Reading Time: 3 mins

ఒక్కడే నెం 1 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

సినీ,పారిశ్రామిక అతిరథులు ముఖ్య అతిథులుగా ఒక్కడే నెం.1 ప్రీ రిలీజ్‌

క్లాసిక్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ఒక్కడే 1. సునీత, శృతిక, మధువని కథానాయికలుగా నటించగా, శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ సినీ, పారిశ్రామిక అతిరథులు ముఖ్య అతిథులుగా శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాతలు సి. కల్యాణ్‌, దామోదర ప్రసాద్‌, అంబికా కృష్ణ, తుమ్మలపల్లి సత్యనారాయణ, దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీవిశ్వనాథ్‌, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు విచ్చేశారు.

ఈ సందర్భంగా సి. కళ్యాణ్‌ మాట్లాడుతూ
నేను చాలా సినిమాలు నిర్మించినా ఏదో రెండు సినిమాల్లో చిన్న క్యారెక్టర్‌లు చేశాను తప్పితే ఫుల్‌ప్లెడ్జ్‌గా నటించలేదు. ఎందుకంటే నటించడం చాలా కష్టం. కానీ వెంకన్న గారు మాత్రం తొలి చిత్రంతోనే ఈ వయసులో డాన్స్‌లు, ఫైట్‌లు, రొమాన్స్‌ ఇలా అన్ని రసాలను ఈ చిత్రంతో పండిరచేశారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా విజయంతో వెంకన్నగారు సమాజానికి ఉపయోగపడే మరిన్ని సినిమాలు నిర్మించాలని కోరుకుంటూ యూనిట్‌ అందరికీ ఆల్‌ది బెస్ట్‌ చెబుతున్నాను అన్నారు.

దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ
వెంకన్నగారు పారిశ్రామికవేత్తగా తనను తాను ప్రూవ్‌ చేసుకున్నారు. ఇప్పుడు సినిమా రంగంపై దృష్టిపెట్టి సమాజానికి ఉపయోగపడేలా ఓ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ చేయడం అభినందనీయం. ఈ ఒక్కడే 1 విజయంఓ మరిన్ని సినిమాల్లో నటించాలని, నిర్మించాలని కోరుకుంటున్నా అన్నారు.

అంబిక కృష్ణ మాట్లాడుతూ
వెంకన్నగారు పారిశ్రామికవేత్తగానే కాదు, హీరోగా కూడా సక్సెస్‌ అయ్యారు అని ఈ సినిమా పాటలు, ఫైట్‌లు చూస్తుంటే అర్ధమౌతోంది. ఈ సినిమా తర్వాత మరో సినిమా కూడా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ఆయన్ని అభినందించాలి. ఎందుకంటే పరిశ్రమను బతికించేవి 90 శాతం చిన్న సినిమాలే. ఇలాంటి చిత్రాలను, నిర్మాతలను ప్రోత్సహించడం అంటే పదిమందికి అన్నం పెట్టడమే. ఈ చిత్రం విజయం సాధించి యూనిట్‌ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నా అన్నారు.

కాశీవిశ్వనాథ్‌ మాట్లాడుతూ
సినిమా ట్రైలర్‌, పాటలు చూస్తే ఇది ఎంత ప్యాషనేట్‌గా తీశారో అర్ధమౌతోంది. ఇంత మంచి ఔట్‌పుట్‌ రావాలంటే ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరూ ఇది మన స్వంత సినిమా అనుకుని పనిచేయాలి అలా పని చేయాలంటే నిర్మాత వారిని అంత బాగా చూసుకోవాలి. వెంకన్నగారు ఆ పని చేశారు కాబట్టే ఇంత మంచి ఔట్‌పుట్‌ వచ్చింది. హీరో, నిర్మాత వెంకన్న గారికి, దర్శకులు శ్రీపాద రామచంద్రరావు గారికి నా అభినందనలు అన్నారు.

రేలంగి నరసింహారావు మాట్లాడుతూ
యూనిట్‌ సమష్టిగా కృషి చేశారు. అది తెరమీద కనిపిస్తోంది. ఇది చిన్న సినిమా కాదు చిన్న సినిమాలా అనిపించే పెద్ద సినిమా. ఈ విజయంతో వెంకన్నగారు మరిన్ని సినిమాలు నిర్మించి తన బ్యానర్‌కు ఓ బ్రాండ్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకోవాలని కోరుకుంటున్నా. అందరికీ మంచి విజయం చేకూరాలని ఆశీర్వదిస్తున్నా అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ
సినిమా ఫీల్డ్‌లో సక్సెస్‌ల శాతం చాలా తక్కువ. కాబట్టి ఈ ఫీల్డ్‌లోకి వద్దులేండి అన్నాను. దానికి ఆయన ఆ తక్కువలో కొందరు ఉన్నారు కదా వారిలో నేను ఎందుకు ఉండకూడదు అని ఎదురు ప్రశ్నించారు. అప్పుడే అర్ధమైంది ఈయన సక్సెస్‌ కొట్టాలని ఫిక్స్‌ అయి ఇక్కడకు వచ్చారని. ట్రైలర్‌, పాటలు, సురేష్‌ మూవీస్‌, ఏషియన్‌ ఫిలింస్‌ రిలీజ్‌ చూస్తుంటే ఆల్రెడీ సగం సక్సెస ్‌సాధించారు. మిగిలిన సగం 27వ తేదీ సాధించబోతున్నారు అన్నారు.

చిత్ర హీరో వెంకన్న మాట్లాడుతూ
ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు విచ్చేసిన సినీ, పారిశ్రామిక, ఆర్యవైశ్య ప్రముఖులకు మరియు నా మిత్రులు, శ్రేయోభిలాషులకు, చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు. వ్యాపారవేత్తగా సక్సెస్‌ అయిన నేను సినిమా రంగాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నాను. మంచి ప్రొడక్ట్‌ మార్కెట్‌లోకి వదిలితే తప్పకుండా సక్సెస్‌ అవుతుంది అనేది బిజినెస్‌ సక్సెస్‌ సీక్రెట్‌. అలాగే మంచి కంటెంట్‌తో సినిమా తీస్తే సక్సెస్‌ ఆటోమేటిక్‌గా వస్తుందనేది సినిమా హిట్‌ సీక్రెట్‌. అందుకే మంచి కథ, కథనాలు, మేకింగ్‌ వేల్యూస్‌తో ఈ ఒక్కడే 1ను నిర్మించాము. మన టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేశాను. సినిమా చూసిన సురేష్‌బాబు గారు, ఏషియన్‌ ఫిలింస్‌ వారు ఆంధ్ర, తెలంగాణల్లో విడుదలకు చేయటానికి ఒప్పుకోవడం మా సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. అలాగే కర్ణాటక నుంచి కూడా బయ్యర్‌ వచ్చారు. అక్కడ కూడా డైరెక్ట్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈనెల 27న విడుదలవుతున్న మా సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అన్నారు.

దర్శకుడు శ్రీపాద రామచంద్రరావు మాట్లాడుతూ
గతంలో భక్తిరస చిత్రాలు తీసిన నాకు వెంకన్నగారి ప్రోత్సాహం వల్లే మంచి కమర్షియల్‌ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేశారు. అందరికీ సక్సెస్‌ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర యూనిట్‌తో పాటు తల్లాడ వెంకన్న శ్రేయోభిలాషులు సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ ప్రసంగించారు.

సాంకేతికవర్గం :

ఎడిటర్‌: నందమూరి హరి
సంగీతం: రామ్‌ తవ్వా
కెమెరా: డి. యాదగిరి, ఆర్‌.ఆర్‌. చిన్నా (చెన్న్కె)
నిర్మాతలు తల్లాడ శ్రీలక్ష్మి, తల్లాడ సునీల్‌
మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీపాద రామచంద్రరావు