సార్ మూవీ ట్రైలర్ లంచ్ ఈవెంట్
పేద విద్యార్థుల చదువు కోసం మాష్టారు పోరాటం ఆకట్టుకుంటున్న సార్ ట్రైలర్
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం సార్(తెలుగు)/ వాతి(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో సార్(వాతి)పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. కథానాయకుడు ధనుష్, కథానాయిక సంయుక్త మీనన్, దర్శకుడు వెంకీ అట్లూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజాగా విడుదలైన సార్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. చదువుని వ్యాపారంగా చేసుకొని పేద విద్యార్థులకు చదువు అందకుండా చేస్తూ పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న వ్యక్తులపై కథానాయకుడు సాగించే పోరాటమే సార్. త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరపున కొన్ని ప్రభుత్వ కళాశాలను దత్తతు తీసుకుంటారు. అక్కడికి ఫ్యాకల్టీగా కథానాయుడు వెళ్తాడు. హాస్యం, ప్రేమ సన్నివేశాలతో సరదాగా సాగిపోతున్న కథలో కొందరి స్వార్థం కారణంగా పేద విద్యార్థులకు చదువు దూరమయ్యేలా కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ విద్యార్థుల తరపున సార్ ఎలా పోరాటం సాగించాడో అనే ఆసక్తిని రేకిత్తిస్తూ రూపొందిన ట్రైలర్ మెప్పిస్తోంది. చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ళ కోసం మీరు ఉంటారన్న నమ్మకం వాళ్ళకి కుదరడం లేదు, ఎడ్యుకేషన్ లో వచ్చినంత డబ్బు పాలిటిక్స్ లో రాదు, డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చుకానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది వంటి సంభాషణలు కథానుసారం బలంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడి అద్భుతమైన సృష్టికి జె. యువరాజ్ కెమెరా పనితనం, జి.వి. ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం తోడై ట్రైలర్ ను మరోస్థాయికి తీసుకెళ్లాయి.
ట్రైలర్ విడుదల సందర్భంగా కథానాయకుడు ధనుష్ మాట్లాడుతూ ఇది నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఇది నా మొదటి తెలుగు సినిమా. చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా, హిందీ సినిమా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అనడం సంతోషించదగ్గ విషయం. ఈ కథ చాలా బాగుంటుంది. నాకు ఇంతమంచి సినిమా ఇచ్చినందుకు వెంకీ అట్లూరి గారికి ధన్యవాదాలు. అలాగే చినబాబు గారికి, నాగవంశీ గారికి, త్రివిక్రమ్ గారికి, సంయుక్త మీనన్, హైపర్ ఆది మరియు మా టీమ్ అందరికీ ధన్యవాదాలు. అన్నారు.
దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో ఈ కథ రాసుకొని వంశీ గారికి వినిపించగా ఆయనకు నచ్చింది. లాక్ డౌన్ కావడంతో అప్పుడు హీరోలు పెద్దగా కథలు వినే ధైర్యం చేయలేదు. కానీ ధనుష్ గారు మాత్రం కథ చెప్పడానికి రమ్మన్నారు. ఈ సినిమా ఆయన చేసిన చేయకపోయినా ఆయనకు కథ చెప్పానన్న సంతృప్తి నాకు చాలు అనుకున్నాను. కానీ ఆయన కథ వినగానే ఈ సినిమా చేస్తున్నాను అనడంతో నాకు ఆ ఆనందంలో మాటలు రాలేదు. నాకు ఈ అవకాశమిచ్చిన వంశీ గారికి, ధనుష్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను అన్నారు.
నాయిక సంయుక్త మాట్లాడుతూ సర్ సినిమా అందరినీ అలరిస్తుందని తెలిపారు.
హైపర్ ఆది మాట్లాడుతూ ధనుష్ గారి సినిమాల్లో రఘువరన్ బి.టెక్ తర్వాత తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే సినిమా సార్. అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా. ఒక తెలుగు యువ దర్శకుడు తమిళ స్టార్ కి కథ చెప్పి ఒప్పించాడంటే తెలుగు ప్రేక్షకులు గర్వంగా ఈ సినిమా చూడాలి. అలాగే పాపులర్ స్టార్ అయ్యుండి కథ నచ్చి మూడు సినిమాల అనుభవమున్న దర్శకుడికి అవకాశమిచ్చాడంటే తమిళ ప్రేక్షకులు గర్వంగా ఈ సినిమా చూడాలి. తెలుగు, తమిళ ప్రేక్షకులందరూ మెచ్చేలా ఉంటుంది ఈ సినిమా. తప్పకుండా ఫిబ్రవరి 17న థియేటర్లకి వెళ్లి చూడండి అన్నారు.
చివరిగా కదహానాయకుడు ధనుష్ చిత్రం లో నటించిన స్టూడెంట్స్, టీమ్ తో కలసి చిత్రంలోని మాస్టారు మాస్టారు గీతం ఆలపించి అభిమానుల సంతోషాన్ని అంబరాన్ని తాకేలా
చేశారు.