Will NTR Devara Break Rajamouli Sentiment
జూనియర్ ఎన్టీఆర్ దేవర రాజమౌళి సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా
తెలుగు ఇండస్ట్రీలో సినిమా విజయం అనేది కేవలం ఎంచుకున్న కథ మీద మాత్రమే కాకుండా హీరో ఇమేజ్, దర్శకుడి ప్రతిభతో పాటు విడుదల చేసే సమయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ఒక సెంటిమెంట్ తెలుగు ఇండస్ట్రీలో 2001 నుంచి ఉంది. అదేంటంటే దర్శక దిగ్గజ రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకైనా తన తదుపరి చిత్రం కచ్చితంగా ఫ్లాఫ్ అనే సెంటిమెంట్ బలంగా వినిపిస్తుంది. ఇదే విషయాన్ని ఒకసారి విశ్లేసిస్తే.. ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన చిత్రాల తరువాత విడుదలైన చిత్రాలు పెద్దగా ఆడిన దాఖలాలు లేవు.
ఈ తరుణంలో ఆర్ఆర్ఆర్ చిత్రం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ సాలిడ్ హిట్టు పడింది. ఆ తర్వాత రామ్ చరణ్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ ఫలితం తెలిసిందే. ఇప్పుడు అదే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవరా చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నారు. మరి రాజమౌళి దర్శకత్వం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం ఫలితం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి ఆ సెంటిమెంటును దేవర చిత్రం బ్రేక్ చేస్తుందని ఎన్టీఆర్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
దీనిపై వారికున్న లెక్కలు చెప్పేముందు ఎన్టీఆర్ తో రాజమౌళి తీసిన సినిమాలు, ఆ తరువాత వచ్చిన ఎన్టీఆర్ సినిమాల పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం.
స్టూడెంట్ నెం.1: ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన మొదటి సినిమా స్టూడెంట్ నెం.1. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత సుబ్బు చిత్రం విడుదలైంది. రుద్రరాజు సురేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సుబ్బు, స్టూడెంట్ నెం 1 సక్సెస్ ముందు నిలబడలేక పోయింది. దాంతొ ఫ్లాప్‌గా నిలిచింది.
సింహాద్రి: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన రెండో చిత్రం సింహాద్రి. ఎన్టీఆర్లోని పూర్తి మాస్ కోణాన్ని అవిష్కిరించిన చిత్రం ఇది. ఇది పెద్ద కమర్ష హిట్ అయింది. ఈ చిత్రం తరువాత 2004లో ఆంధ్రవాలా వచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం చేసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
మళ్లీ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో 2007లో యమదొంగ చిత్రం విడుదలైంది. థియేటర్ వద్ద సాలిడ్ హిట్ కొట్టింది. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన కంత్రి సినిమా థియేటర్లో పెద్దగా ఆడలేదు.
మళ్లీ నాలుగువసారి ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ రెండవ సారి నటిస్తున్న చిత్రం దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌ను సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. దీని ఫలితంపై ఇండస్ట్రీలో రకరకాల అంచనాలు వేస్తున్నారు.
ఇవన్నీ చూసిన తర్వాత దేవర చిత్ర ఫలితంపై ఖచ్చితంగా మనకు కూడా అనుమానం వస్తుంది. అయితే దీనిపై ఎన్టీఆర్ అభిమానులు, మూవీ క్రిటిక్స్ ఏం చెబుతున్నారంటే.. రాజమౌళి తెరకెక్కించిన సినిమాలో దేనిలో కూడా ఇద్దరు హీరోలు లేరు. ఆర్ఆర్ చిత్రంలో మల్టీస్టార్లు ఉన్నారు. దానికి సంబంధించిన ఆ సెంటిమెంటును రామ్ చరణ్ కొనసాగించారని, అది ఎన్టీఆర్ దేవరకు చెల్లుబాటు కాదు అని అభిమానులు విశ్వసిస్తున్నారు. అలాగే రాజమౌళి తరువాత వచ్చే సినిమాలలో ఫ్లాప్ అవ్వడానికి కారణం బలమైన కథ లేకపోవడమే అని, అదే విషయం ఎన్టీఆర్ గత చిత్రాలలో కూడా తెలుస్తుందని విమర్శకులు భావిస్తున్నారు. దేవర చిత్రంలో కథ బాగుంటే, ఎలాంటి సెంటిమెంట్లకు తావు లేకుండా సినిమా విజయం సాధిస్తుందని అంటున్నారు.
హీరో కోణంలో కాకుండా డైరెక్టర్ కోణంలో ఆలోచిస్తే.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇప్పుడు దేవరాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. కాబట్టి రాజమౌళి చిత్రం తరువాత తెరకెక్కించే దర్శకుడు ఎవరు ఒకే సారి రెండు అపజయాలను పొందలేదని, ఇది కొరటాల రెండో సినిమా కాబట్టి ఆ సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ కాదు అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్ అవుతుంది.. ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకో మూడు వారాలు వేచి ఉండాలి.