Reading Time: 2 mins

Rising Popularity of Actor Vijay in Telugu States
రెండు తెలుగు రాష్ట్రాల్లో దళపతి విజయ్ ప్రభంజనం

తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఏ హీరో అయినా వారిని గుండెలపై పెట్టుకోవడం పరిపాటి. అందుకే భారతదేశపులోనే తెలుగు ఆడియోస్ ది బెస్ట్ అని అందరూ అంటుంటారు, కోలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్ సినిమాలు సైతం రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయాలని తహతహలాడుతుంటారు. ఒక్కసారి తెలుగు ప్రేక్షకుల కు దగ్గర అయితే ఇక వారి మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్న విషయం వారికి తెలుసు. ఈ మేరకు సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇలానే దగ్గరయ్యారు. వీరు నటించిన చిత్రాలు తెలుగు టాప్ హీరోలతో సమానంగా పోటీపడేవి అంటే అతిశయోక్తి కాదు. ఇక కలెక్షన్ల విషయంలో కూడా అదే పరిస్థితి ఉండేది. వీరి తర్వాత హీరో సూర్య, అజిత్ చిత్రాలను కూడా తెలుగు కళాభిమానులు ఆదరించారు. ఇక్కడ వారిని స్టార్లను చేశారు. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మరో స్టార్ హీరో దళపతి విజయ్.

దళపతి విజయ్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేశారు. అలాగే తెలుగు చిత్రాలను ఆయన తమిళ్లో రీమేక్ చేశారు. వాటిలో తమ్ముడు, ఒక్కడు, పోకిరి లాంటి చిత్రాలు ఉన్నాయి. అంతే కాదు ఆయన నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో మన స్టార్ హీరోలు రీమేక్ చేశారు. తమిళంలో ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖుషీ‘ చిత్రంలో విజయ్, జ్యోతిక హీరోహీరోయిన్లుగా నటించారు. దాన్ని తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, భూమికతో ఖుషీ పేరుతో అదే డైరెక్టర్ తెరకెక్కించారు. ఇక్కడ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తరువాత పవన్ కల్యాన్ రోండో సారి రీమేక్ చేసిన చిత్రం అన్నవరం. తమిళంలో తిరుప్పాచి పేరుతో విజయ్, త్రిష జంటగా నటించారు.

తుళ్లుత మనముమ్ తుళ్లుమ్ ని తెలుగులో నువ్వు వస్తావని, తిరుమలై చిత్రాన్నిగౌరి మూవీగా, పూవే ఉనక్కాగ (శుభాకాంక్షలు),
ప్రియముదన్ (ప్రేమించే మనసు), వన్స్ మోర్ (డాడీ డాడీ), పవన్ నటించిన సుస్వాగతం సైతం విజయ్ నటించిన లవ్ టుడే చిత్రాన్నే రీమేక్ చేశారు. ఆ తరువాత చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ 150 చిత్రం సైతం విజయ్ నటించిన కత్తి చిత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఆయన నటించిన సినిమాలు నేరుగా తెలుగులో విడుదల చేస్తూ వస్తున్నారు.

విజయ్ నేరుగా తెలుగులో విడుదల చేయడానికి చాలా సమయమే పట్టింది. కమలహాసన్, రజనీకాంత్ ఇద్దరు తెలుగులో మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు విజయ్ కి ఎలాంటి మార్కెట్ లేదు. ఆ సమయంలో విజయ్ నటించిన సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. అవి కాస్త టెలివిజన్‌లో రావడంతో ప్రేక్షకులకు కాస్త చేరువైయ్యారు. అదే సమయంలో 2012లో మురగదాస్ డైరెక్షన్‌లో వచ్చిన తుపాకీ చిత్రం నేరుగా థియేటర్లో విడుదలైంది. తెలుగులో సైతం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తేరీ, మెరిసిల్ సర్కార్, బిగిల్, మాస్టర్ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు విజయ్ ను మరింత దగ్గర చేశాయి. ఇక మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు కాంబినేషన్‌లో వచ్చిన మాస్టర్ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకొంది. దాంతో రెండవ సారి వీరి కాంబినేషన్ సెట్ అయింది. దాంతో లియో చిత్రం విడుదలైంది.

విజయ్ కి తెలుగులో ఉన్న క్రేజ్ ను పసిగట్టిన మాస్టర్ మైండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్, వంశీ పైడిపల్లి రచనా దర్శకత్వంలో డైరెక్టర్ తెలుగులో వారసుడు అనే చిత్రాన్ని నిర్మించారు. 2024 సంక్రాంతికి విడుదల చేసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత ఫలితాన్ని రాబట్టకపోయినా.. తెలుగులో మంచి ఓపెనింగ్స్ సాధించింది. అప్పటికే మంచి మార్కెట్ సమకూర్చుకున్న విజయ్.. లియో సినిమా ఎక్కువ థియేటర్లను దక్కించుకుంది. విజయ్ నటించిన అన్ని సినిమాలలో తెలుగులో ఎక్కువ వసూలు సాధించడమే కాకుండా, ఎక్కువ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా లియో రికార్డు సృష్టించింది. ఇప్పుడు డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ది గోట్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. సెప్టెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఏ మేరకు ఆశిస్తుందో చూడాలి మరి.

తెలుగులో విజయ్ మొత్తం జర్నీ చూసుకుంటే.. ఒక దశాబ్ద కాలంగా అంటే 2012లో విడుదలైన తుపాకీ చిత్రం నుంచి ఆయన పేరు గట్టిగా వినిపించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల సినిమా ప్రేమికులకు విజయ్ దగ్గర అయ్యారు. అదే తరుణంలో ఆయన నటించిన బిగిల్, బీస్ట్ చిత్రాలు ఫస్ట్ డే తెలుగులో టాప్ హీరోలతో సమానమైన కలెక్షన్లు సాధించాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయనకు తెలుగులో ఎంత ఫేమ్ ఉందో. ఈ ససెప్టెంబర్ 5న వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ది గోట్ చిత్రం రిలీజ్‌కు సిద్దంగా ఉంది. చూడాలి మరి ఈ చిత్రం చేసే మ్యాజిక్.