Game Changer Movie Review
గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు శంకర్ దర్శకత్వంలో రావడం తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మాణం వహిస్తుండడంతో అందరికీ సినిమాపై ఆసక్తి పెరిగింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ పొలిటికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుందో చూద్దాం.
కథ:
రామ్‌నందన్ (రామ్‌చరణ్) ఐఏఎస్ ఆఫీసర్. విశాఖపట్నంలో పోస్టింగ్ తీసుకుంటాడు. లోకల్ ఉన్న గుండాలు, పొలిటికల్ లీడర్ల అక్రమాలపై ఆపరేషన్ మొదలుపెడుతాడు. ఆ సమయంలో మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె.సూర్య)తో వివాదం ఏర్పడి అది కాస్త ఈగోకు దారి తీస్తుంది. అభ్యుదయ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్) తాను చేసిన తప్పులు అన్ని సరిచేసుకోవాలి చూస్తాడు. అదే సమయంలో సత్యమూర్తికి హార్ట్ ఎటాక్ వస్తుంది. ఆ తరువాత జరిగే సంఘర్షణ ఐఏఎస్ అధికారి రామ్‌నందన్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురౌతాయి? మోపిదేవికి, రామ్ నందన్ కు మధ్య ఘర్షణ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది. ఈ కథలో అభ్యుదయ పార్టీ అప్పన్న (రామ్‌చరణ్), పార్వతి (అంజలి)తో రామ్‌నందన్‌కి ఉన్న సంబంధం ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
శంకర్ సినిమా అనగానే అందరికి ఒకే ఒక్కడు, శివాజీ సినిమాలు గుర్తుకొస్తాయి. అదే రేంజ్ లో గేమ్ ఛేంజర్ కూడా ఉండాలి అని ప్రేక్షకులు భావించి ఈ సినిమాకు వెళ్తారు. ఐఏఎస్ అధికారికీ, రాజకీయ నాయకుడికీ మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. అయితే సినిమాలో శంకర్ మార్క్ మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. అప్పన్న ఎపిసోడ్ మెప్పించింది. రామ్ నందన్ ఎపిసోడ్ అంతా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ఉంటుంది. ముఖ్యంగా సినిమాలో భావోద్వేగాలు కొరవడ్డాయి. చాలా సీన్లు ఏదో సినిమాలో చూసిన అనుభూతి ఉంటుంది.
ఒకే ఒక్కడు తరహాలో ఈ కథను చెప్పాలనే ప్రయత్నం అక్కడక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా రామ్ నందన్ మోటో ఏంటి అనేది, క్యారెక్టర్ ఇంట్రడక్షన్, హీరోయిన్ తో లవ్ ట్రాక్ తో లాక్కొచ్చారు. ప్రీ ఇంటర్ వెల్ మాత్రం కాస్త జోష్ గా ఉంటుంది. సడన్ ఒక ట్విస్ట్ తెర మీదకు వస్తుంది. దాంతో సెకండ్ ఆఫ్ ఫై ఆసక్తి పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ పెద్దగా వర్కౌట్ అవలేదు. సునిల్ క్యారెక్టర్ సైడ్ సత్యం అంటూ ఒక కొత్త ఆలోచనను పెట్టరు అన్నట్లు ఉంటుంది తప్ప, పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఇక విలన్, హీరో మధ్య సాగే ఒక సీన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు.
ఫస్ట్ హాఫ్ లో కోపదారి వ్యక్తి అయిన రామ్ ఎలా, ఎందుకు సాఫ్ట్ గా మారాడు, ఐపీఎస్ ఆఫీసర్ అయిన రామ్ ఐఏఎస్ ఆఫీసర్ అవడం వెనుక మోటీవ్ ఏంటనేది తెరమీద చూడాల్సిందే. ఇక సెకండ్ హాఫ్ ఫ్లాష్‌బ్యాక్ కథ ఆసక్తిగా మొదలు అవుతుంది. అప్పన్న ఎపిసోడ్‌లో మాత్రం శంకర్ టేకింగ్, మేకింగ్ ప్రత్యేకంగా నిలిచాయి. అయితే అప్పన్నను రాజకీయంగా ఎదగాలని చుట్టు ఉన్న ప్రొత్సాహిస్తారు. దాంతో అభ్యూదయ పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఆ క్రమంలో అప్పన్నకు ఉండే ఒక లోపం వలన ఆ పార్టీలోకి స్పీకర్ గా సత్యమూర్తి వస్తాడు. ఆ తరువాత సత్యమూర్తి ఆ పార్టీకి సీఎం ఎలా అయ్యాడు అనేది బాగా చూపించారు. ముఖ్యంగా రియాలిటీలో జరిగే ఓటింగ్ విధానాన్ని చూపించారు. ఆ విషయాలను తెరమీద చాలా బోల్డ్ గా చూపించినా… అవి పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. సినిమా లిబర్టీని వాడుకొని చాలా సన్నివేశాలు తీశారు అనిపిస్తుంది.
నటీనటులు:
రామ్‌చరణ్ విభిన్న కోణాల్లో కనిపిస్తారు. యాంగ్రీ యంగ్‌మ్యాన్ గా యంగ్ లుక్ లో చాలా బాగుంటాడు. ఐఏఎస్ ఆఫీసర్ గా చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. ఇక అప్పన్న పాత్రలో జీవించేశాడు. ఈ మూడు పాత్రల్లో ఆయన నటవిశ్వరూపాన్ని చూపించాడు. అప్పన్న పాత్రలో ఆయన నటన మరింతగా ఆకట్టుకుంటుంది. కియారా పాత్ర ఉన్నంతలో మెప్పించింది. పాటల్లో చాలా అందంగా కనిపించింది. అంజలి నటనకి ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించింది. ఎస్.జె.సూర్య నటన నెక్ట్స్ లెవల్ అని చెప్పవచ్చు. శ్రీకాంత్ నటన మెప్పిస్తుంది. జయరాం, సముద్రఖని, రాజీవ్ కనకాల వారికి ఉన్నంతలో మెప్పించారు.
సాంకేతిక అంశాలు:
సాంకేతకంగా సినిమా ఉన్నతంగా ఉంది. తిరు విజువల్స్ ముఖ్యంగా సాంగ్స్ లో ఆయన చూపించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి. సినిమాకు ప్రాణం తమన్ ఇచ్చిన సంగీతం. పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఎడిటింగ్ విషయంలో శంకర్ ఇంకాస్త జాగ్రత్త పడాల్సి ఉండేది. ఎమోషనల్ సీన్స్ ను సరిగ్గా పండించలేదు. ఫాస్ట్ కటింగ్ పెద్దగా ఇంపాక్ట్ లేదు. దర్శకుడు శంకర్ నుంచి వస్తున్న సినిమా అంటే అందరికీ చాలా అంచనాలు ఉంటాయి. అవి ఈ సినిమాలో లోపించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
రామ్ చరణ్ నటన
విజువల్స్
పాటలు
మైనస్ పాయింట్స్
ఔట్ డేటెడ్ కథ
ఎమోషనల్ సీన్స్ లేకపోవడం
అంతిమ తీర్పు: శంకర్ మార్క్ సినిమా కాదు. కానీ చూస్తున్న సేపు ఎంగేజ్ చేస్తుంది.
Movie Title :– Game Changer
Banner :– Sri Venkateswara Creations
Release Date :- 10-01-2025
Censor Rating :- “U/A”
Cast :– Ram Charan, Kiara Advani, Anjali, Samuthirakani, S J Surya, Srikanth
Director :– Shankar
Music :– Thaman S
Cinematography :– S Thirunavukkarasu
Editor :– Shameer Muhammed, Antony Ruben
Producers :– Raju, Shirish