Reading Time: < 1 min

History Of Telugu Cinema-8
తెలుగు సినిమా చరిత్ర1948-49

1948లో వాహిని స్టూడియోలో చిత్రాలను నిర్మించడం ప్రారంభించారు. ఈ స్టూడియోలో గుణసుందరి కథ అనే చిత్రాన్ని మొదటిసారి చిత్రీకరించారు. ఘంటసాల బలరామయ్య నిర్మించిన బాలరాజు చిత్రం ఇదే సంవత్సరం విడుదలైంది. ఈ సినిమాతో అక్కినేని నాగేశ్వరరావుకు స్టార్ట్ ఇమేజ్ వచ్చింది. ఇదే సంవత్సరం వైజయంతి వారి వింధ్యారాని చిత్రం విడుదలైంది. అంటే అశ్విని దత్ నిర్మాణ సంస్థ కన్నా ముందే వైజయంతి పేరుతో ఒక నిర్మాణ సంస్థ ఉండేది. 1948లో కేఎస్ ప్రకాష్ రావు స్వతంత్ర అనే బ్యానర్ పై ద్రోహి అనే సినిమాను నిర్మించారు. ఇదే సంవత్సరం సువర్ణమాల, మదాలస, భక్త శ్రీయాల సినిమాలు విడుదలయ్యాయి. అదే విధంగా గౌరీనాదశాస్త్ర నిర్మాతగా గీతాంజలి పేరుతో ఒక సినిమాను ఇదే సంవత్సరం విడుదల చేశారు. ఈ సంవత్సరం విడుదలైన చిత్రాలలో బాలనాగమ్మ, ద్రోహీ తప్ప మిగితా సినిమాలు పెద్దగా ఆడలేదు.

1949లో కీలు గుర్రం అనే తెలుగు సినిమాను మొదటిసారిగా తమిళంలో డబ్ చేశారు. మాయాక్కుదిరై పేరుతో డబ్ చేసి పెద్ద హిట్ కొట్టారు మీర్జాపురం రాజ. ఇదే సంవత్సరం భరణి వారి రెండో చిత్రం లైలా మజ్ను విడుదలైంది. ఈ మూవీలో మజ్నుగా అక్కినేని నాగేశ్వర రావు నటించగా లైలాగా భానుమతి నటించారు. 1949లో గుణసుందరి, రక్ష రేఖ, ధర్మాంగద తో పాటు విడుదలైన ఆరు చిత్రాలు విజయం సాధించాయి. ఈ సంవత్సరాన్ని బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్, బెస్ట్ కేటగిరీలు ఎంచుకోవడానికి థియేటర్ల వద్ద ఓటింగ్ సిస్టం పెట్టి ప్రేక్షకులచే డైరెక్ట్ గా ఎన్నుకునే ప్రయోగం చేశారు. అలా ఉత్తమ చిత్రం గుణసుందరి, ఉత్తమ నటుడు వి నాగయ్య, ఉత్తమ నటి భానుమతిగా ఎంపికయ్యారు. సారథి వారు మేడ్ ఎక్స్ అనే ఇంగ్లీష్ మూవీని తెలుగులో శ్రీమతి పేరుతో తీయాలనుకున్నారు. దీనికి ఎల్.వి ప్రసాద్ దర్శకుడు. ఈ సినిమాలో నూతన హీరోను పరిచయం చేయాలని ఆరుగురికి మేకప్ చేశారు. ఆ సమయంలో ఎన్టీ రామారావు కూడా ఉన్నారు. ఆ సినిమాకు ఎన్టీఆర్ ను తీసుకోలేదు కానీ తరువాత మనదేశంలో సినిమాలో ఒక పాత్ర కోసం ఎన్టీఆర్ ను పిలిపించారు ఎల్.వి ప్రసాద్. అలా ఎన్టీఆర్ తెరమీద కనిపించిన మొదటి చిత్రం మనదేశం.