Kamal Haasan Birthday Special
కమల్ హాసన్ బర్త్ డే స్పెషల్
ఉలగనాయగన్ కమల్ హాసన్ సినిమా పరిశ్రమలో ఓ అద్భుతమైన వ్యక్తి. కేవలం నటుడిగానే కాకుండా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా ఇలా సకలకలవల్లభుడు. వెండితెరపై నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులని చేయడమే కాదు నిజజీవితంలో కూడా ఎంతో మందిని ప్రభావం చేసే వ్యక్తిత్వం ఆయనది. చైల్డ్ ఆర్టిస్టుగా మొదలైన ఆయన సినీ ప్రయాణం నేటికి నిర్విరామంగా సాగుతూనే ఉంది. విజయాలు, అపజయాలు, గెలుపు ఓటములకు అతీతం ఆయన జర్నీ. పడినా లేచినా ఆయన జర్నీ ఎందరికో స్పూర్తిదాయకం. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కమల్ హాసన్ సినీ ప్రయాణంపై ఓ లుక్కెద్దాం.
ప్రపంచంలో ఉన్న ప్రతీ భారతీయుడు గుర్తించే ఈ నటుడు నవంబర్ 7, 1954లో తమిళనాడు రాష్ట్రం రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడిలో జన్మించారు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకోవడం బహుషా ఈయనకే చెల్లింది. ఆ తరువాత జాతీయ ఉత్తమ నటుడిగా మూడు సార్లు ఈ అవార్డును గెలుచుకున్నారు. మొదటి చిత్రం “కలత్తూర్ కన్నమ్మ”. చిన్నతనం నుంచే శాస్త్రీయ సంగీతం, నృత్యం నేర్చుకున్నారు. దర్శకుడు కే. బాలచందర్ తో పరిచయం కమల్ హాసన్ జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. ఆయన ప్రియమైన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు కమల్ హాసన్. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలు చేసినప్పటికీ.. 1970 కాలంలో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
ఇక పూర్తి స్థాయి కథా నాయకుడిగా “అవర్గళ్”, “అవళ్ ఓరు తొడరర్కదై”, “సొల్ల తాన్ నినైక్కిరేన్”, “మాణవన్”, “కుమార విజయం” లాంటి చిత్రాలలో నటించారు. అయితే శ్రీదేవి తో ఆయన నటించిన 16 వయదినిలె (తెలుగులో పదహారేళ్ళ వయసు) చిత్రంతో హీరోగా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా విడుదల అయినప్పుడు ఆయన వయస్సు 23 ఏళ్ళు. వెండితెరపై వీరి జంట బాగుండడంతో మొత్తం 16 సినిమాలలో కలిసి నటించారు. ఇక కమర్షియల్ హీరోగా రాణిస్తూనే ప్రయోగాలు చేయడం కమల్ కు పరిపాటి. విచిత్ర సోదరులు, స్వాతి ముత్యం, సాగర సంగమం, ఇంద్రుడు చంద్రుడు, భామనే సత్యభామనే, సతీలీలవతి, గుణ, భారతీయుడు వంటి విభిన్నమైన చిత్రాలలో నటించారు.
కమల్ హాసన్ కేవలం తమిళ్ చిత్రాలలోనే కాకుండా మలయాళం, తెలుగు పరిశ్రమలో కూడా నేరుగా సినిమాలు చేశారు. ఇక కమల్ హాసన్ ఏది చేసినా సంచలనాత్మకంగా చేయడం అలవాటు అందుకే ఆయన నటించిన చాలా సినిమాలు అనేక వివాధాలను ఎదుర్కొన్నాయి. ఇక అవార్డులు, పురస్కరాలకు కొదువ లేదు కానీ కమల్ హాసన్ ఎలాంటి ఆడంబరాలకు వెళ్లకుండా ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ ఉంటారు. ఇటీవల రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఆయన కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ లు కూడ పరిశ్రమలో రాణిస్తున్నారు. శృతి హాసన్ మన తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న హీరోయిన్. కమల్ హాసన్ వంటి నటుడు, ఆయన లాంటి వ్యక్తి మరోకరు లేరంటే అతిశయోక్తి కాదు. మరిన్ని అద్భుతమైన చిత్రాలను తీసి ప్రేక్షకుల అభిమానులకు పొందాలని ఉలగనాయగన్ కమల్ హాసన్ కు బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు .