Reading Time: 3 mins

Darling Movie Review – TEL

 డార్లింగ్  మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

నటులు:

ప్రియదర్శి,నభా నటేష్, సుహాస్ ( ప్రత్యెక పాత్రలో ),బ్రహ్మానందం,అనన్య నాగళ్ళ, మురళీధర్ గౌడ్,రఘు బాబు, ‘బలగం’ వేణు, తదితరులు..

దర్శకుడు: అశ్విన్ రామ్

సినిమాటోగ్రఫీ :నరేష్ రామదురై

సంగీతం : వివేక్ సాగర్

మాటలు : హేమంత్

నిర్మాతలు : నిరంజన్ రెడ్డి , చైతన్య రెడ్డి

 

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా ప్రియదర్శికి మంచి గుర్తింపు వుంది. మల్లేశం , బలగం లాంటి కంటెంట్ వున్న సినిమాల్లో నటించి హీరో గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. దాంతో పూర్తిస్తాయి కామెడీ సినిమాగా వస్తున్న  డార్లింగ్  ప్రేక్షకులకి ఆసక్తిని రేకెత్తించింది.

కథ:

రాఘవ ( ప్రియదర్శి) స్కూల్ కి వెళ్ళే వయసులో బాగా చదువుకుంటే, మంచి ఉద్యోగం తర్వాత అందమైన భార్య దొరుకుతుంది, లైఫ్ లో హ్యాపీ గా సెటిల్ అవ్వొచ్చు అని పేరెంట్స్,చుట్టూ వున్న వాళ్ళు చెప్తుంటే విని బాగా చదువుకొని ఒక ట్రావెల్ ఏజెన్సీ లో నెలకి 70 వేలు శాలరీ తీసుకొనే ఉద్యోగం చేస్తూ పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. పెళ్లి చేసుకొని భార్యతో ప్యారిస్ కి హనీమూన్ వెళ్ళాలన్నది అతని చిరకాల కోరిక. ఫైనల్ గా పేరెంట్స్ ఒక అమ్మాయిని ( అనన్య నాగళ్ళ) చూసి పెళ్లి ఫిక్స్ చేస్తారు. కానీ పెళ్లి కూతురు పెళ్లి ముహూర్త సమయానికి ఆమె తను ప్రేమించిన అబ్బాయితో లేచిపోతుంది. పెళ్లి మండపం వద్ద స్నేహితులు, బంధువులు హేళన చేయడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు. ఆ టైంలోనే ఆనంది (నభా నటేష్) పరిచయం అవుతుంది. ఆనంది రాఘవతో ‘ నువ్వు ఇన్నాళ్ళు పేరెంట్స్, సొసైటీ,నీ ఫ్రెండ్స్ కి నచ్చినట్లు బ్రతికావ్., ఇప్పటివరకూ నీకోసం,నీ సంతోషం కోసం ఏమీ చేయలేదు.నీకోసం నువ్వు బ్రతుకు. నీ జీవితంలో నీకేం కావాలో అది తెలుసుకొని దానికోసం ఫైట్ చెయ్ ‘ అని హితబోధ చేస్తుంది. దాంతో ఆనంది రాఘవకి నచ్చుతుంది. అలా పరిచయం అయిన నాలుగు గంటల్లోనే పేరెంట్స్ కి ఇష్టంలేకపోయినా ఆనందిని పెళ్లిచేసుకొని ఇంటికి తీసుకొస్తాడు. రాఘవ్ కి అసలు ఆనంది ఎవరు?,తన గతం ఏంటి?, ఆమె తల్లిదండ్రులు ఎవరు?, ఆమెకు ఉన్న సమస్యలు ఏంటి? అన్నవి ఏవీ తెలియవు.

 

అదే రోజు రాత్రి రాఘవ ఆనందికి చెప్పి, హ్యాపీ మూడ్ లో ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు చేసుకొని, ఆనంది దగ్గరకి వెళ్లి ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తే ఒక్కసారిగా ఆనందిని ఎవరో పూనినట్లు రాఘవ్ ని గట్టిగా కొడుతుంది.అసలు ఏం జరిగిందో అర్ధం కాక ఫ్రెండ్స్ తో చెప్పుకుంటాడు.అదే సమయంలో హాస్పిటల్ లో లేచిపోయిన పెళ్ళికూతురు ( అనన్య నాగళ్ల ) డాక్టర్ గా కలుస్తుంది. రాఘవ్ ఆనంది గురించి జరిగింది చెప్తాడు. అనన్య, రాఘవ్ తో ఆనందికి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ వుందని చెప్తుంది. ఆనందిలో ఆది , మాయా, ఝాన్షీ, పాపా, శ్రీశ్రీ ఇలా ఐదుగురు వ్యక్తులుంటారు.ప్రకృతిని ని ఫైవ్ ఎలిమెంట్స్ అయిన గాలి ,నీరు,నింగి,నేల,నిప్పు ఎలా కాపాడుతాయో అలా ఆనందిలో ఫైవ్ పర్సనాలిటిస్ అక్కడ వున్నభావోద్వేగం, సమస్య,సందర్భాన్ని బట్టి బయట పడుతుంటాయి అని చెప్తుంది. అసలు ఆమెలో ఉన్న ఆ ఐదుగురు ఎవరు? వారందరితో రాఘవ్‌కు వచ్చిన సమస్యలు ఏంటి? చివరకు రాఘవ్ లక్ష్యం, ధ్యేయం నెరవేరుతుందా? అన్నదే కథ.

దర్శకుడు రాసుకున్న కథని తెర మీదకి తీసుకొచ్చే ప్రాసెస్ లో ఎక్కడో గాడి తప్పినట్టు అనిపిస్తుంది.ఎత్తుకున్న కథాంశం బాగున్నా కథకి తగ్గట్టుగా సన్నివేశాలు రాసుకొనే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది.కేవలం నవ్వు తెప్పించాలనే తాపత్రయంలో కోర్ ఎమోషన్ మిస్సయింది. నభా నటేష్‌తో అపరిచితుడు సినిమాలో విక్రమ్‌లా నాలుగైదు కారెక్టర్లు, మాడ్యులేషన్స్ తో డైలాగ్స్ చెప్పించాడు,కానీ నభా నటేష్ తన నటనతో తెరమీద మెప్పించలేకపోయింది.

నభా నటేష్‌ క్యారెక్టర్ లో చూపించడానికి ఎన్నో వేరియేషన్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకుడికి హత్తుకొనేలా చిత్రీకరించలేకపోయారు. ఆమె కంటే ప్రియదర్శి క్యారెక్టర్ కొన్ని చోట్ల కామెడీ, ఎమోషన్ అంతో ఇంతో కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడన్నది వదిలేస్తే.. పార్టులు పార్టులుగా చూస్తే కొన్ని చోట్ల మంచి సీన్లే పడ్డట్టుగా అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్స్ కారెక్టర్ల పంచ్‌లు కొంతవరకు పేలుతాయి. ప్రధమార్ధం సినిమా నిడివి ఎక్కువ తీసుకున్నా ఎమోషనల్ గా ఎంగేజ్ చేయలేకపోయాడు. కనీసం ఇంటర్వెల్‌ బ్యాంగ్ అయినా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసుంటే బాగుండేది.

ఎటువంటి క్యూరియాసిటీ లేకుండా ద్వితీయార్దం మొదలైనప్పటికీ అక్కడక్కడా కొన్ని ఎపిసోడ్స్ బాగుంటాయి. దర్శి,రఘుబాబుల మధ్య భార్యాభర్తల అనుబంధం గురించి చెప్పే సీన్ ఎమోషనల్‌గా టచ్ అవుతుంది.  ఆ తర్వాత ఝాన్షి క్యారెక్టర్ గురించి చెప్తూ ‘’ పుట్టినప్పటినుండి చచ్చేవరకు మగాళ్ళు ఆడవాళ్ళ మీద దిపెండేంటే’’ అని  డిపెండెంట్, ఇండిపెండెంట్ అంటూ రాఘవ్ చెప్పే డైలాగ్స్, పెళ్లి గురించి చెప్పే డైలాగ్స్ బాగుంటుంది. అలా కొన్ని చోట్ల సీన్లు బాగున్నాయనిపిస్తుంది. కానీ సినిమా అంతా ఇంట్రెస్టింగ్‌ చూసేలా మాత్రం అనిపించదు.కథంతా హీరోయిన్ పాత్ర మీద నడుస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడానికి బలమైన నేపధ్యం లేదా సన్నివేశం పడుంటే సినిమా ఇంకో స్థాయిలో వుండేది.
టెక్నికల్‌గా చూసుకుంటే విజువల్స్ బాగున్నాయి. కెమెరా వర్క్ చాలా రిచ్‌గా అనిపిస్తుంది. వివేక్ సాగర్ నేపధ్య సంగీతం కొన్ని చోట్ల బాగున్నా ఇంకాస్త శ్రద్ధ పెట్టుండాల్సింది. రిలీఫ్ ని ఇచ్చే ఒక్క పాట కూడా లేకపోవడం మైనస్.మాటలు కొన్ని చోట్ల మెప్పిస్తాయి. ఆర్ట్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ కూడా బాగున్నాయి.

ప్రియదర్శి జాతిరత్నాలు,బలగం, మల్లేశంలాంటి చిత్రాలలో ఎమోషనల్, కామెడీ ఇలా ఏవైనా మెప్పించగలిగాడు. ప్రియదర్శి  నటుడిగా అతని బలం కామెడీ ని ఎఫెర్ట్ లెస్ గా పండిచడం. మరోసారి తనకి కొట్టినపిండి అయిన రాఘవ్ పాత్రలో ఈజీగా దూరిపోయాడనిపిస్తుంది. నభా నటేష్‌కు నటనకి ఇందులో చాలా స్కోప్ లభించింది. తెరపై కనిపించే నభా నటేష్ ఒక్కరే అయినా యాక్షన్, కామెడీ, ఎమోషన్, గడుసుతనం, అమాయకత్వం ఇలా ఎన్నో రకాల వేరియేషన్స్‌ చాలానే ఉంటాయి, కానీ ఏ పాత్రలోనూ నభా నటేష్ ప్రేక్షకుడ్ని ఆకట్టుకోదనిపిస్తుంది.సైకియాట్రిస్ట్ గా  అనన్య నాగళ్ల నటన పర్వాలేదనిపిస్తుంది. ఇక హీరో ఫ్రెండ్స్ పాత్రలు చేసే కామెడీ, తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ కారెక్టర్ కూడా బాగుంటుంది. అతిథి పాత్రలైన సుహాస్,నిహారిక, సంజయ్ స్వరూప్ కారెక్టర్‌లు ఓకే అనిపిస్తాయి. బ్రహ్మానందంను అంతగా వాడుకోలేదనిపిస్తుంది, ఆయన కనిపించిన ఏ సీన్లు కూడా నవ్వించవు. హీరో తల్లి, పిన్ని కారెక్టర్లు, రఘుబాబు పాత్రలు కొంతవరకు ఫర్వాలేదు అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్ : చెప్పుకోడానికి ఏం లేవు.

మైనస్ పాయింట్స్ :కథనం లో ఎమోషన్ మిస్సవడం, పరిపక్వత లేని కథనం ,సంబాషణలు, పాటలు.

చివరి మాట : ప్రియదర్శి ఫ్యాన్స్ కి నచ్చొచ్చు .