Reading Time: 3 mins

Any Impact On Game Changer Movie With Shankar Recent Disaster

ఇండియన్ 2 డిజాస్టర్ గేమ్ ఛేంజర్‌పై

భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఎస్ శంకర్ ప్రథమ స్థానంలో ఉంటారు. ఆయన తెరకెక్కించిన ఒక్కో చిత్రం ఒక్కో మైలురాయి అని చెప్పాలి. దర్శకుడు శంకర్ విజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న వింతలనే కాదు, సృష్టిలో లేని అద్భుతాలను కూడా వెండితెరపై చూపించి.. ప్రేక్షకులను మాయ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ ఆయన. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి అందుకుంటున్న నీరాజనాలు.. శంకర్ రెండు దశాబ్దాల క్రితమే అందుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన సినిమాలలో కమర్షల్ హంగులే కాదు, సామాజిక అంశాలు ఉంటాయి. సమాజంలో సామాన్యులు నిత్యం ఎదుర్కొనే సమస్యల చుట్టునే కథను అల్లుకొని ప్రతీ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్ది హిట్ కమర్షల్ హిట్ అందుకున్న దర్శకుడు శంకర్.

అవినీతీ, లంచం అనే కథ వస్తువులను తీసుకొని వాటి చుట్టూ భావోద్వేగాలతో కథను అల్లుకొని ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడంలో శంకర్‌ను మించిన దర్శకుడు లేరు అంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా హీరోలకు, హీరోయిన్స్‌కు అభిమానులు ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే కానీ దర్శకులకు అభిమానులు ఉండడం చాలా అరుదు. అదే శంకర్‌ తెరకెక్కించే సినిమాలకు హీరోలతో సమానమైన అభిమానులు ఉన్నారు అనేది అక్షర సత్యం. ఆయన నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే.. ఈ చిత్రంలో ఏ సామాజిక అంశాన్ని టచ్ చేశారో అనే ఉత్సాహం ఉండేది. సినిమాలు కూడా అలానే ఉండేవి. కానీ ఇప్పుడు శంకర్ సినిమాలో అది కనిపించడం లేదు. ఆయన చివరి హిట్ రోబో. ఆ తరువాత వరుస పరాజయాలను చూస్తున్నారు.

ఇడియట్ చిత్రాన్ని రీమేక్ చేసిన నాటి నుంచి శంకర్‌కు పరజయాలు ఎదురౌతున్నాయి అనే వాదన కూడా ఉంది. ఆ తరువాత కంప్లీట్ రివేంజ్ డ్రామాతో ఐ సినిమా చేశారు. అద్భుతమైన విజువల్స్ ఉన్నప్పటికీ శంకర్ స్థాయి సినిమా కాదు అనే టాక్ వినిపించింది. ఆ తరువాత రోబో2 అనే చిత్రం వచ్చింది. మొబైల్ వాడడం వలన పర్యావరణానికి ఎంత ప్రమాదమో చూపించారు. కానీ సొల్యూషన్ ఇవ్వలేక పోయారు దాంతో కథ విషయంలో కన్య్ఫూజ్ అయిన ప్రేక్షకులు ఫలితాన్ని కూడా కన్య్పూజన్‌లో పడేశారు. ఆ తరువాత ఇండియన్ 2 చిత్రం విడుదల అయింది.

భారతీయుడు2 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. 1996లో కమలహాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు చిత్రం ఎంత ఘనం విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా భారతీయుడు 2 చిత్రం వస్తుందని ప్రకటించడంతో అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. కాలానికి అనుగుణంగా కథ ఉన్నప్పటికీ సరైన భావోద్వేగాలు కొరవడడంతో ఫస్ట్ డేనే మిక్స్ టాక్‌ను సొంత చేసుకుంది. ఆ తరువాత ఫలితం తెలిసిందే. అంతేకాకుండా సినిమాలో బలమైన సమస్యను, దానికి సరైన పరిష్కారాన్ని చూపించలేకపోయారు అనే అపవాదు కూడా ఉంది. దీంతో భారతీయుడు2 ఫలితం గేమ్ ఛేంజర్‌పై పడుతుందా అని విమర్శకులు భావిస్తున్నారు.

శంకర్ సినిమాలు ఇదివరకటిలా ఉండకపోవడానికి కారణాలు కూడా చెబుతున్నారు. శంకర్ దగ్గర సుజాత రంగరాజన్ అనే రచయిత అసోసియేట్‌గా పనిచేసేవారు. ఈ తమిళ రచయిత భావోద్వేగాలు రాయడంలో మేటి. అందుకనే కమర్షల్ పాయింట్‌ను కూడా తగిన సెంటిమెంట్ జోడించి తెరపై మాయ చేసేవారు. ఆయన 2008లో ఆనారోగ్యంతో మరణించడంతో.. ఆయన స్థానాన్ని భర్తి చేసే రచయిత దొరకలేదు అందుకే శంకర్ సినిమాలు రంజింపచేస్తాలేవు అంటున్నారు. అదే కాకుండా ఇండియన్ 2 చిత్రం సెట్‌లో ఉన్న సమయంలో రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ అనే చిత్రాన్ని కూడా ఒకే సారి తెరకెక్కించారు. ఎంత మేధావి అయినా ఒకే సారి రెండు పడవల మీద ప్రయాణం సరైనది కాదు అనే వాదనలు ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ ఇప్పుడు మరో మెట్టు ఎదగడానకి శంకర్‌ను నమ్ముకున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ విషయంలో ఏదైనా తేడా కొడితే రామ్ చరణ్ పేరు ప్రతిష్టలు అంతర్జాతీయంగా పడిపోతాయని అభిమానులు సైతం కలవరపడుతున్నారు. అయితే ఎన్ని ఫ్లాప్‌లు వచ్చినా శంకర్ విజున్‌ను తక్కువ అంచనా వేయలేము. దానికి తోడు గేమ్ ఛేంజర్ కథను ప్రముఖ రైటర్, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు అందించారు. కార్తిక్ సుబ్బరాజు కథల్లో ఎంత వైవిధ్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. గేమ్ ఛేంజర్ ప్రచార చిత్రాలను పరిశీలిస్తే ఇది ఓ పొలిటికల్ డ్రామా అని, భారతీయ ప్రస్తుత రాజకీయాలను అద్దం పట్టేలా తీర్చిదిద్దినట్లు కనిపిస్తుంది. ఇది కచ్చితంగా బ్లాక్ బస్టర్ పాయింట్ అని సినిమాకు సరైన ట్రీట్‌మెంట్ ఇస్తే బొమ్మ హిట్టు అని విశ్లేషకుుల భావిస్తున్నారు.

శంకర్‌కు మళ్లీ పూర్వవైభవం రావాలంటే గేమ్ ఛేంజర్ కచ్చితంగా హిట్ కావాలి. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2025లో విడుదలకు సిద్దం అవుతుంది. మొదటి సారి దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రిభినయం చేస్తుండడం విశేషం. అంజలి, కియార అద్వాని హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం రిజల్ట్‌పై దర్శకుడి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇండియన్ 3 చిత్రం కూడా పూర్తి అయినట్లు లైకా ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. అసలు కంటెంట్ అంతా పార్ట్ 3లోనే ఉందని కూడా టాక్. గేమ్ ఛేంజర్ హిట్ అయితే ఇండియన్3 ఓపనింగ్స్ కూడా అదిరిపోతాయి. చూడాలి మరి గేమ్ ఛేంజర్ రిజల్ట్ ఎలా ఉంటుందో.