Ramya Krishna Birthday Special
సూర్యకాంతం, భానుమతి ఓ రమ్యకృష్ణ
రమ్యకృష్ణ.. తమిళనాడులో పుట్టి పెరిగి, తెలుగు తెరపై విరబూసిన అందాల, సుగందాల పారిజాతం. తన అభినయ పరిమళాలను వెదజల్లుతూ నటనతో తెలుగు వారి గుండెల్లో నాటుకు పోయిన ఎర్రటి మందారం రమ్యకృష్ణ. బాణాల్లాంటి కళ్ళు, ముద్దులొలికే చెక్కిళ్ళు.. ఆమె తనువంతా కొలమానానికి అందని భువిపై విరిసిన హరివిల్లు. హాట్ పాత్రలైనా, స్వీట్ పాత్రలైనా పగబట్టిన నీలాంబరి నుంచి శాసనాలు చేసే శివగామి వరకు.. ఘాటైన హిట్ పాత్రలు చేసే దీటైన నటి రమ్యకృష్ణ.
మద్రాసులోని 1970 సెప్టెంబర్ 15న జన్మించిన రమ్యకృష్ణ తల్లి ప్రోత్సాహంతో భరతనాట్యంలో ప్రావీణ్యం పొంది.. సినిమా రంగంలో రాణించాలని ఇటువైపు అడుగులు వేసింది. గ్లామర్ ఫీల్డ్ లో తన గ్లామర్ చూపించడానికి ఏ మాత్రం తడబడని డేరింగ్ నటి రమ్యకృష్ణ. మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన ‘నేరం పులురంబోల్’ అనే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై తొలిసారిగా మెరిసారు. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా రూపొందిన ‘కంచుకాగడా’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఆ తరువాత తెలుగు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలను పోషిస్తూ తన వద్దకు వచ్చిన ఏ పాత్రను కాదనకుండా చేస్తూ.. తన ప్రతిభను వెండి తెరపై ఆవిష్కరించారు. ఈ సమయంలో మోహన్ బాబు హీరోగా, నిర్మాతగా, రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల్లుడుగారు’ చిత్రంలో రమ్యకృష్ణ పూర్తి స్థాయిలో కథానాయకగా నటించి మెప్పించారు. నిజానికి ఈ చిత్రమే రమ్యకృష్ణ కెరియర్ కు బ్రేక్ అని చెప్పొచ్చు.
ఈ చిత్రంలో రమ్యకృష్ణ అందాన్ని చూసిన దర్శక నిర్మాతలు తన కాల్ షీట్స్ కోసం క్యూ కట్టారు. ఆ తరువాత రాఘవేంద్రరావు తెరకెక్కించిన “అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, ఘరానా బుల్లోడు, ముగ్గురు మొనగాళ్లు, ముద్దుల ప్రియుడు, అన్నమయ్య” వంటి చిత్రాలలో రమ్యకృష్ణ అందం మరింత ఆకర్షించింది. వెండితెరపై మెరిసే ఆమె సోయగం కుర్రకారు కళ్ళల్లో జిగేళ్లు అనిపించి.. అభిమానులు గుండెల్లో వెలుగులు నింపింది. ఆ సమయంలో అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగార్జునతో జతకట్టి, నటనలో, డాన్స్ లలో పోటీపడి తోటి కథానాయకుల కన్న మేటి అనిపించుకుంది.
రమ్యకృష్ణ తన అభినయంతో పాటు.. సొగసైన అందాలను ఎక్కడా హద్దులు మీరకుండా సిల్వర్ స్క్రీన్ పై ప్రదర్శించి.. ఎందరో కలల రాకుమారిగా, కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుంది. అందమే ప్రధానాకర్షణగా చేస్తున్న రోజుల్లో దాసరి నారాయణరావు ‘కంటే కూతుర్నే కనాలి’ చిత్రంతో రమ్యకృష్ణను నటనలో మరో మెట్టు ఎక్కించారు. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘నరసింహ’ చిత్రంలో నీలాంబరి పాత్ర రమ్యకృష్ణకు మరో బ్రేక్ అని చెప్పవచ్చు. చక్రాల్లాంటి కళ్ళతో నటించే రమ్యకృష్ణ ‘అమ్మోరు’ చిత్రంలో అమ్మవారి గెటప్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి అందరి ప్రశంసలు పొందింది. ఆమె పేరులో సగభాగం అయిన అదే పేరుతో ఉన్న డైరెక్టర్ కృష్ణవంశిని తనలో సగభాగం చేసుకుంది. ప్రస్తుతం వీరికి ఒక బాబు ఉన్నారు. అయినా సినిమాలకు దూరం కాలేదు.
అలా వైవిధ్యమైన పాత్రలను చేస్తూనే కుర్ర హీరోలతో ప్రత్యేక గీతాలు స్టెప్పులు వేసింది. ‘సింహాద్రి’ సినిమాలో ఎన్టీఆర్ తో, ‘నానీ’ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోటీపడి డాన్స్ ఇరగదీసింది. హీరోయిన్ గా తన కెరియర్ ముగిసిందని చాలామందిలా వెండితెరపై కనుమరుగు కాలేదు. తనలోని కళకు జీవం పోస్తూ.. నటిగా రూపాంతరం చెందుతూ.. సిల్వర్ స్క్రీన్ పై అమ్మగా, అత్తగా, వదినగా ఇలా ఎన్నో పాత్రలను చేస్తూ ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. ఈ తరుణంలో ‘బాహుబలి’ చిత్రంలో శివగామిగా అందరినీ మెప్పించింది. తన మాటే శాసనమంటూ సిల్వర్ స్క్రీన్ పై గర్జించింది. ఇప్పటివరకు 200 కు పైగా చిత్రాలలో నటించి తరగని అందం, అభినయంతో కళాభిమానులను కట్టిపడేస్తుంది. సిల్వర్ స్క్రీన్ పై ఓ సూర్యకాంతం, భానుమతి, ఓ రమ్మకృష్ణ అంటే కాదనేవారు ఉండరు. ఇక సినిమాలు మాత్రమే కాదు ప్రస్తుతం టెలివిజన్ షోలు కూడా చేస్తూ అభిమానుల హృదయాలకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. రమ్యకృష్ణ తన కెరీర్ లో ఎన్నో పాత్రలు చేసినప్పటికీ.. మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేస్తూ.. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడూ మహారాణిలా విలాజిల్లాలని బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.