Reading Time: 4 mins

Power Star Pawan Kalyan Birthday Special

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్

పవన్ కల్యాణ్.. ఈ పేరు తెలుగు తెరపై విజృంభించే ఐరావతం. అభిమానుల గుండెల్లో దాగున్న మేరు పర్వతం. సినిమాల నుంచి మొదలైన ఆయన ప్రస్థానం నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం స్థాయికి చేరింది. సెప్టెంబర్ 2న జన్మించిన పవర్ స్టార్ ఓ కారణజన్ముడని అభిమానులు గుండెల నిండా కొలుస్తారు. 5 అడుగుల 10 అంగులాల ఎత్తు, 85 కేజీలు కూడా ఉండని రివాట్ లాంటి శరీరం, పలుచగా వుండే ఒళ్లు, తీక్షణంగా ఉండే కళ్లు.. ఇంతే.. చూడడానికి ఇంతే ఉన్నా అతడు తలెత్తి చూస్తే ఒక దేశపు జెండాకున్నంత పోగరు ఉంటుంది. అతడు తెరమీద కనబడితే ప్రభంజనం.. తెరవెనుక తాను చేసే సాయం అనన్యసామాన్యం. సినీ నటులంటే అభిమానులు ఉంటారు, వీరాభిమానులు ఉంటారు కానీ ఈయనకు మాత్రం భక్తులు ఉంటారు. కేవలం సినిమా కోసమే అనుకుంటే పోరపాటే.

ఆయన కళ్లు ప్రేమను పంచే లోగిల్లు.. ఆయన గొంతు నిజాన్ని గర్జింజే సైరన్ మోత.. నిస్పక్షపాతంగా నిజం వెంటే నడిచే నిఖార్సైన అరుడుగుల బుల్లెట్ ఆయన.. అనగారిన పేదల పక్షాణ కొట్లాడే టార్చ్ బేరర్, ఆయనే ది వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
సెప్టెంబర్ 2 1968లో జన్మించిన పవన్ కల్యాణ్ అన్న అడుగు జాడలోనే ఎదిగాడు. ఆయనకు సమాజంపై పూర్తి అవగాహన రాకముందే అన్నయ్య పెద్ద స్టార్. అలా అన్నయ్య చేసే సినిమాలను చూస్తూ.. సమాజం కోసం ఏదో చేయాలని తపిస్తూ.. ఎటూ తేల్చుకోలేని సందిగ్ద స్థితిలో సినిమారంగంలోకి అడుగు పెట్టాడు. అలా పవన్ కల్యాణ్ సినిమా ప్రస్థానం మొదలైంది.

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో 1996లో చిరంజీవి తమ్ముడిగా తెలుగు తెరపై కళ్యాణ్‌గా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే ఆయనకు ఉన్న మార్షల్ ఆర్ట్స్‌ కళను ప్రదర్శించి ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నారు. ఆ తరువాత 1997లో ‘గోకులంలో సీతా’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమాతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. మెగాస్టార్ అభిమానులకు మెల్లగా చేరువుతున్న సమయంలో యూత్‌కు కనెక్ట్ అయ్యేలా 1998లో ‘సుస్వాగతం’ సినిమా తీశారు. అమ్మాయి ప్రేమ కన్న భవిష్యత్తు చాలా గొప్పది అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం ఎంతో మందిని ఆలోచింప చేసింది. అదే సంవత్సరం తొలిప్రేమ చిత్రం తెరమీదకు వచ్చింది. తెరపై చూస్తున్న యంగ్‌స్టర్స్ అందరూ తమలో బాలును చూసుకున్నారు. పవన్ కల్యాణ్ పేరును గుండెల్లో అచ్చేసుకున్నారు.

తెలుగు తెరపై తీసిన సినిమాలు తక్కువే అయినా వంద సినిమాలు తీస్తే వచ్చే పేరు ప్రతిష్టలతో పాటు అమోఘమైన అభిమానులను సంపాదించుకున్న హీరో పవన్ కల్యాణ్. ఇక పవన్ కల్యాణ్ సినీ జీవితాన్ని ఓ మలుపు తిప్పిన చిత్రం ‘తమ్ముడు’. 1999లో వచ్చిన ఈ చిత్రం పవన్ కల్యాణ్‌కు ఎంతోమంది తమ్ములను దగ్గర చేసింది. అన్నయ్యకోసం, కుటుంబం కోసం సుభాష్ చేసే పోరాటం ప్రజలకు నచ్చింది. దాంతో పవర్ స్టార్ అనే ట్యాగ్‌ను ఇచ్చారు. ఆ తరువాత ‘బద్రి’ అంటూ వచ్చి ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఫుల్ ఫామ్‌లో ఉన్న పవన్ పట్టిందల్లా బంగారమే వెంటనే ‘ఖుషీ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు కలగనని కలెక్షన్ల వర్షం కురిపించాడు.

ఖుషితో శిఖరాన్ని చేరిన పవన్ కల్యాన్ ఆ తరువాత కాలం కలిసి రాలేదు. చేసిన సినిమాలన్నీ విఫలం అవుతున్నాయి. శిఖరం అంచునుంచి, శిఖరం అడుగుకు చేరుకున్నారు. అయినా ఎక్కడ సడల లేదు. అదే ధైర్యంతో ముందుకు వెళ్లారు. వరుసగా ‘జానీ’, ‘గుడుంబా శంకర్’, ‘బాలు’, ‘బంగారం’, ‘అన్నవరం’ ఇలా వరుస ఫ్లాప్‌లు. ఆ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘జల్సా‌’తో కాస్త పుంజుకున్నారు. మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు అనుకున్న సమయంలో ‘పులి’, ‘తీన్మార్’, ‘పంజా’ చిత్రాలతో ప్రేక్షకులను నిరాశ పరిచారు. ఒక్క సినిమా కోసం ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు కోసం ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో తన తిక్క చూపించి బాక్స్ ఆఫీస్ లెక్కలు తేల్చాడు. అభిమానులు ఆకలిని తీర్చాడు. కానీ పవన్ ఆకలి అప్పుడే మొదలైంది.

సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని తన సినిమాలో చూపించినప్పటికి అది తృప్తిని ఇవ్వలేదు. అందుకోసమే ప్రజా సమస్యలకై పోరాడాలన్న ఆయన ఆలోచనలకు బీజం పడుతున్న క్షణాలు. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంతో ప్రజలను, పాలకులను ప్రశ్నించారు. 2013లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. మొదటి సారిగా బాహటంగానే తన సినిమా లీక్ చేసిన వారికి వార్నింగ్ ఇచ్చారు. కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టాలనే దృఢసంకల్పంతో జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించి నేరుగా ప్రజల్లోకి వచ్చారు. ఒక పక్క రాజకీయ పార్టీని నడిపిస్తూనే సినిమాలు చేశారు. అలా మొదటి సారి దేవుడి గెటప్‌లో ‘గోపాలగోపాల’ సినిమాలో దర్శనం ఇచ్చారు. ఆ తరువాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అంటూ ప్రయత్నించారు. ‘కాటమరాయుడి’గా పలకరించారు. ‘అజ్ఞాతవాసి’గా వెండితెరపై వచ్చి.. సమాజంలోని అజ్ఞానాన్ని చేధించడానికి 2019 ఏపీ ఎన్నికల్లో పోటీలో నిల్చున్నారు. ఆశించన ఫలితం రాలేదు. ఎదురుదెబ్బలు తగలడం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కొత్తకాదు. కొంత గ్యాప్ తీసుకున్నారు.

2021లో ‘వకీల్ సాబ్’ అంటూ కోర్టు రూమ్ డ్రామాలో అలరించారు. ఆ తరువాత ‘భీమ్లానాయక్‌’గా తన పవర్ ఏంటో చూపించారు. ‘బ్రో’ అంటూ వెండితెరను పలకరించారు. ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలను ప్రకటించి.. ప్రజాక్షేత్రంలో యుద్దం చేయడానికి సిద్దం అయ్యారు. పడినచోటే ప్రభంజనమై నిలచున్నాడు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం సేవలందిస్తున్నారు. త్వరలోనే మళ్లీ సినిమాలు పూర్తి చేస్తానని మాటిచ్చారు. కూడి చేయి చేసే సాయం ఎడమ చేతికి తెలియదు అన్నట్లు ఆయన్నుంచి సాయం పొందినొళ్లు చెబితే తప్ప బయట ప్రపంచానికి తెలియదు అది ఆయన వ్యక్తిత్వం. నిజాయితిగా మాట్లాడటం, ముక్కుసూటితనం ఆయన అస్త్రాలు. ఎవడి ముందు తలవొచ్చని తత్వం ఆయనది. పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యసనం ఒక్కసారీ ఇష్టపడితే ఇక చచ్చేదాక వదిలలేము అని ఊరికే అనలేదు. అనుకున్న లక్ష్యాయాలను సాధిస్తూ.. మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ.. కుదిరితే సినిమాల రూపంలో ప్రేక్షకులను అలరించాలని కోరుతూ ఆంధ్రప్రదేవ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున బెస్ట్ విషేస్ అందిస్తున్నాము.