Reading Time: 3 mins

Telugu Political Movies
తెలుగు పొలిటికల్ చిత్రాలు

రాజకీయం లేని ఊరు, రాజకీయం తెలియని మనిషి ఉండడు అంటే అతిశయోక్తి కాదు. రాజకీయం అంటే ప్రజాప్రతినిథులు, పాలకులు మాత్రమే కాదు ప్రజలు, వారి హక్కులు అని ఎంతోమంది మహానుభావుల ప్రసంగాలు విన్నాము, కవిమహానీయులు పుస్తకాలు చదివాము. రాజకీయం అంటే ఏంటి, మన చుట్టు రాజకీయం ఎలా పనిచేస్తుంది అని సామాన్యులకు కూడా తెలియాలని దర్శక నిర్మాతలు సినిమాలు సైతం నిర్మించారు. ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ రోజుల్లో వచ్చిన పొలిటికల్ డ్రామా చిత్రాలలో దేవ కట్ట దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్, శ్రీకాంత్ నటించిన ఆపరేషన్ దుర్యోదన, రానా నటించిన లీడర్, తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి, మహేష్ బాబు భరత్ అనే నేను, చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ గురించి చెబుతాము. కొంచెం వెనక్కి వెళితే రాజకీయ కథాంశంతో వచ్చిన సినిమాలు ఏంటి, ఆ సినిమాల నేపథ్యం ఏంటి అనేది ఒకసారి చూద్దాం.

పెద్దమనుషులు
1954 లో కె. వి. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పెద్దమనుషులు. హెన్రిక్ ఇబ్సన్ రచించిన ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ అనే నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ విజయం సాధించిన పెద్దమనుషులు తర్వాత వచ్చిన చాలా పొలిటికల్ తెలుగు సినిమాలకు ఆధారమైంది. పల్లెటూరు, అక్కడి రాజకీయాలు, రాజకీయం మాటున పెద్దమనుషుల దోపిడీ, వాళ్లను ఎదిరించిన వారిని అడ్డుతొలగించుకునే స్క్రీన్ ప్లే తో ఈ కథను నిర్మించారు. జంధ్యాల గౌరీనాథశాస్త్రి, ఎ.వి.సుబ్బారావు, ఎమ్.లింగమూర్తి, వంగర, రేలంగి ఈ చిత్రంలో నటించారు. అదికేశపురం అనే గ్రామంలో పెద్దమనుషులుగా చలామని అవుతున్నవారు ఆ ఊరి ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు. వారిని ఎలా ఎదుర్కున్నారు అనేది సినిమా కథ.

రంగులరాట్నం
సినిమా అంటే వినోదంతో పాటు ఉత్తేజాన్ని కలిగించేది, ఆలోచను రగిలింపజేసేది అని నమ్మిన దర్శకుడు బీఎన్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో 1967 విడుదలైన చిత్రం రంగులరాట్నం. ఈ చిత్రం ద్వారా నటుడు చంద్రమోహన్ పరిచయం అయ్యాడు. రామ్మోహన్, వాణీశ్రీ, అంజలీ దేవి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమా ఆద్యాంతం కుటుంబనేపథ్యంలోనే సాగుతుంది. అలాగే ఎన్నికల ప్రస్థావన ఉంటుంది. ఓట్లకోసం రాజకీయనాయకులు ఎలాంటి పన్నగాలు పన్నుతారు అనేది పాటల రూపంలో అద్భుతంగా చూపించారు.

ఈనాడు
1982లో విడుదలైన తెలుగు సినీమా ఈనాడు. సూపర్ స్టార్ కృష్ణకు ఇది 200వ చిత్రం. మలయాళంలో విజయవంతమైన ఏకలవ్య చిత్రాన్ని స్పూర్తిగా తీసుకొని ఈనాడు చిత్రాన్ని నిర్మించారు. పరుచూరి సోదరులు కృష్ణకు తొలిసారిగా పనిచేసారు. పొలిటికల్ సెటైర్ గా తీసిన చిత్రం ఇది. రావు గోపాల్ రావు పోలిటిషన్, జగ్గయ్య బిజినెస్ మెన్, క్రిమినల్ అయిన కాంతరావు ఎన్నికల్లో పాల్గొని మినిస్టర్ అవుతాడు. కల్తీ మందు వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారు. ఈ క్రమంలో కృష్ణ వాళ్లను ఎలా అడ్డుకున్నాడు అనేది ఈనాడు సినిమా. అప్పట్లో పెద్ద విజయం సాధించింది.

మంత్రిగారి వియ్యంకుడు
బాపు దర్శకత్వంలో చిరంజీవి నటించిన రెండవ చిత్రం మంత్రిగారి వియ్యంకుడు. 1983లో విడుదలైన ఈ చిత్రం చిరంజీవికి 63వది.
ఈ సినిమాలో కూడా రాజకీయ కోణం ఉంటుంది. సుబ్బారాయుడు (అల్లు రామలింగయ్య), రామభద్రయ్య (రావి కొండలరావు) చిన్ననాటి స్నేహితులు. కలిసొచ్చి ధనికుడైన సుబ్బారాయుడు తన స్నేహితుడిని మరచిపోతాడు. సుబ్బారాయుడి కొడుకు శివరాం (శుభలేఖ సుధాకర్) రామభద్రయ్య కూతురు సుశీల (తులసి) తో ప్రేమలో పడతాడు. ఇది ఇష్టంలేని సుబ్బారాయుడు రామభద్రయ్యను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు. అవమానపడిన రామభద్రయ్య, తన భార్య అన్నపూర్ణమ్మ వెళ్లిపోతారు. విషయం తెలుసుకున్న రామభద్రయ్య కొడుకు బాబ్జీ (చిరంజీవి) పూనుకొని సుబ్బారాయుడికి గుణపాఠం నేర్పించాలి అనుకుంటాడు. ఇక అదే సమయంలో అన్నపూర్ణమ్మను ఎలక్షన్స్ లో పోటీ చేయమంటారు. సుబ్బారాయుడి కూతురు, బాబ్జీ ప్రేమించుకుంటారు. అన్నపూర్ణమ్మ మంత్రి అవుతుంది. చివరికి సుబ్బారాయుడు మారిపోతాడు. ఇది ఓ మలయాళ చిత్రం రీమేక్.

కథానాయకుడు
నందమూరి బాలకృష్ణ, విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించిన కథనాయుడు చిత్రం 1984లో విడుదలైంది. ఇదే సినిమాను 1986లో హిందీలో దిల్ వాలాగా రీమేక్ చేశారు. జస్టిస్ రాజేశ్వరి దేవి (శారద) తన ఇద్దరు తమ్ముళ్ళు మోహన్ (చంద్ర మోహన్) , రవి (నందమూరి బాలకృష్ణ) తో కలిసి నివసిస్తుంది. రవి అన్యాయాన్ని సహించడు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని పేదవాళ్లకు అండగా ఉంటాడు. ఈ క్రమంలో ఎంపి చంద్ర శేఖర రావు (గొల్లపూడి మారుతీరావు), ఎమ్మెల్యే కుంతి కనకయ్య (అల్లు రామలింగయ్య)లకు ఎదురెళ్లుతుంటాడు. ఈ క్రమంలో ఎంపీ చంద్రశేఖ్ ఎన్నికల్లో గెలవడం కోసం ఒక హత్యను మోహాన్ మీద వేస్తాడు. దాని నుంచి మోహాన్ ను రవి ఎలా కాపాడాడో అనేది కథ.

భారత్ బంద్
భారత్ బంద్ 1991 లో వచ్చిన రాజకీయ నేపథ్యంతో వచ్చిన చిత్రం ఇది. కొడి రామకృష్ణ దర్శకత్వంలో విజేత ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, అర్చన, రహమాన్, కాస్ట్యూంస్ కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. కాలేజీ కుర్రాళ్ల జీవితాలు, రాజకీయ పార్టీ నాయకుల కుట్రలు, వాటివల్ల ప్రజలకు ఏర్పడే నష్టాన్ని ఈ సిినిమాలో చూపిస్తారు. కొడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంకుశం, పోలీస్ లాకప్, రాజధాని వంటి పొలిటికల్ నేపథ్య చిత్రాలను తెరకెక్కించారు.