Reading Time: 2 mins

Guinness World Record Chiranjeevi Historic Feat
గెన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన చిరంజీవి

చిరంజీవి.. ఈ పేరు తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరగని ఓ స్పూర్తి సంతకం. సామాన్యుడి నుంచి అసామాన్యంగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతోమందికి పాఠ్యపుస్తకం. 46 ఏళ్ల ఆయన సినిమా ప్రస్థానంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. తాజాగా ఆయన మరో అరుదౌన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. మోస్ట్ ప్రొఫిలిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్, డ్యాన్సర్ గా మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. మొత్తం 156 సినిమాలు చేసినప్పటికీ అందులో గిన్నీస్ రికార్డు వాళ్లు 145 చిత్రాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ సినిమాల్లో 537 పాటలకు గాను 24000 స్టెప్పులు వేసీ అలరించినందుకు గిన్నీసు రికార్డు సాధించారు.

నటనలోనే కాదు డ్యాన్సులోనూ తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఏర్పరుచుకున్న నటుడు చిరంజీవి. అప్పటి వరకు ఉన్న డ్యాన్స్ కాకుండా బ్రేక్ డ్యాన్స్ అనే కొత్త ఒరవడిని తెరకు పరిచయం చేశారు. పాప్ సింగర్ మైకల్ జాక్సన్ చేసే బ్రేక్ డ్యాన్స్ ను తెలుగు వారికి చూపించారు. ఆ తరువాత ఆయన బాటలోనే చాలా మంది హీరోలు ఫాలో అయ్యారు. 1987 లో కొదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన పసివాడి ప్రాణం చిత్రంలో చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ అనే పాటకు ఈ డ్యాన్స్ చేశారు. ఆ తరువాత చాలా చిత్రాల్లో ఈ రకమైన డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేయడంలో చిరంజీవి గ్రేస్ ను అప్పట్లో ఎవరు మ్యాచ్ చేయలేకపోయేవారు.

చిరంజీవి సినిమా వస్తుందంటే ఆయన పాటలకోసం, డ్యాన్స్ ల కోసం వచ్చే ప్రేక్షకులు కూడా ఉండేవారు. ఆయన నటన సైతం ఎంతోమందిని ఆయన అభిమానులను చేసింది. ముఖ్యంగా సిగ్నేచర్ స్టెప్స్ వేయడం కూడా మెగాస్టార్ ప్రత్యేకం. గ్యాంగ్ లీడర్, అత్తకు యముడు అమ్మమాయికి మొగుడు మొదలుకొని ఇంద్ర సినిమాలో దాయి దాయి దామ లాంటి ఎన్నో పాటలకు అద్భుతమైన సిగ్నేచర్ స్టెప్పులు వేశారు. యువహీరోలతో పోటీపడుతూ ఇప్పటికీ ఆయన అదే గ్రేస్ తో స్టెప్పులు వేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో ఎంతో కీర్తి గడించిన చిరంజీవి అవార్డుల వరుసలో మోస్ట్ ప్రొఫిలిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ రికార్డు చేరింది.