Actor Shobhana Birthday Special
నటి శోభన పుట్టిన రోజు ప్రత్యేకం
శోభన చంద్రకుమార్ పిళ్ళై.. “శోభన” గా అందరికి పరిచయం. చిత్రసీమలో నటిగా, డ్యాన్సర్ గా తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా క్లాసికల్ డ్యాన్స్ భరతనాట్యంలోనూ అసాధారణ ప్రతిభతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఒక వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు అద్భుతమైన ఎప్పటికి చెరగని పాత్రలకు చిరునామా నిలిచారు. ఈ రోజు శోభన పుట్టిన రోజు సందర్భంగా ఆమె జర్నీని తెలుసుకుందాం.
శోభన 1970 మార్చి 21న కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. చిన్న వయస్సు నుంచే భరతనాట్యంలో శిక్షణ పొందిన శోభన, తన నృత్య కళా ప్రతిభతో సినిమా రంగంలో విజయవంతంగా రాణించారు. బాలనటిగా సీనీ ప్రాయాణాన్ని ప్రారంభించారు. 1984లో విడుదలైన మలయాళ చిత్రం “మంగళం నేరున్ను” చిత్రంలో తొలిసారిగా నటించారు. 1985లో విడుదలైన తెలుగు చిత్రం “విక్రమ్” ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నారు.
తెలుగు సినిమాల్లో శోభన ప్రస్థావన వస్తే.. ఏప్రిల్ 1 విడుదల, అభినందన, రుద్రవీణ సినిమాల్లోని అమె అభినయం, నటన గురించి మాట్లాడాల్సిందే. కళ్లతోనే నవరాసాలను పలికించే తీరు, మంత్రముగ్దుల్ని చేసే ఆమె నృత్య భంగిమలు గురించి చర్చించాల్సిందే. ఇక కమర్షియల్ సినిమా గురించి మాట్లాడితే.. తెలుగులో చిరంజీవితో “రౌడీ అల్లుడు”, బాలకృష్ణతో “మువ్వ గోపాలుడు”, “నారి నారి నడుమ మురారి” వంటి చిత్రాల్లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మలయాళ చిత్రం “మణిచిత్రతాయు” (1993)లో ఆమె పోషించిన గంగ పాత్ర ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలోని ఆమె నటనకు జాతీయ అవార్డు లభించింది. శోభన రెండు సార్లు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. 1993లో విడుదలైన “మణిచిత్రతాయు”, 2002లో విడుదలైన “మిత్ర్, మై ఫ్రెండ్” చిత్రాలకు ఈ పురస్కారాలు దక్కాయి. 2025లో భారత ప్రభుత్వం “పద్మభూషణ్” పురస్కారందో సత్కరించింది. కేరళ, తమిళ నాడు, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రప్రభుత్వాల నుంచి అవార్డు తీసుకున్న అతి కొద్ది మంది నటుల్లో శోభన ఒకరు.
ఇటీవల విడుదలైన కల్కి చిత్రంలో చాలా రోజుల తరువాత తెరపై అలరించారు. అలాగే మోహన్ లాల్ కాంబినేషన్ లో తుడరుమ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. శోభన ఒక నటిగా, నృత్య కళాకారిణిగా భారతీయ కళా రంగంలో ఎంతో కృషి చేశారు. ఆమె సహజత్వం, అంకితభావం, ప్రతిభ ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఈ రోజు శోభన పుట్టిన రోజు సందర్భంగా బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున బెస్ట్ విషేస్ అందజేస్తున్నాము.