పాళ్ళు ఉన్నప్పటికీ, అది ఆడియన్స్ మెచ్చే విధంగా లేకపోవడంతో కొంతదూరం వెళ్లాక అదే రిపీట్ యాక్షన్ చూస్తున్నట్లు అనిపించి బోర్ కొట్టేసింది.  విజయ్ సినిమా చేస్తున్నాము అనే ఉద్దేశ్యంలో హీరోయిజాన్ని పీక్స్ లెవల్లో చూపించే ప్రయత్నమే కనపడింది తప్ప, అందులో ఎమోషన్ మిస్ అవ్వడంతో ఓ విధంగా యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారాయి. అలాగే అనుకున్న స్దాయిలో  ‘బీస్ట్’లో ఫన్  పండలేదు.

మరీ ముఖ్యంగా విజయ్ క్యారక్టర్ కు ఇచ్చిన బిల్డప్పులు, ఎడ్వెంచర్స్ కు మధ్యలో దాన్ని నిలబెట్టే  పవర్ ఫుల్ విలనిజమే లేకుండా పోయింది. టెర్రరిస్టుల్ని తింగరోళ్లగా చూపెట్టారు. వాళ్లు ఎక్కడా గన్ తీసి పేల్చలన్నా ఆలోచనలో పడిపోతూంటారు. టెర్రరిస్ట్ నాయకుడు అయితే మరీను మధ్యలో …ఇక నా వల్ల కాదు నేను ఫెయిలయ్యా….ఈ ఆపరేషన్ నాకొద్దు వదిలేసి వెళ్లిపోతానంటాడు. అలా  హైజాక్ డ్రామాను సిల్లీగా మారిపోయింది. అలా చేయకుండా విజయ్ ని బీస్ట్ గా చూపెట్టినట్లే ..అటు వైపు విలన్ సైతం అంతకన్నా భయంకరంగా ఉండి ఉంటే ఖచ్చితంగా సినిమా నెక్ట్స్ లెవిల్ లో ఉండేది.

ఇక హోస్టేజీలో ఉన్న జనం కూడా సదరు టెర్రరిస్ట్ లను చూసి భయపడరు. వాళ్లు ఏదో కామెడీ చేసుకుంటూంటారు. దాంతో ఇలాంటి కథలకు అవసరమైన టెన్షన్ ఎలిమెంట్ పూర్తిగా మిస్సైంది. ఇంక హీరోయిన్ విషయానికి వస్తే…విజయ్ సినిమాలో గ్లామర్  హీరోయిన్ ఉండాలి అన్నట్టు పూజా హెగ్డే ని పెట్టి ఓ పాట పెట్టారు. ఆమెతో లవ్ సీన్స్ ఎంత సిల్లీగా ఉంటాయంటే…పరిచయమైన రెండో నిముషంలోనే ఆమె ఐలవ్యూ చెప్పేస్తుంది. అలాగే పూజతో ఎంగేజ్మెంట్ అయిన కుర్రాడు సైతం ఆమె వెనక తిరుగుతూ విజయ్ ని ఇరికిద్దామని తిరుగుతూంటాడు. సినిమాలో  కాస్త చెప్పుకోదగ్గవి..పండిన పాత్రలు ఏమిటి అంటే వీటీవీ గణేశ్, యోగి బాబు చేసిన ఫన్. ఆ తర్వాత సెల్వరాఘవన్ సీన్స్.

Analysis of its technical content:

ఈ సినిమాలో చెప్పుకోదగినవి పాటలే. రిలీజ్ కు ముందు సినిమాపై క్రేజ్ క్రియేట్ చేసాయి. అవే సినిమాలోనూ బాగున్నాయి. విజయ్ స్టెప్స్ అదరకొట్టాడు.  ఏదైమైనా క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ఈ సినిమాకు దోహదం కాలేకపోయారు. సూపర్ హిట్ అయిన ‘హబిబో’ సాంగ్ విజువల్ గానూ బాగుంది గానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక  స్క్రిప్టే సినిమాని పాడుచేసింది . స్ట్రాంగ్  విల‌న్ లేక‌పోవ‌డం, హీరో కి ఎదురే లేకుండా సీన్లు రాసుకోవ‌డం బోర్ కొట్టించేసాయి.  డైలాగులు ఏమీ బాగోలేదు. ఏదో లిప్ సింక్  కు రాసేసినట్లే తెలిసిపోతున్నాయి. తేలిపోయాయి. కెమెరా వర్క్ , ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ..బాగా ఖర్చు పెట్టారని తెలుస్తోంది.

నటీనటుల్లో విజయ్ … వీర రాఘవన్ గా రా ఏజెంట్ పాత్రకు న్యాయం చేసారు.  పూజా హెగ్డే కేవలం పాటలకే పరిమితం. డైలాగులు ఉన్న సీన్స్ రెండు మూడు మాత్రమే.  విటివి గణేష్ బేస్ వాయిస్ లో చెప్పే పంచ్ లు పేలాయి. యోగిబాబు కామెడీ  పేలలేదు.  సెల్వ రాఘవన్ నటుడిగా చాలా బాగా చేసారు. కొత్తగా అనిపించింది.

బాగున్నవి

విజయ్ స్టైల్
కొన్ని సీన్స్ లో ఫన్
అరబిక్ కతు పాట

బాగోలేనివి
స్టోరీ లైన్
కాంప్లిక్ట్స్ లేని క్యారక్టర్స్
క్లైమాక్స్

CONCLUSION:

విజయ్ అభిమానులకు తప్పించి మిగతావారికి బోర్ కొట్టే అవకాసం ఉంది.

Movie Cast & Crew

నిర్మాణ సంస్థలు :సన్ పిక్చర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

నటీనటులు : విజయ్, పూజా హెగ్డే, షైన్ టామ్ చాకో, సెల్వరాఘవన్, యోగిబాబు, రెడిన్ కింగ్స్ లీ, అపర్ణాదాస్, అంకుర్ అజిత్ వికల్, వీటీవీ గణేశ్, రెడిన్ కింగ్ స్లే, బిజామ్ సుర్రో, లిల్లీపుట్ ఫరూకీ, షాజీ చెన్ తదితరులు

సంగీతం : అనిరుధ్ రవిచందర్

ఛాయా గ్రహణం : మనోజ్ పరమహంస

మాటలు : హనుమాన్ చౌదరి

నిర్మాణం : సన్ పిక్చర్స్

నిర్మాత : కళానిధి మారన్ (తెలుగు నిర్మాత దిల్ రాజు)

దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్

రన్ టైమ్ : 2h 38m

విడుదల తేదీ : ఏప్రిల్ 13, 2022