ఆన్ ది రోడ్ మూవీ ట్రైలర్ విడుదల
ఆన్ ది రోడ్ మూవీ ట్రైలర్ ను విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ
పూర్తిగా లడఖ్ ప్రాంతంలో తెరకెక్కించిన మొదటి భారతీయ చిత్రం ఆన్ ది రోడ్ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషలలొ విడుదలకు సిద్దమవుతోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను, ట్రైలర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలోని విజువల్ మూడ్ ను, స్టైలిష్ లుక్ ను మెచ్చుకోవడమే కాకుండా ఇలాంటి అవుట్ పుట్ తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఆన్ ది రోడ్ టీమ్ మెంబర్స్ ను ప్రశంసించారు, సినిమా విజయం సాధించాలని శుభాభినందనలు తెలియజేశారు. ఈ చిత్ర దర్శకుడు సూర్య లక్కోజు గతంలో రామ్ గోపాల్ వర్మతో కలిసి పలు చిత్రాలకు పని చేయడం విశేషం.
ప్రముఖ చిత్ర నిర్మాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC) ఉపాధ్యక్షులు ముత్యాల రామ్ దాస్ ఈ సినిమా విడుదలకు సహకారం అందిస్తూ ఈ ప్రాజెక్టులో ఒక భాగం అయ్యారు. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ట్రైలర్ మరియు ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉన్నాయని తప్పకుండా ప్రేక్షకాదరణ చూరగొంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్ పీ ఎల్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్నిసూర్య లక్కోజు నిర్మించారు. రాజేష్ శర్మ ఈ సినిమాకు సహ నిర్మాత.
వెస్టర్న్ ఫిల్మ్ జానర్ అయిన రోడ్ ట్రిప్ చిత్రాలయంటే తనకిష్టమని, అందుకే ఒక సింపుల్ కథను బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ లడఖ్ లోని సుందరమైన ప్రదేశాల్లో చిత్రీకరించి ప్రేక్షకులకు అందివ్వాలనే ప్రయత్నం చేశామని అన్నారు. ఇదొక రోడ్ ట్రిప్ థ్రిల్లర్ అయినప్పటికీ, సేఫ్ గా రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్న ఒక జంటతో ఒక సాధారణ వ్యక్తి కలవడం, అతను వారితో ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత చోటు చేసుకున్న కల్లోల సంఘటనలే ఈ చిత్ర కథాంశమని తెలిపారు.
ఈ చిత్రంలో సంక్లిష్టమైన కథానాయకుడి పాత్ర పోషించడంలో ఎదుర్కొన్న ఛాలెంజిల గురించి రాఘవ్ మాట్లాడుతూ పాత్రకు జీవం పోసేందుకు సూక్ష్మమైన అంశాలను దృష్టిలో పెట్టుకున్నానని చెబుతూ, అవుట్ పుట్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
చిత్ర నాయకి అయిన స్వాతి మెహ్రా తన మొదటి సినిమా లడఖ్ లాంటి అందమైన ప్రాంతంలో తెరకెక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ సరిగా అందకపోవడం లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో షూటింగ్ చేయడంతో స్వాతి మెహ్రా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. అయితే ఫైనల్ అవుట్ పుట్ చూసిన తర్వాత ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా లభిస్తుందనే నమ్మకంతో సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు.
నటీనటులు:
రాఘవ్ తివారీ, స్వామి మెహ్రా, కర్ణ్ శాస్త్రి, రవి సింగ్, రాహుల్ కుమార్, ఎస్‌ఎస్. అంగ్‌చోక్
సాంకేతిక నిపుణులు :
కెమెరా: గిఫ్టీ మెహ్రా
సంగీతం: సుర్భిత మనోచా
ఎడిటర్: మందర్ మోహన్ సావంత్,
బ్యానర్ ఎస్‌పిఎల్ పిక్చర్స్
నిర్మాతలు: సూర్య లక్కోజు, రాజేశ శర్మ
కథ- దర్శకత్వం – సూర్య లక్కోజు