Reading Time: 2 mins

Geetha Madhuri Birthday Special

గీతా మాధురి బర్త్ డే స్పెషల్

అద్భుతమైన గాత్రంతో శ్రోతల హృదయాలను కొల్లగొట్టిన ప్లేబ్యాక్ సింగర్ గీతామాధురి. ఈ గాయని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె పేరు తెలియని తెలుగు పాటల ప్రియుడు లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పటివరకు 500కు పైగా పాటలను ఆలపించి గొప్ప పేరు ప్రతిష్టలు గడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లులో ఆగస్టు 24, 1989లో గీతా మాధురి జన్మించారు. తండ్రి ప్రభాకర్ శాస్త్రి వృత్తిరీత్యా హైదరాబాదుకు వచ్చారు. చిన్నతనం నుంచే శాస్త్రీయ సంగీతంపై మక్కువ పెంచుకొని శిక్షణ తీసుకున్నారు. కటోర సాధన చేస్తూ తన మధురమైన గాత్రంతో సినిమాల వైపు అడుగులు వేశారు.

మొదటి సారి కులశేఖర్ తిరకెక్కించిన ప్రేమలేఖ రాసా చిత్రంలో గీతామాధురి పాట ఆలపించి శ్రోతలకు వీనుల విందు చేశారు. ఆ తర్వాత ఈ టీవీ నిర్వహించే పాటల పోటీలలో పాల్గొని గొప్ప ప్రతిభను కనబరిచారు. అలా 2007లో రామ్ చరణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత చిత్రంలో మణిశర్మ సంగీత సారధ్యంలో చమ్కా, చమ్కా అనే అద్భుతమైన పాటతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి పాటే సినిమా అవార్డ్స్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత నచ్చావులే చిత్రంలో ‘నిన్నే నిన్నే” అనే పాటకు నంది అవార్డు రావడంతో గీతామాధురి ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ అయింది.

ఆ తర్వాత వరుసగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన గోలీమార్, ఏక్ నిరంజన్, కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలలో పాడారు. అలాగే గుండెల్లో గోదారి, ఇద్దరమ్మాయిలతో, మిర్చి, బాహుబలి ది బిగినింగ్, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన హై పిచ్ గొంతుతో స్పెషల్ సాంగ్స్ సైతం అలవోకగా పాడి ప్రేక్షకుల మదిని దోచారు. అలా సాగుతున్న ఆమె సినీ ప్రయాణంలో 2014లో నటుడు నందును వివాహం చేసుకున్నారు వారికి ప్రస్తుతం ఒక పాప.

గీతా మాధురి తన కెరియర్లో ఎంతోమంది గొప్ప సంగీత దర్శకులతో పనిచేశారు. అందులో ఎం ఎం కీరవాణి, ఇళయరాజా, కోటి, ఆర్పి పట్నాయక్, వందేమాతరం శ్రీనివాస్, కళ్యాణ్ మాలిక్, అనుపు రూబెన్స్, రమణ గోగుల, దేవి శ్రీ ప్రసాద్, తమన్ వంటి సంగీత దర్శకులతో పనిచేశారు. అలాగే మను, ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఎం ఎం కీరవాణి లాంటి లెజండరీ గాయకులతో కలిసి ఆలపించారు. ఇంత ప్రతిభను కనబరిచారు కాబట్టే గీతామాధురిని సౌత్ ఇండియన్ శ్రేయ ఘోషల్ అని గౌరవంగా పిలుస్తారు. గీతా మాధురి కేవలం సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పని చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిల్, మలయాళం, కన్నడ భాషాల్లో కూడా పాటలు పాడారు.

సినిమా పాటలు మాత్రమే కాకుండా భక్తి గీతాలు, శాస్త్రీయ గీతాలు సైతం ఆలపిస్తారు. అందులో గోవింద నామాలు, సర్వం భక్తిమయం వంటి భక్తి ఆల్బమ్స్ ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం ఇల్లాలుగా, తల్లిగా, సింగర్‌గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ.. ఇండియన్ ఐడిల్ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. సింగర్ గీతా మాధురి తన పాటల ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తూ.. ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున బెస్ట్ విషెస్ అందిస్తున్నాము.