Radhika Sharathkumar Birthday Special
రాధిక శరత్ కుమార్ బర్త్ డే స్పెషల్
వెండితెరపై ఉరకలెత్తే ఉత్సాహం.. అంతే చలాకీతనం.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన నటి రాధిక. రాధిక శరత్ కుమార్ ఇప్పటి జనరేషన్‌కు హీరో తల్లిగానో, సీరీయల్ యాక్టర్గానో తెలుసు. కానీ తోంబైలలో వెండితెరను ఏలిన కథనాయిక. వరుస సినిమాలతో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకొని ఎంతోమంది యువకుల కలల రాణిగా ఉన్నారు. డాన్సుల్లోనూ ఆమె స్పీడు, నటనలో ఆమె చాతుర్యం ముచ్చటగొలిపేవి. తనతో పోటీపడలేక రాధికతో డ్యాన్స్ వద్దు బాబోయ్ అన్న హీరోలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పాత్ర ఏదైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేయడం తన నైజO. అదే తనను వెండితెరకు మహారాణిని చేసింది.
రాధిక 1962 ఆగస్టు 21న జన్మించారు. తన తండ్రి తమిళ హాస్యనటుడు, విలన్ ఎమ్.ఆర్.రాధ. చిన్నతనం నుంచి ఇంట్లో షూటింగ్ షూటింగ్ వాతావరణం ఉండేది. దాంతో తనకు తెలియకుండానే నటనవైపు అడుగులు పడ్డాయి. టీనేజ్లోనే కెమెరా ముందు నటించారు. 1978లో భారతీరాజా దర్శకత్వంలో ‘కిళక్కే పోగుమ్ రైల్’ చిత్రంలో నటించారు. ఇక చిరంజీవి జోడిగా 1981లో ‘న్యాయం కావాలి’ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేశారు. మొదటి సినిమా విజయంతో పాటు చిరంజీవి రాధికల స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఆ తరువాత శోభన్ బాబు, చంద్రమోహన్, మురళీమోహన్ హీరలతో కూడా నటించి మెప్పించారు.
చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన రికార్డు సైతం రాధికనే కొట్టేసింది. వీరి కాంబినేషన్లో న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, ఇది పెళ్ళంటారా, బిల్లా-రంగా, యమకింకరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మొండిఘటం, ప్రేమపిచ్చోళ్ళు, పల్లెటూరి మొనగాడు, అభిలాష, శివుడు శివుడు శివుడు, పులి-బెబ్బులి, గూఢచారి నంబర్ 1, సింహపురి సింహం, హీరో, జ్వాల, దొంగమొగుడు, ఆరాధన, రాజా విక్రమార్కతో మొత్తం 19 చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇవి మాత్రమే కాకుండా అనుబంధం, త్రిశూలం, రాముడు కాదు కృష్ణుడు, స్వాతిముత్యం, రాధాకళ్యాణం, మూడుముళ్ళు, జీవనపోరాటం, ముగ్గురు మొనగాళ్ళు, బావమరదళ్ళు, స్వాతికిరణం వంటి చిత్రాల్లో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.
కేవలం తమిళ, తెలుగు మాత్రమే కాదు మళయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోయిన్ తాను పీక్ కెరియర్ను చూసింది. హీరోయిన్గా తనకు అవకాశాలు తగ్గుముఖం పట్టడం గమనించి నిర్మాణం రంగంలోకి అడుగు పెట్టారు. తమిళ హీరో శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకొని ఆయనతో కలిసి ప్రొడ్యూస్ చేశారు. ఆ తరువాత బుల్లితెరపై మెరిశారు. అక్కడ కూడా తనదైన మార్కు చూపించారు. ఆ తరువాత యంగ్ హీరోలకు తల్లి క్యారెక్టర్లు చేస్తూ తనను తాను ఎప్పుడూ బిజీగా మలుచుకుంటున్నారు. ఒక వైపు రాజకీయాలు, మరో వైపు సేవా క్యార్యక్రమాలు, సినిమాలు, టీవీ సీరియల్లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ తిరిక లేకుండా గడిపేస్తున్నారు. తన జీవితంలో అనుకున్న శిఖరాలన్ని అధిరోహించాలని కోరుతూ వర్సటైల్ యాక్టర్ రాధికకు బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.