Trivikram Birthday Special
త్రివిక్రమ్ బర్త్ డే స్పెషల్
“పుట్టిన రోజు అంటే క్యాండిల్స్ ఆర్పీ, కేకులు కట్ చేసుకొని పార్టీలు చేసుకోవడం కాదు, గతాన్ని వర్తమానాన్ని పోల్చుకొని మన వృద్ధిని లెక్కకట్టడం.” “మనిషి ఈ భూమిదకు వచ్చింది విజ్ఞానాన్ని నేర్చుకొని, ప్రకృతిని ఆస్వాధిస్తూ, నలుగురితో నవ్వుతూ బతకడానికి అంతేకాని అడంబారాలకు పోయి అజ్ఞాతవాసిలా మిగిలిపోవడానికి కాదు”. “ఉన్నతంగా బతకడం అంటే నాలుగు కాసులు సంపాదించి ఎవరికి అందకుండా బతకడం కాదు.. నలుగురితో నవ్వుతూ జీవించడం”. ఈ డైలాగ్స్ ఇప్పుడే చదువుతున్నా.. ఎక్కడో విన్నట్లుంది కదా.. త్రివిక్రమ్ కలం నుంచి జాలువారకపోయినా.. ఓ సందర్భాన్ని ఆయన స్థానంలో నిలబడి ఊహించుకుంటే ఈ వాఖ్యలు తారసపడ్డాయి. ఆయన పేరును తలుచుకుంటేనే ఆయన తాలుకు రైమింగ్, టైమింగ్ వచ్చేస్తుంది. అంతలా తెలుగు ప్రేక్షకుడిని ప్రభావం చేశారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణానాన్ని చూద్దాం.
త్రివిక్రమ్ శ్రీనివాస్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 1971 నవంబర్ 7 తేదీన జన్మించారు. ఎమ్మెస్సీ (న్యూక్లియర్ ఫిజిక్స్)లో గోల్డ్ మెడల్ సాధించారు. లెక్చరర్ గా కొంతకాలం పనిచేశారు. ఆయనలో ఉన్న సాహిత్యం తనను సినిమా రంగంవైపు ప్రయాణించేలా చేసింది. అలా హైదరాబాద్ వచ్చిన ఆయనకు అవకాశాలు వెల్లువెత్తలేదు. త్రివిక్రమ్ ఓపిక, సహనాన్ని కాలం పరీక్షించింది. ఆకలి కష్టాలను రుచిచూపింది. గెలవగలమా అన్న అనుమానం నుంచి గెలుపువైపు ఆశచూపింది. తన కలానికి పని చెప్పే ప్రతీ సందర్భాన్ని బలంగా, అప్పుడే సాన పెట్టిన కత్తిలా తెల్లటి పేపర్ పై విరుచుకుపడ్డారు. మాటల ప్రవహాన్ని పుట్టించారు. అలా 1999 లో “స్వయంవరం” చిత్రానికి మాటల రచయితగా వెండితెరపై ఆగమనం చేశారు త్రివిక్రమ్.
ఇక ఆయన కలం ఆగలేదు వరుసగా సముద్రం, నువ్వే కావాలి, చిరునవ్వుతో, నిన్నే ప్రేమిస్తా, నువ్వు నాకు నచ్చావ్, వాసు, మల్లీశ్వరీ, జై చిరంజీవ, తీన్మార్, మన్మథుడు, ఛల్ మోహనరంగ మొదలైన సినిమాలకు కథ, స్క్రీన్ప్లే రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. రచయితగానే కాకుండా దర్శకుడిగా ఆయన విజయపతాకాన్ని ఎగరవేశారు. నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసీ అతడు చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అవకాశాలు ఆయన దగ్గరకు రావడం మొదలయ్యాయి. అలా జల్సా, ఖలేజా, జులాయి వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. అత్తారింటికి దారేది చిత్రంతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు.
అరవింద సమేతా, అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే త్రివిక్రమ్ ఆవేశం ఆయన కలంలో ఉంటుంది. ఆలోచన ఉంటుంది. అందుకే ఎక్కువగా మౌనంగా ఉండే ఆయన మాటలను ఇష్టపడుతారు జనాలు. ఆయన భావాల్ని ప్రేమిస్తారు. గురుజీ అని ప్రేమగా పిలుస్తారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాలని బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున శుభాకాంక్షలు.