Reading Time: 2 mins

Rajanikanth Birthday Special
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్

సూపర్ స్టార్, తలైవా ఇవన్నీ తెరమీద పేర్లు మాత్రమే నిజజీవితంలో ఆయనంత సాధారణ మనిషి ఇంకోవ్యక్తి ఉండరు. కోట్లలో పారితోషికం, కోటానుకోట్ల అభిమానులు చుట్టూ ఎంత అడంబరం ఉన్నా నిరా డంబరత ఆయనకు మాత్రమే సాధ్యం. మామూలు కండక్టర్ స్థాయి నుంచి వెండితెరపై సూపర్ స్టార్ గా ఎదిగిన రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమా జర్నీని ఒకసారి చూద్దాం. సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, అందం, కలర్ లేకున్నా, డబ్బు లేకున్నా కేవలం నటన అనే ప్రతిభతో సౌత్ పరిశ్రమలో తనదైైన ముద్ర వేశారు. ఇప్పటి వరకు ఆయన ప్రస్థానంలో అన్ని భాషల్లో కలిపి 160 కి పైగా చిత్రాల్లో నటించారు. రజనీకాంత్ 1950 డిసెంబరు 12వ తేదీన అప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించాడు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. తండ్రి రామోజీరావు గైక్వాడ్. పోలీస్ కానిస్టేబుల్. రజినీకాంత్ నలుగురు పిల్లల్లో అందరికన్నా చిన్నవాడు. చురుకైనవాడు.

పాఠశాల విద్య పూర్తి చేసుకొని బెంగుళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ లో బస్ కండక్టర్‌గా చేరాడు. అప్పుడప్పుడు నాటకాలలో పాల్గొనే ఉత్సాహం ఉండడంతో మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నట శిక్షణ తీసుకున్నాడు. అదే సమయంలో దర్శకుడు కె.బాలచందర్ ఆయన ప్రతిభ గుర్తించారు. ఆయనే శివాజీగా ఉన్న రజనీ పేరును మార్చారు. అలా 1975 లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్ చిత్రంతో తన ప్రస్థానం ప్రారంభించాడు. కొన్నాళ్ళు నెగిటీవ్ పాత్రలు పోషించాడు. అలా మొదలైన ఆయన ప్రయాణం పుట్టణ్ణ కనగల్, తెలుగు పునర్నిర్మాణమైన అంతులేని కథ, 1977లో తెలుగులో మొట్టమొదటి సారిగా చిలకమ్మ చెప్పింది అనే తెలుగు సినిమాలో కథానాయకుడిగా నటించాడు.

1978 లో రజినీకాంత్ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నటించిన 20 సినిమాలు విడుదలయ్యాయి. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి అన్నదమ్ముల సవాల్ అనే చిత్రంలో రెండో కథానాయకుడుగా నటించాడు. ఎం.భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన భైరవి రజినీకాంత్ సోలో హీరోగా నటించిన తొలి తమిళ చిత్రం. ఈ సినిమాతోనే అతనికి సూపర్ స్టార్ అనే బిరుదు వచ్చింది. 1979 లో ఎన్.టి.ఆర్తో కలిసి టైగర్ అనే తెలుగు సినిమాలో నటించాడు. హిందీ కథానాయకుడు అమితాబ్ బచ్చన్ ను తన రోల్ మోడల్ గా పేర్కొనే రజినీ, 1983లో అమితాబ్ బచ్చన్, హేమమాలినిలతో కలిసి అంధా కానూన్ అనే బాలీవుడ్ చిత్రంలో మొదటిసారిగా నటించాడు.

1995 లో సురేశ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన “బాషా” చిత్రం ఘన విజయం సాధించి రజినీకాంత్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ముత్తు, బాబా, చంద్రముఖి, శివాజీ, రోబో వంటి చిత్రాలు ఎంత విజయం సాధించాయో చూశాము. 2007 లో వచ్చిన శివాజీ చిత్రం వందకోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమాగా పేరు గాంచింది. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండటం ఆయన లక్షణం. ఆయన పరాజయాలకు కుంగిపోరు, విజయాలకు పొంగిపోరు. జైలర్ చిత్రం ఎంత విజయం సాధించిందో చూశాము. ఆ తరువాత వెట్టయాన్ అంత ఆడలేదు. ఇప్పుడు కూలీ చిత్రం రాబోతుంది.

రజనీకాంత్ కు ఆద్యాత్మిక భావాలు ఎక్కువ. చిన్నతనం నుంచే అలవాటు చేస్తున్నారు. రామకృష్ణ మఠంలో చేరి వేదాల గురించి, సంప్రదాయాల గురించి, చరిత్ర గురించి నేర్చుకున్నారు. అందుకే ఎంత పేరు ప్రతిష్ఠలు సంపాదించిన చాలా నిరాడంబరంగా ఉండడం అలవాటు చేసుకున్నారు. సంవత్సరంలో   కొన్ని నెలలు హిమలయాల్లో గడుపుతుంటారు. తెరమీద ఆయన తీసిన సినిమాలు మాత్రమే కాదు తెరవెనుక ఆయన చేసిన సేవలు కూడా ఎంతమందికి స్పూర్తినిచ్చాయి. సినిమా రంగానికి ఆయన సేవలందించినందుకు భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్నీ, 2016 లో పద్మవిభూషణ్ పురస్కారాన్నీ బహూకరించింది. వీటితో పాటు ఒక జాతీయ పురస్కారం, ఏడు సార్లు తమిళనాడు ఫిల్మ్ ఫెయిర్, ఒక నంది పురస్కారం, ఒక ఫిల్మ్‌ఫేర్ పురస్కారంతో పాటు ఇంకా ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా ఆరోగ్య ఉండాలనీ, మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటూ బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.