Reading Time: 5 mins

ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రామ్

పోలీస్ కథ చేస్తే ది వారియర్ లాంటి కథే చేయాలనిపించింది రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని లింగుస్వామి స్క్రిప్ట్ రాశారు- ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రామ్

ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా ది వారియర్ తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. రామ్ సరసన కృతి శెట్టి నటించారు ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న భారీ ఎత్తున సినిమా విడుదలఅవుతోంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వ‌హించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ది వారియర్ ఫస్ట్ టికెట్‌ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కొనుకోలు చేశారు. ఆయనకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ టికెట్ అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్,  దర్శకుడు కిశోర్ తిరుమల, నిర్మాత వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.

ఉస్తాద్ రామ్ మాట్లాడుతూ ఈ సినిమా జర్నీ డిఫరెంట్‌గా స్టార్ట్ అయ్యింది. పోలీస్ కథ చేద్దామనుకున్నాను. ఐదు కథలు విన్నాను. అన్నీ ఒకేలా అనిపించి కొన్ని రోజులు పోలీస్ కథలు వద్దని, వినకూడదని అనుకున్న టైమ్‌లో లింగుస్వామి గారు హైదరాబాద్ వచ్చారు. ముందు పోలీస్ కథ అని చెప్పలేదు. వచ్చాక చెప్పారు. ఫార్మాలిటీ కోసం విందామని అనుకున్నాను. విన్న తర్వాత పోలీస్ కథ చేస్తే, ఇటువంటి కథ చేయాలనిపించింది. కథలో ఎమోషన్ అంతలా ఆకట్టుకుంది. నేను స్క్రిప్ట్ విన్న తర్వాత ఎప్పుడూ ట్వీట్ చేయలేదు ఫస్ట్ టైమ్ ఈ సినిమాకు ట్వీట్ చేశా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కథ రాశానని ఆయన చెప్పారు. సత్య లాంటి పోలీస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు జీవితంలో మన కంట్రోల్‌లో ఉన్న పనులు చేస్తాం లేనివి దేవుడికి వదిలేస్తాం. జీవితంలో ఒకటి సాధించాలంటే ఎంత దూరమైనా వెళ్లొచ్చని పోలీసుల కథలు విన్న తర్వాత అనిపించింది. ది వారియర్ నాకు చాలా ఎమోషనల్ ఫిల్మ్. ఫస్ట్ టైమ్ ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళాను. పోలీస్ రోల్ కోసం ప్రిపేర్ కావడానికి ఒక నెల టైమ్ ఉంది. వర్కవుట్స్ చేద్దామని జిమ్‌కు వెళ్ళా. రోజుకు రెండుసార్లు జిమ్ చేద్దామనుకుంటే స్పైనల్ కార్డ్ దగ్గర ఇంజురీ అయ్యింది మూడు నెలలైనా తగ్గలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళా వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చా? జిమ్‌కు వెళ్ళొచ్చా? అంటే వన్ కిలోతో చేయొచ్చని చెప్పారు. అలా అయితే కష్టమని చెప్పా. అప్పుడు మీకు సినిమా ఇంపార్టెంట్ ఆ? లైఫ్ ఇంపార్టెంట్ ఆ? అని డాక్టర్ ప్రశ్నించారు. సినిమానే లైఫ్ అనుకునేవాళ్ళకు అది అవుటాఫ్ సిలబస్ క్వశ్చన్‌లా అనిపిస్తుంది. ఇంటికి వచ్చేశా చాలా రోజుల తర్వాత ట్విట్టర్ ఓపెన్ చేశా. అప్పుడు అభిమానులు పంపిన సందేశాలు ఒక్కొక్కటీ చదివా. నేను అప్పటివరకూ సాంగ్స్, ఫైట్స్ ఎలా చేయాలని ఆలోచించా. అన్నా నువ్వేం చేయకు. ఈ సినిమాకు మేం ఏమీ ఆశించడం లేదు అని ఫ్యాన్స్ మెసేజ్ చేశారు. ఇదీ అన్ కండిషనల్ లవ్ అని అప్పుడు అనిపించింది అభిమానులు లేకపోతే నేను లేనని ఆ రోజు అర్థమైంది. థాంక్యూ సో మచ్ నా బాడీలోని ప్రతి ఇంచ్ లో ఎనర్జీ మీ వల్లే వచ్చింది ఈ సినిమా నాకు చాలా నేర్పింది స్క్రీన్ మీద సాంగ్స్, ట్రైలర్స్ చూస్తుంటే అభిమానులే గుర్తొచ్చారు. అనంతపురంలో ట్రైలర్ లాంచ్ విడుదల కార్యక్రమానికి వచ్చిన అభిమానులు చాలా మందికి దెబ్బలు తగిలాయని విన్నాను. చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి నేను మీకు ఎంతో మీరు కూడా నాకు అంతే అని గుర్తు పెట్టుకోండి. ది వారియర్ జూలై 14న రిలీజ్ అవుతోంది. థియేటర్లలో కలుద్దాం. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మన సినిమా పనుల్లో ఉండి దేవిశ్రీ ప్రసాద్ రాలేకపోయారు డీఎస్పీ వుయ్ మిస్ యు అని అన్నారు.

చిత్ర దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ నేను ఫస్ట్ టైమ్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. నాకు రామ్ చాలా సపోర్ట్ చేశారు. దర్శకుడు ఎలా ఆలోచించారో, ఆ ఆలోచనలకు న్యాయం చేయగల హీరో దొరకడం నా అదృష్టం. భయంకరమైన టైమింగ్ సెన్స్, షార్ప్ రామ్ సొంతం డ్యాన్సుల్లో వచ్చి సూపర్బ్. నాకు అదృష్టం ఉండి కరెక్టుగా జరిగితే రామ్ తో 10 సినిమాలు చేస్తానని అనుకుంటున్నాను. నేను తీసిన రన్, పందెం కోడి, ఆవారా సినిమాలు తెలుగు ప్రేక్షకులు చూశారు. ఫస్ట్ టైమ్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశా. చాలా రోజుల నుంచి తెలుగు సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాను. హండ్రెడ్ పర్సెంట్ మంచి సినిమా కుదిరింది. ఇటువంటి సినిమాతో రావడం సంతోషంగా ఉంది. థియేటర్లలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. రన్ సినిమా తర్వాత నాతో సినిమా చేయాలని శ్రీనివాసా చిట్టూరి వచ్చారు. అప్పటి నుంచి ఆయన, నేను ఇండస్ట్రీలో ఉన్నాం. అది మా అదృష్టం నేను అడిగింది ఇచ్చారు. వారియర్ 2 కూడా ఆయనకు చేస్తున్నాను. నా కోసం 20 ఏళ్ళు వెయిట్ చేశారు. ఇంకో 20 ఏళ్ళు ఆయనతో ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నాను. పది రోజుల నుంచి దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. అందువల్ల, ఇక్కడికి రాలేకపోయారు. రామ్, దేవిశ్రీ, నేను ముగ్గురం ఒకే ఎనర్జీతో ఉన్నాం. అందువల్ల, ఇంత మంచి పాటలు వచ్చాయి. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. తమిళనాడులో ఫైట్స్ ఎవరు చేశారు? అని అడుగుతున్నారు. విజయ్ మాస్టర్ అంత మంచి ఫైట్స్ చేశారు. ఇంకా టీమ్ అంతా చాలా బాగా పని చేశారు అని అన్నారు.

దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ లింగుస్వామి గారికి వెల్కమ్ మీ సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాం. రన్, పందెం కోడి, ఆవారా సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్. థియేటర్లలో ఎన్నిసార్లో చూశానో నాకే తెలియదు. యాక్షన్ సీక్వెన్సును పేపర్ మీద రాసి, షూటింగ్ కంటే ముందు చూసే దర్శకుడు లింగుస్వామి. మనకు స్టయిలిష్ దర్శకులు ఉంటారు. మాస్ దర్శకులు ఉంటారు. స్టయిలిష్ మాస్ డైరెక్టర్ మాత్రం లింగుస్వామి గారు మాత్రమే. ఈ సినిమా పనుల్లో ఉండటం వల్ల దేవి శ్రీ ప్రసాద్ ఇక్కడికి రాలేకపోయారు. నిన్న దేవితో నేను మాట్లాడాను. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నానని చెప్పాడు. ఈ సినిమా గురించే మాట్లాడుకున్నాం. జూలై 14న మాస్ ఫెస్టివల్ లింగుస్వామి గారి విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. సాయిమాధవ్ బుర్రా నా ఫెవరెట్ డైలాగ్ రైటర్ ప్రజెంట్ తెలుగులో మీరు నంబర్ వన్ రైటర్. చాలా మంది డ్యాన్స్ చేసే హీరోయిన్లు ఉంటారు. ప్రతి పాటలో కృతి శెట్టి ఎక్స్‌ప్రెష‌న్స్‌ బావున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా హీరో రాపో (రామ్ పోతినేని). రాపోలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే దర్శకులతో మంచి ర్యాపో మైంటైన్ చేస్తాడు. నేను దేవదాస్ నుంచి రామ్ ఫ్యాన్. ఎన్నోసార్లు అతనితో సినిమా చేయాలని ట్రై చేశా వేర్వేరు కారణాల వల్ల కుదరలేదు. బెస్ట్ పార్ట్ ఏంటంటే కథ చెబుతున్నప్పుడు ప్రేక్షకుడిలా ఆలోచిస్తాడు. ఒకసారి నేను సెన్సిటివ్ లవ్ స్టోరీ చెప్పాను అందులో ఇద్దరు హీరోలు ఉంటారు అది రామ్ చేసే సినిమా కాదు నేను కూడా వేరే తరహా సినిమా చేద్దామనుకున్నా. అప్పుడు ఫ్యాన్ రెండులోనో, మూడులోనో తిరుగుతోంది. రామ్ ఒక డైలాగ్ చెప్పాడు బ్రో మనం సినిమా చేస్తే ఫ్యాన్ ఐదులో తిరగాలి అన్నాడు. అది నాకు బాగా నచ్చింది. కచ్చితంగా రామ్ తో సినిమా ఉంటుంది. అది ఎప్పుడనేది ఈ రోజు చెప్పలేను. రామ్ తో నేను సినిమా చేస్తున్నా అతి త్వరలో సమయం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాను. రామ్ ఎనర్జీని మ్యాచ్ చేయడం దర్శకులకు పెద్ద టాస్క్. దర్శకుడు మంచి క్యారెక్టర్ రాసినప్పుడు, పెర్ఫార్మన్స్ చేయడం అనేది యాక్టర్లకు ఛాలెంజ్. రామ్ తో పని చేయడం దర్శకులకు ఛాలెంజ్ ది వారియర్ ట్రైలర్ చూశా చాలా బావుంది. పోలీస్ రోల్ అలా ఉంటుందని ఊహించలేదు డైలాగ్స్ వింటే గూస్ బంప్స్ వచ్చాయి టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. జూలై 14న ప్రేక్షకులతో పాటు నేను కూడా థియేటర్లలో సినిమా చూస్తా అని అన్నారు.

కృతి శెట్టి మాట్లాడుతూ రామ్ ఎప్పుడూ సరదాగా ఉంటారు. ఆయనలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే సాంగ్ షూటింగ్ చేసేటప్పుడు బాడీలో ఎంత పెయిన్ ఉన్నా ఆగలేదు. సాంగ్స్‌లో ఆయన ఎనర్జీ చూశారు ఎవరూ మ్యాచ్ చేయలేదు. నా బాడీలో పెయిన్ లేదు కానీ ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయడం కష్టమైంది. ఆ డెడికేషన్, హార్డ్ వర్క్‌కి ఆయన్ను అభినందించాలి. అందుకే అందరూ ఆయన్ను ఉస్తాద్ రాపో అంటారేమో. దర్శకుడిగా లింగుస్వామి డైమండ్ అని తెలుసు. ఆయనతో పని చేసిన తర్వాత ఎంత గుడ్ పర్సన్ అని  తెలిసింది. ఆయన మనసు బంగారం నాకు విజిల్ మహాలక్ష్మి రోల్ ఇచ్చినందుకు థాంక్స్. మా సినిమాకి డీఎస్పీ గారు యూఎస్పీ ఉప్పెన తర్వాత దేవిశ్రీతో ఎప్పుడు పని చేస్తానని అనుకున్నాను. ఈ సినిమా వచ్చింది. బుల్లెట్ సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. గుడికి వెళితే ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయో మా నిర్మాతలు శ్రీనివాసా చిట్టూరి, పవన్ దగ్గర నుంచి అంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వారియర్ ఉంటారు. కొవిడ్ టైమ్‌లో ఫ్రంట్ లైన్ వారియర్స్ డాక్టర్స్, నర్సులు, పోలీసులు ఎంతో కష్టపడ్డారు. పోలీస్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో చూడండి అని అన్నారు.

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. కరోనా వల్ల రెండేళ్లు సినిమాలకు ప్రేక్షకులు దూరం అయ్యారు. సమాజానికి సందేశం ఇచ్చే పోలీస్ రోల్ చేస్తున్న రామ్, హీరోయిన్ కృతి శెట్టికి ఆల్ ది బెస్ట్. మంచి స్నేహితుడు శ్రీనివాసా చిట్టూరి గారికి బెస్ట్ విషెష్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని అన్నారు.

నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ నాకు ఇష్టమైన దర్శకుడు లింగుస్వామి గారు. రన్ సినిమా చూసినప్పటి నుంచి ఆయనకు ఫ్యాన్ అయ్యా. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి నాకు బాగా పరిచయం. రామ్‌తో సినిమా చేస్తున్నారని తెలిసి నేనే ఆఫీసుకు వెళ్లి కలిశా. లింగుస్వామి గారు డౌన్ టు ఎర్త్ పర్సన్ ఈ సినిమాలో రామ్ పెర్ఫార్మన్స్ చూసి ఫ్యాన్ అయిపోయా తెలుగులో డైలాగులు ఎంత బాగా చెప్పాడో! తెలుగు కన్నా తమిళంలో అద్భుతంగా చెప్పారు. తమిళంలోనూ ప్రతి సీన్ సింగిల్ టేక్‌లో చేశాడు. బాలీవుడ్‌లో ఉండాల్సిన రామ్ మన తెలుగులో, మనతో యాక్ట్ చేయడం అదృష్టం. రియల్లీ చాలా టాలెంటెడ్. తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీస్తే, తమిళంలో వేరే ఆర్టిస్టును తీసుకుంటారు. తమిళంలో కూడా నాతో రోల్ చేయించారు అని అన్నారు

రచయిత సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ ఈ సినిమాలో డైలాగ్స్ చాలా బావుంటాయి ఇటీవల నేను సినిమా చూశా ఎక్స్ట్రాడినరీగా ఉంది రామ్ గారి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ సినిమాలో ఉన్నాయి. హండ్రెడ్ పర్సెంట్ అభిమానులకు నచ్చే సినిమా ఇది. అందరికీ నచ్చే సినిమా నేను తొలిసారి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ క్రియేషన్స్ సంస్థలో చేశా. అద్భుతమైన నిర్మాతలు. లింగుస్వామి గారితో ఫస్ట్ టైమ్ చేశా. ఆయన అద్భుతమైన దర్శకుడు. డైలాగ్స్‌లో కూడా లింగుస్వామి గారి భాగస్వామ్యం ఉంది ఈ సినిమాలో ప్రతి డైలాగ్ నేను, ఆయన కలిసి రాసిందే క్రెడిట్ నా ఒక్కడిదే కాదు, ఆయనది కూడా ఉందని మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ అనడం కంటే యాంటీ హీరో అనడం కరెక్ట్. ఒక హీరోకి, యాంటీ హీరోకి మధ్య ఉండే ఫైట్ ది వారియర్. 14న థియేటర్లలో మీరు చూస్తారు. అద్భుతమైన హిట్ అవుతుంది” అని చెప్పారు.

కళాదర్శకుడు సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సినిమాకు మెయిన్ వారియర్స్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో. అవకాశం ఇచ్చిన మా నిర్మాత, అందరికీ థాంక్స్ అని అన్నారు.

ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ ప్రేక్షకులు కోరుకున్నవన్నీ ది వారియర్లో ఉన్నాయి. దర్శకుడు లింగుస్వామి మానవత్వం ఉన్న మనిషి. బెస్ట్ టెక్నీషియన్. అటువంటి వ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం కల్పించిన మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి గారికి, పవన్ కుమార్ గారికి, మా హీరో రామ్ గారికి థాంక్స్. పాటలు, ఫైట్స్, సీన్స్ ప్రతిదీ ప్రేక్షకుల అంచనాలకు మించే ఉంటాయి అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ది వారియర్ సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవ్, ఆదిత్య మ్యూజిక్ మాధవ్, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు