Reading Time: 3 mins

Lucky Bhasker Movie Review
లక్కీ భాస్కర్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

దీపావళి పండుగను పురస్కరించుకొని థియేటర్లలో భారీ సందడి నెలకొంది. దీనిలో భాగంగా దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన లక్కీ భాస్కర్ చిత్రం విడుదలైంది. ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు వేసి ప్రేక్షకులను థియేటర్ల రప్పించే ప్రయత్నం చేశారు మేకర్స్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. బ్యాంకింగ్ బ్యాగ్ డ్రాఫ్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ:
కథంతా ముంబైలోనే సాగుతుంది. భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన బ్యాంకు ఉద్యోగి. సరిపోని జీతం, దానికి తోడు కుటుంబ భారం అంతా తనపై పడుతుంది. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడు ఇలా కుటుంబ భారం అంతా తాను చేసే బ్యాంక్ ఉద్యోగంతో నెట్టుకొస్తాడు. అది సరిపోకపోవడంతో చాలామంది దగ్గర అప్పులు చేస్తాడు. ప్రమోషన్ వస్తే అంతా సెట్ అవుతుందని ఆశతో జీవనాన్ని సాగిస్తుంటాడు. ఇలాంటి సమయంలో తన కుటుంబం కోసం ఓ రిస్క్ చేద్దామని ఫిక్స్ అయితాడు. అలా బ్యాంకింగ్ వ్యవస్థలోని లూప్ హోల్ ను ఆసరా చేసుకుని డబ్బులను తీసుకొని బిజినెస్ లో మొదలుపెడతాడు. అలా సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్ అయిన భాస్కర్ కోటీశ్వరుడు అవుతాడు. అయితే బ్యాంకులో ఉన్న లూప్ హోల్ ఏంటి? తాను చేసిన రిస్క్ ఏంటి? ఎలా కోటేశ్వరుడయ్యాడు? ఆ తర్వాత కుటుంబంలో వచ్చే సమస్యలు, వాటిని ఎలా అధిగమించాడు? చివరికి ఏమైంది అనేది తెలియాలంటే లక్కీ భాస్కర్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఇప్పుడు వస్తున్న కమర్షియల్ సినిమాల్ల కాకుండా ఒక కొత్త నేపథ్యం అదే బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్ నేపథ్యంలో వచ్చిన చిత్రం లక్కీ భాస్కర్. మధ్యతరగతి వ్యక్తి అయినా భాస్కర్ కు ఉన్న కష్టాలను మొదట 20 నిమిషాల్లోనే చూపించి.. ఎలాగైనా ఈ కష్టాల నుండి భాస్కర్ బయటపడాలి అని ప్రేక్షకుడు అనుకునేలా చేయడంలో డైరెక్టర్ విజయం సాధించాడు. 90లలో బ్యాంకింగ్ వ్యవస్థని ఓ కుదుపు కుదిపేసిన హర్షద్ మెహతా కుంభకోణం ఈ స్టోరీలో కీలకం. కష్టాల నుండి బయట పడాలనే ఆలోచనతో భాస్కర్ చేసిన రిస్క్ తనకు లాభాలను తెచ్చిపెట్టడంతో అదే రిస్క్ ను కంటిన్యూ చేస్తూ డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకుంటాడు. బ్యాంకు రిజిస్టర్ లోని నెంబర్లను మారుస్తూ డబ్బులు బయటకు తీసుకెళ్లి మళ్ళీ బ్యాంకులో పెట్టే సన్నివేశాలను చాలా ఉత్కంఠంగా తెరకెక్కించారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకుడిని కచ్చితంగా థ్రిల్ కి గురిచేస్తాయి.

ఫస్ట్ ఆఫ్ మొత్తం భాస్కర్ ధనవంతుడిగా అవడానికి వేసిన ఎత్తులు, చేసిన రిస్క్ లు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. అలా ప్రథమార్థం ముగిసిన తర్వాత సెకండ్ ఆఫ్ లో తాను చేస్తున్న పని ఆపేయాలని నిర్ణయించుకోవడం, ఆ తర్వాత కథ అక్కడే తిరగడం కాస్త ప్రేక్షకుడికి బోర్ కొట్టినా భాస్కర్ ఇంకేదో చేయబోతున్నాడు అని ఆలోచన మాత్రం ఉంటుంది. జూదం ఆడడం మాత్రమే తెలిస్తే కాదు ఎప్పుడు ఆపాలో కూడా తెలియాలి అని భాస్కర్ వాళ్ళ నాన్న చెప్పే డైలాగ్, తన వైఫ్ సుమతితో గొడవ ఇవన్నీ భాస్కర్ ని గేమ్ నుండి తప్పుకునేలా చేస్తాయి. ఇక సినిమా అయిపోయింది అనుకున్న సమయంలో మరో ట్విస్ట్ వస్తుంది. ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఆడియన్స్ కి హైప్ ఇస్తుంది. కానీ ముగింపు అంత సంతృప్తిగా అనిపించదు.

నటీనటులు:
దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సినిమాతో భాస్కర్ గా, ఒక మధ్యతరగతి ఫ్యామిలీ మెన్ గా ఒదిగిపోయారు. డబ్బులు వచ్చాక తనలో వచ్చిన మార్పును తెరపై ఆవిష్కరించారు. చాలా సీన్లలో చాలా ఇంటెన్సీగా నటించి ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేశారు. మీనాక్షి చౌదరి మధ్యతరగతి విమెన్ గా చక్కగా నటించింది. భావోద్వేగాలను అద్భుతంగా పండించింది. వీరితో పాటు రామ్కీ, సచిన్ ఖేడ్కర్, సాయికుమార్ తదితరులు మెప్పించారు.

సాంకేతిక అంశాలు:
సినిమాకు రైటింగ్ చాలా ప్లస్. ఈ విభాగంలో డైరెక్టర్ వెంకీ అట్లూరి విజయాన్ని సాధించారని చెప్పవచ్చు. ఇక దర్శకత్వం పరంగా కూడా ఆయన అద్భుతమైన వర్క్ ను అందించారు. జీవీ ప్రకాష్ కుమార్ బిజిఎం సినిమాకి వెన్నుముక. బిజిఎంతో హైప్ తీసుకొచ్చిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అలాగే కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ వర్క్ కూడా మెప్పిస్తుంది. ముఖ్యంగా 90ల నేపథ్యంలో సృష్టించిన సెట్ డిజైన్ చాలా సహజంగా ఉంటుంది. ఆర్ డిపార్ట్మెంట్ కష్టం ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ రాజీ పడకుండా, ఎంత కావాలో అంత స్క్రీన్ పై కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్
కథ
నేపథ్యం
దుల్కర్ సల్మాన్ యాక్టింగ్
ట్విస్టులు
బిజిఎం

మైనస్ పాయింట్స్
సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు
క్లైమాక్స్ లో ఏదో మిస్ అయిన ఫీలింగ్

అంతిమ తీర్పు
కాస్త ఓపిగ్గా కూర్చుంటే మంచి థ్రిల్ ఫీల్ అవ్వచ్చు

Movie Title : Lucky Baskhar(dubbed from Malayalam)
Banners : Sithara Entertainments, Fortune Four Cinemas
Release date:-31.10.2024
Cast : Dulquer Salmaan, Meenakshi Chaudhary
Writer & Director: Venky Atluri
Music: GV Prakash Kumar
Cinematography: Nimish Ravi
Editor: Navin Nooli
Producer: Naga Vamsi S, Sai Soujanya
Nizam Distributors:-Sithara Entertainments
Runtime : 150 minutes