Reading Time: 2 mins

లక్కీ భాస్కర్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

దుల్కర్‌ సల్మాన్‌, వెంకీ అట్లూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ చిత్రానికి లక్కీ భాస్కర్ టైటిల్ ఖరారు

దుల్కర్ సల్మాన్ వివిధ భాషల్లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మలయాళ యంగ్ స్టార్ పాన్-ఇండియా స్థాయిలో అలరిస్తూ, ప్రస్తుత తరంలోని ఉత్తమ నటులలో ఒకరిగా ఖ్యాతిని పొందారు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా పాపులర్ స్టార్. తన గత చిత్రం సీతారామంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దుల్కర్ సల్మాన్, తన తదుపరి పాన్-ఇండియా చిత్రం కోసం దర్శకుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపారు.

ధనుష్ తో చేసిన సార్(వాతి)తో వెంకీ అట్లూరి బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రం సామాజిక బాధ్యత కలిగిన దర్శకుడిగా ఆయన ఖ్యాతిని పెంచింది. సార్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న వెంకీ అట్లూరి, ఇప్పుడు తన ప్రతిభను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్తున్నారు. ఆయన తదుపరి సినిమా కోసం సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ సార్(వాతి)ని కూడా వారే నిర్మించడం విశేషం. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. దుల్కర్ సల్మాన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వెంకీ అట్లూరి మరో విభిన్న కథాంశంతో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు.

నమ్మశక్యంకాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథగా ఈ చిత్రం రూపొందుతోందని ప్రకటన సందర్భంగా చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇప్పుడు ఈ చిత్రానికి లక్కీ భాస్కర్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఇది సినిమా ప్రేమికులకు థియేటర్‌లలో గొప్ప అనుభూతిని కలిగించే చిత్రమవుతుందని మేకర్స్ పేర్కొన్నారు.

జాతీయ అవార్డు గ్రహీత, సార్(వాతి)కి చార్ట్‌బస్టర్ సంగీతం అందించిన జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

తారాగణం :

దుల్కర్ సల్మాన్

సాంకేతికవర్గం :

రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఎడిటర్: నవీన్ నూలి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్