Reading Time: 2 mins

5 Reasons For Making Chiranjeevi a Megastar

చిరంజీవి మెగాస్టార్ అవ్వడానికి 5 కారణాలు

సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తూ ఉంటారు. అందరూ స్టార్లు కాలేరు. ఎంతో కష్టపడితే తప్ప సూపర్ స్టార్లు కారు. అలా ప్రతీ క్షణం కష్టపడ్డాడు కాబట్టే కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ అయ్యారు. పరిశ్రమకు వచ్చే ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి.. పరిశ్రమకే ఒక బ్యాక్‌బోనులా నిలబడ్డాడు. ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ అయ్యారు. పరిశ్రమకు వచ్చే ఏ కొత్త హీరో అయినా సరే.. ఇండస్ట్రీకి రావడానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి చిరంజీవి అని చెప్పడం ఎన్నో సార్లు విన్నాము. చిరంజీవి హీరోగా చేస్తున్న సమయంలో కూడా ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ చిరంజీవి మాత్రమే ఎందుకు మెగాస్టార్ అయ్యారు అంటే ఆయనలో ఉన్న ప్రత్యేక లక్షణాలే ఆయన్ను మెగాస్టార్‌ను చేసి అభిమానుల గుండెల్లో ఆరాధ్యుడిని చేశాయి.

చిరంజీవి హీరో నుంచి డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకొని సుప్రీంస్టార్‌గా గుర్తింపుతెచ్చుకొని ఆ తరువాత మెగాస్టార్‌గా ఎదిగిన తీరు అమోఘం. ఆ రోజుల్లో హీరోల డ్యాన్సులు చాలా సులువుగా చేసేవారు. ఇక చిరంజీవి రంగంలోకి దిగాక డ్యాన్స్ డెఫినేషన్ మారిపోయింది. బ్రేక్ డ్యాన్స్‌లు, షేక్ డ్యాన్సులు అంటే తెరపై నటరాజు నర్తించినట్లు, విలయతాండవం చేసినట్లు విజృంభించి థియేటర్లు ఈలలు వేయించారు. తెలుగు సినిమాల్లో అన్ని రకాల డాన్స్ లు చేసిన ఒకే ఒక్క హీరో కేవలం చిరంజీవి ఏమో అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ ఆయనలోని గ్రేస్, డాన్స్ చేసే స్టైల్ ఏ మాత్రం తగ్గలేదు. డ్యాన్స్ ఆయన మొదటి క్వాలిటీ.

Chiranjeevi

Chiranjeevi

నటనలో ఈజ్ అనేది ఆయనకన్న రెండో క్వాలిటీ. మొదట్లో నెగిటివ్ పాత్రలో నటించారు. ఆ తర్వాత అలాంటి పాత్రలకు పూర్తిగా భిన్నమైన పాత్రలు పోషించారు. కామెడీ, సెంటిమెంట్, విలనిజం, రౌడీయిజం ఇలా ఎలాంటి పాత్ర అయినా సరే చిరంజీవి అవలీలగా చేసేస్తారు. ఎనబై, తొంబైలలో చిరంజీవికి కమర్షియల్ హీరో అనే ఒక ట్యాగ్ వచ్చింది. కేవలం ఈ ఇమేజ్‌కి మాత్రమే అంకితం కాలేదు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే చంటబ్బాయి, రుద్రవీణ, ఆపద్బాంధవుడు, స్వయంకృషి వంటి చిత్రాలు చేసి ఆయన ఒక సంపూర్ణ నటుడని నిరుపించుకున్నారు.

సమయస్పూర్తి అనేది ఏ నటుడికైనా ఉండాల్సిన క్వాలిటీ. అది చిరుగు మెండుగా ఉంది. పునాది రాళ్ళు సినిమా ఫస్ట్‌డే షూట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ ఒక విషయం చెప్పారట. నలుగురు యువకులు బావి దగ్గర పనిచేసి ఇంటికి వస్తారు అని చెప్పడంతో.. చిరంజీవి తన సమయస్పూర్తిని వాడి పక్కనే ఉన్న గడ్డిని తన భూజాలపై, నెత్తిపై వేసుకున్నారట. అదేంటి అంటే బావి దగ్గర పని చేసే వచ్చేవాళ్లు ఇలాగే ఉంటారు అని చెప్పడంతో డైరెక్టర్ మెచ్చుకున్నారట. దాని తరువాత చాలా సినిమాల్లో అతిని తెలివిని వాడారు.

ఒక స్టార్ అవ్వాలి అంటే తెర మీద మాత్రమే కాకుండా తెర వెనుక కూడా చాలా ముఖ్యం. ఆయన ప్రవర్తన కూడా మెగాస్టార్‌ను చేసింది. సమాజిక సేవాకార్యక్రమాలలో చిరంజీవి ముందే ఉంటారు. అందుకే బ్లడ్ బ్యాంక్ సైతం స్థాపించారు. ఇవి ఉంటే స్టార్లు అయిపోతారా అంటే.. వీటితో పాటు క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. గతంలో చిరంజీవి గురించి చాలా మంది నటీనటులు చెప్పారు. డైరెక్టర్ చెప్పిన సమయానికంటే ముందు ఉంటారు. షాట్ ఎప్పుడూ రెడీ అన్నా వచ్చేస్తారు. ఒపిగ్గా ఉంటారు, నేర్చకుంటారు, కుదిరితే తప్పులను సరి చేస్తారు కానీ ప్రొడ్యూసర్‌కు ఇబ్బంది కలుగకుండా నడుచుకుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యారు.

కేవలం అప్పటి తరం నటులకి మాత్రమే కాకుండా ఇప్పటి తరం నటులకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు చిరంజీవి. ఇప్పటికి కూడా తనకి ఉన్న ఇమేజ్ కి అతుక్కుపోకుండా, రీమేక్ సినిమాలు అయినా సరే మంచి కంటెంట్ చేస్తున్నారు. ఆ పాత్రకి తగ్గట్టు తనను తాను మలుచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన వశిష్ట దర్శకుడితో విశ్వంభర అనే చిత్రంలో నటిస్తున్నారు.