Reading Time: 2 mins

Raise of Ram Charan as Global Star-Tel

చిరంజీవి తనయుడు నుంచి గ్లోబల్ స్టార్ వరకు

రామ్ చరణ్ తండ్రి ‘చిరంజీవి’ అనే స్థాయికి చరణ్ ఎదిగారంటే అంతకంటే ఆయన ఏం సాధించాలి. వారసత్వం కేవలం దారిని మాత్రమే చూపుతుంది విజయాలను స్వయంగా మనమే సాధించాలని ఉగ్గుపాలతో పట్టించారేమో తెలియదు కానీ.. రామ్ చరణ్ ప్రస్థానం అందుకు నిదర్శనం అనిపిస్తుంది. తండ్రి మెగాస్టార్. ఆయన సాధించిన విజయాలు, ఆయన అధిరోహించిన శిఖరాలు ఎన్నో, డ్యాన్స్‌లు, ఫైట్లు, నటనతో యావత్తు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను కట్టిపడేశారు. చిరంజీవి అనే పేరు ఎందరో అభిమానలు గుండెలపై అచ్చేసుకున్నారు. అదీ ఆయన రేంజ్ అని చెప్పాడానికి ఇదికూడా సరిపోదంటే అతిశయోక్తి కాదు. పైగా బాబాయి పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయనకు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అలాంటి కుటుంబం నుంచి ఓ వారసుడు వస్తున్నారంటే అందరి అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి సమయంలో రామ్ చరణ్ 2007లో చిత్రపరిశ్రమలో హీరోగా అడుగుపెట్టారు.

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆ మెగాబాధ్యతను తన భూజాలమీద వేసుకున్నారు. చిరుతా సినిమాతో చిరు వారసుడిని పరిచయం చేశారు. మొదటి సినిమాతో మెగా అభిమానులు మన్ననలు పొందారు రామ్ చరణ్. వెంటనే తన రెండవ సినిమా దిగ్గజ దర్శకుడు రాజమౌళితో చేశారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో మగధీర(2009) అనే సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కించారు. అనుకున్నదానికంటే గొప్ప విజయాన్ని సాధించారు. దాని తరువాత మంచి బడ్జెట్‌తో ఆరెంజ్(2010) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అది పూర్తిగా నిరాశ పరిశిచింది. తరువాత దాన్ని రీరిలీజ్ 4కే లో విడుదల చేసినప్పుడు ఆదరించారు అది వేరు విషయం అనుకోండి. ఆ తరువాత రచ్చ(2012), నాయక్(2013) చిత్రాలు కమర్షల్‌గా సక్సెస్ సాధించినా.. రామ్ చరణ్‌కు అనుకున్నంత పేరు రాలేదు. పైగా రోటిన్ యాక్టింగ్, యాక్షన్ పరంగా వెరియేషన్స్ లేవు అనే నెగిటీవ్ టాక్‌ను మూట గట్టుకున్నారు. అదే సమయంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

బాలీవుడ్‌లో జంజీర్(2013) తెలుగులో తుఫాన్‌గా తెరకెక్కిన చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. బొమ్మ పడిన మొదటి షో నుంచే విపరీతమైన నెగిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఆ సమయంలోనే ఆయన యాక్టింగ్‌పై నెగిటీవ్ కామెంట్స్ వచ్చాయి. అంతే కాకుండా బాడీ షేమింగ్స్ కూడా మొదలైయ్యాడి. అయినా ఎక్కడ తడబడలేదు. తుఫాన్‌ను సైతం లెక్కచేయక ఒంటిరిగా నిలబడ్డ ఓ యోధుడిలా అవకాశం కోసం నిలబడ్డాడు. సమయం కోసం కాచుకొని ఓపిగ్గా నిలబడ్డాడు. ఆ తరువాత ఎవడు(2014) చిత్రం విడుదల అయింది. సినిమా కమర్షల్‌గా హిట్ అయింది కానీ నెగిటీవ్ కామెంట్స్ ఆగలేదు.

నిజంగా ఈ సమయం అంతా రామ్ చరణ్‌కు గడ్డుకాలమనే చెప్పాలి. ఏది కలిసి రాలేదు. క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశితో తెరకెక్కించిన గోవిందుడు అందరివాడేలే(2014), హూమరస్ డైరెక్టర్ శ్రీను వైట్లతో చేసిన బ్రూస్లీ(2015) కూడా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలో కాస్త ఆలోచించి ఒక రీమేక్ సినిమా చేశారు. స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డితో ధ్రువ(2016) చేశారు. సినిమా విజయంతో పాటు రామ్ చరణ్ కెరియర్‌కు ఆ చిత్రం టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆ తరువాత రామ్ చరణ్ తిరిగి చూసుకోనక్కర్లేదు అనే టాక్ వినిపించింది. అలాంటి సమయంలో రంగస్థలం అనే సినిమా వచ్చింది.

క్రియేటీవ్ మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం(2018) సినిమా వచ్చింది. మొదటి సారి రామ్ చరణ్ చెవిటి వాడిగా తెరపై కనిపించారు. అప్పటి వరకు మాస్ యాక్షన్ చిత్రాలను మాత్రమే చేసిన ఆయన ఒక్కసారిగా సెటిల్డ్ ఫర్ఫార్మెన్స్‌తో పాటు ఆయన అభిమానులు సైతం అవాక్కయ్యే ఫర్ఫార్మెన్స్ ఇచ్చారు. రామ్ చరణ్‌లోని పూర్తి నటుడిని ఆవిష్కరించిన చిత్రం రంగస్థలం అని చెప్పొచ్చు. ఆ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విదేయ రామ(2019) చిత్రం విడుదల అయింది. అదీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ అప్పటి వరకు ఎవరికీ తెలియదు రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అవుతారని.

పాన్ ఇండియా హీరోలను తయారు చేసే మాస్టర్ మైండ్ రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చిత్రం ఒప్పుకున్నారు. దాదాపు 3 సంవత్సరాల ఆయన విలువైన సమయాన్ని ఇచ్చారు. ఒళ్లు హూనం చేసుకొని కష్టపడ్డారు. డ్యాన్స్‌లో టాప్ అయిన ఎన్టీఆర్‌తో పోటాపోటీగా డ్యాన్స్ ఇరగదీశారు. ఫైట్స్‌తో మెప్పించారు. రీజనల్ స్టార్ అయిన ఈ మెగాపవర్ స్టార్ పాన్ ఇండియానే కాదు ఏకంగా గ్లోబల్ స్టార్ అయ్యారు. తెలుగోడి సత్తా ఇది అని రొమ్ము విరుచుకొని అంతర్జాతీయ వేదికలపై నిలబడ్డారు. ఆస్కార్ సాధించారు.

ఆ తరువాత ఆచార్య(2022)లో గెస్ట్ రోల్ చేశారు. ప్రస్తుతం ఈ గ్లోబల్ స్టార్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే భారీ బడ్జెట్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆ చిత్రంపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం తరువాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇందులో అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఖరారు అయిన సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్, గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన రామ్ చరణ్ ఎక్కడా కూడా కించిత్తు స్టార్ అనే గర్వం లేకుండా తండ్రి బాటలో నడిచే మెగా తనయుడు అని చెప్పొచ్చు.