Will Saripodhaa Sanivaram Movie Break 29th August Sentiment
ఆగస్టు 29న సరిపోదా శనివారం సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా
సినిమాకు ప్రారంభ ముహుర్తం ఎంత ముఖ్యమో, విడుదల తేదీ కూడా అంతే ముఖ్యం అన్న విషయం అందరికీ తెలిసిందే. మూవీ అంటే కోట్లతో బిజినెస్ కాబట్టి ఏ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అన్నీ ఫాలో అవుతారు దర్శకనిర్మాతలు. ఇక విడుదల విషయంలో కూడా చాలా శ్రద్ద వహిస్తారు. ముఖ్యంగా పండుగలకు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తారు. అదే విధంగా లాంగ్ వీకెండ్, పబ్లిక్ హాలీడేస్‌ను టార్గెట్ చేసుకుంటారు. ఈ గురువారం ఆగస్టు 29న నేచురల్ స్టార్ నాని నటిస్తున్న సరిపోదా శనివారం విడుదలకు సిద్దం అయింది. సినిమాలన్నీ శుక్రవారం విడుదల చేస్తారు కానీ సరిపోదా శనివారం మూవీని గురువారం విడుదల చేయడం వెనుక ఏంటి స్ట్రాటజీ అని చాలా మంది ఆలోచిస్తున్నారు.
గతంలో ఆగస్టు 29 న విడుదలైన చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే ఒక విషయం తేటతెల్లం అయింది. తెలుగు ఇండస్ట్రీలో 1986 నుంచి 2024 వరకు మొత్తం 38 సంవత్సరాలు, అంటే ఆగస్టు 29 మొత్తం 38 సార్లు రిపీట్ అయింది. ఇన్ని తేదీలలో ఎన్ని చిత్రాలు విడుదలయ్యాయో తెలుసా. ఇప్పటి వరకు కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. నాని నటించిన సరిపోదా శనివారం చిత్రం ఐదవది. అందులోనూ విడుదలైన నాలుగు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అవేంటో ఒకసారి చూద్దాం.
కెప్టెన్ నాగార్జున్(1986)
యువ సామ్రాట్ నాగార్జున, అందాల తారా కుష్బు కలిసి నటించిన ఈ చిత్రాన్ని వీ.బీ రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 1986 ఆగస్టు 29 న శుక్రవారం రోజు విడుదలైంది. ప్రమాదంలో ఉన్న విమానాన్ని తన ప్రతిభతో కాపాడిన కెప్టెన్‌గా నాగార్జున ప్రయాణికులు మన్ననలు పొందుతారు. అదే సమయంలో అక్కడే ఉన్న రాధ(కుష్బు)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తనను దక్కించుకోవడం కోసం ఏం నాగార్జున ఏం చేశాడు అనేది కెప్టెన్ నాగార్జున్ కథ. ఈ చిత్రం థియేటర్లో పెద్దగా ఆడలేదు.
రేపటి పౌరులు(1986)
రాజశేఖర్, విజయశాంతి ప్రధాన పాత్రలలో టి. కృష్ణ తెరకెక్కించిన చిత్రం రేపటి పౌరులు. 1986లో ఆగస్టు 29 శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విమర్శకులు ప్రశంసలు అందుకుంది. కానీ కమర్షియల్ హిట్ కాలేదు. 1986 ఏడాదికి గాను ఉత్తమ చలన చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. ఇదే చిత్రాన్ని పురుచ్చి పుక్కల్ పేరుతో తమిళంలో అనువాదం చేశారు.
బాయ్స్(2003)
శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ చిత్రం 2003 ఆగస్టు 29 శుక్రవారం రోజు విడుదలైంది. ఏ.ఎం రత్నం నిర్మాతగా సిద్ధార్థ్, జెనిలియా లీడ్ రోల్‌లో నటించారు. ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలోని పాటలు శ్రోతల్ని ఉర్రూతలూగించాయి. అయితే సినిమా విషయానికి వస్తే కొంత మంది ఫ్రెండ్స్ కలసి మ్యూజిక్ బ్యాండ్ పెట్టాలనుకుంటారు. వారి మధ్య వచ్చే కామెడీ సీన్స్, లవ్ ట్రాక్, ఫ్రెండ్ షిప్, ఎమోషన్ అన్నీ వర్క్ అవుట్ అయ్యాయి. కానీ ఇది శంకర్ రేంజ్ సినిమా కాదు అనే విమర్శలు ఎదుర్కొంది. దాంతో బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. కానీ శంకర్ మార్క్ సాంగ్ మేకింగ్‌లో కనిపించింది. అలే అలే సాంగ్ కోసం ఏకంగా 62 కెమెరాలను ఉపయోగించారు. అంతే కాకుండా ఈ పాటకోసం టైమ్ ఫ్రీజ్ టెక్నాలజీని ఉపయోగించారు.
రభస(2014)
ఎన్టీఆర్ నటించిన రభస చిత్రం 2014 ఆగస్టు 29 శుక్రవారం రోజున విడుదల అయింది. బెల్లంకొండ శ్రీనివాస్ నిర్మాతగా, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సమంత, ప్రణీత హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చెందింది.
తాజాగా నాని నటించిన సరిపోదా శనివారం చిత్రం ఆగస్టు 29 గురువారం విడుదలకు సిద్దం అయింది. డీవీవీ దానయ్య నిర్మాతగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహాన్ జంటగా నటిస్తున్నారు. ఎస్.జే సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆగస్టు 29 తేదీన విడుదలైన ఏ సినిమాలు కూడా సరిగా ఆడలేదని గత రికార్డులు చూస్తుంటే తెలుస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఉంటాయి. మరి గత రికార్డుల తాలుక ప్రభావం సరిపోదా శనివారంపై పడుతుందా లేదా అనేది తెలియాలంటే ఆగస్టు 29 వరకు ఎదురుచూడాల్సిందే.
ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఇప్పటి వరకే అదే తేదీలో విడుదలైన చిత్రాలన్నీ శుక్రవారం మాత్రమే విడుదలయ్యాయి. కానీ అదే తేదీ నాడు విడుదల అవుతున్న సరిపోదా శనివారం చిత్రం మాత్రం గురువారం విడుదల అవుతుండడం విశేషం. ఈ విశ్లేషణ కాసేపు పక్కకు పెడితే కేవలం ముహుర్తబలాలు మాత్రమే కాదు సినిమాలో కంటెంట్ కూడా బాగుండాలి అనేది నిజం. ఆ కంటెంట్ నాని ఏ మేరకు అందిస్తాడో చూడాలి మరి.