Game Changer Producer met Deputy CM Pawan kalyan
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసిన దిల్ రాజు
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్ విడుదలకు ముస్తాబు అవుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల అవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాజమండ్రి లేదా విజయవాడలో స్థలం వెతుకుతున్నారు. ఈ మేరకు దిల్ రాజు ఏపీ డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. సినిమా ఈవెంట్ పర్మిషన్స్ కోసము మాత్రమే కాదు ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఆయన్ను ఆహ్వానించినట్లు తెలుస్తుంది. అలాగే టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల పర్మిషన్లు తదితర అంశాలు కూడా ప్రస్తావించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ సినిమాకైనా టికెట్ రేట్లు పెంచేది కానీ, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని ఖరాఖండిగా చెప్పారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో నైనా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునే వెసులబాటు కల్పించాలని పవన్ కల్యాణ్ తో భేటీలో దిల్ రాజు ప్రస్తావించారు. భారీ బడ్జెట్ పెట్టి గేమ్ ఛేంజర్ సినిమాను తెరకెక్కించామని ఆయనతో చెప్పారు. దీని పట్ల పవన్ కల్యాన్ సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో హీరో రామ్ చరణ్ రెండు గెటప్ లలో నటిస్తున్నారు. హీరోయిన్స్ అంజలి, కియార అద్వాని నటిస్తున్నారు. ఎస్ జే సూర్య, శ్రీకాంత్, మురళి శర్మ, సునిల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.