Reading Time: 2 mins

Utsavam Movie Review –

ఉత్సవం మూవీ రివ్యూ 

 

Emotional Engagement Emoji

 

ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ‘ఉత్సవం’ మీద ప్రేక్షకులు కొంచెం ఆసక్తి గానే వున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పటి నాటక రంగ వైభవం గురించి,అప్పటి రంగస్థల నటీనటుల సంబంధ బాంధవ్యాల గురించి నేటి యువతకి కూడా తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ వుంది. దాంతో పాటు సురభీ నాటక సమితికి వున్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపధ్యంలో  నూతన దర్శకుడు అర్జున్ సాయి దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ‘ఉత్సవం’. సురేష్ పాటిల్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

సురభి నాటక మండలిలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు అభిమన్యు నారాయణ (ప్రకాష్ రాజ్) ఎలాంటి జాబ్ చేయకుండా నాటకాలనే నమ్ముకుని బతుకుతూ ఉంటాడు. అతని కొడుకు కృష్ణ (దిలీప్ ప్రకాష్) అనుకోకుండా మరో నాటకాల ప్రముఖుడు సహదేవ్(నాజర్) కూతురు రమ(రెజీనా కసాండ్రా)తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రమ, కృష్ణ ఇద్దరూ ప్రేమలో పడతారు. మరోవైపు వీరిద్దరి పెళ్లి చేయడానికి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఐతే, ఆ విషయం వీరికి తెలియదు. ఆ తర్వాత వీరి ప్రేమ కథలో జరిగిన డ్రామా కారణంగా కృష్ణ – రమా జీవితాల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి ?, ఇంతకీ.. కృష్ణ, నాటకాలకు పూర్వ వైభవం తీసుకువచ్చాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

కన్నడ నటుడైన దిలీప్ ప్రకాష్ కి ఇది రెండో సినిమా. కెమెరా అంటే ఎక్కడా ఇబ్బందిపడలేదు, ఎమోషన్స్ ను కూడా చక్కగా పండించాడు. ముఖ్యంగా హావభావాల ప్రకటనలో చక్కని పరిణితి ప్రదర్శించాడు. హీరోయిన్ రెజీనా అందంగా కనిపించడమే కాక నటనతోనూ పర్వాలేదనిపించుకుంది.

సమీక్ష :

వీళ్లిద్దరి కంటే.. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, అలీ, ఎల్.బి.శ్రీరామ్, ప్రేమ వంటి కళాకారులు గుక్కతిప్పుకోకుండా స్వచ్ఛమైన గ్రాంధిక తెలుగు భాషలో స్పష్టంగా పద్యాలు చదువుతూ డైలాగులు చెబుతుంటే ఎంత శ్రవాణానందంగా ఉందో. వీళ్లందరిలో ఉన్న అత్యుద్భుతమైన నటులను మన ఇండస్ట్రీ “టైప్ క్యాస్టింగ్” (ఒకే రకమైన పాత్రలు చేయించడం) చేస్తూ వారి టాలెంట్ ను గుర్తించడం లేదు అనిపిస్తుంటుంది. కనీసం ఇప్పటికైనా గుర్తించి వాళ్లను సరైన పాత్రల్లో వినియోగించుకోగలిగితే మలయాళ, మరాఠీ, బెంగాలీ ఇండస్ట్రీల రేంజ్ లో మనం కూడా అమోఘమైన నట విశ్వరూపాలను సిసలైన తెలుగు భాషలో చూడగలుగుతాం.

సాంకేతికవర్గం పనితీరు:

దర్శకుడు అర్జున్ సాయి ఒక నావెల్ పాయింట్ ను కథాంశంగా ఎంచుకున్నందుకు మెచ్చుకోవాలి. అయితే.. ఆ పాయింట్ ను సరిగా తెరకెక్కించడంలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అతుకుల బొంతలా ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి సంబంధం లేకుండా సన్నివేశాలు వస్తుంటాయి. ఇక కొన్ని సన్నివేశాల్లో పట్టు ఉన్నప్పటికీ.. సదరు సన్నివేశాన్ని కంపోజ్ చేసిన విధానం బాగోక ఆకట్టుకోలేకపోయాయి. రచయితగా మంచి ఆలోచనలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. ఆ ఆలోచనలను చిత్రరూపంగా మలిచే దర్శకత్వ ప్రతిభలో మాత్రం అర్జున్ సాయి పరిపక్వత చెందాల్సిన అవసరం చాలా ఉంది. నిక్కచ్చిగా చెప్పాలంటే.. ఒక దర్శకుడిగా దారుణంగా విఫలమయ్యాడు.

రాసుల్ ఎల్లోర్ మార్క్ సినిమాటోగ్రఫీ వర్క్ ఒక్క “దక్ష యజ్ఞం” ఎపిసోడ్ లో తప్ప ఎక్కడా కనిపించలేదు. అనూప్ రూబెన్స్ పాటలు కూడా సోసోగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కూడా చాలా పేలవంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

అంతరించిపోతున్న నాటకాల గురించి, నాటకాలకు పూర్వ వైభవం తీసుకురావాలనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ‘ఉత్సవం’ సినిమాలో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ అండ్ గుడ్ మెసేజ్ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా, సురభి నాటకాల చుట్టూ దర్శకుడు మంచి ప్రేమ కథను డిజైన్ చేశారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా నాటకాలు వేసేవాళ్ళ జీవితాల గురించి, నాటకాలకు పూర్వ వైభవం వస్తే ఎలా ఉంటుంది ? అనే కోణంలో వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సన్నివేశాల ఎంపిక, వాటిని తెరకెక్కించడంలో కొంచెం అవుట్ డేటెడ్ మేకింగ్, దర్శకత్వ లోపం. స్క్రీన్ ప్లే స్లో గా సాగటం. ముఖ్యంగా ఎమోషన్స్ పండకపోవటం.

నటీనటులు: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, నాజర్ తదితరులు.

దర్శకుడు: అర్జున్ సాయి

నిర్మాత : సురేష్ పాటిల్

సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్

ఎడిట‌ర్ : కోటగిరి వెంకటేశ్వరరావు