Dance Evolution In Tollywood
తెలుగు పరిశ్రమలో డ్యాన్స్
పురాణాల నుంచి నృత్యానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంది. ఆనందంగా ఉన్నా, కోపంతో ఉన్నా చివరకు దు:ఖంలో కూడా దేవతలు తాండవం చేసిన ఉదంతాలు ఎన్నో విన్నాము. భరతనాట్యం, కుచిపూడి, కథక్, కథకళి, ఒడిస్సీ, మణిపురి, పేరుణి ఇవన్నీ సంప్రాదాయ నృత్యాలు. వీటితో పాటు జనపదాలు మొదలుకొని బ్రేక్, వెస్టర్న్, హిపాప్, బెల్లి డ్యాన్సు వరకు మన చలన చిత్ర రంగంలో చాలా డ్యాన్సులు చూస్తున్నాము. డ్యాన్స్ అనేది మనకున్న 64 కళలల్లో ఒక కళ. చరిత్రలో చూసుకున్నా డ్యాన్స్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నాటకాలు, కచేరీలు, సినిమాలు ఇలా ప్రతీ విభాగంలో నృత్యం నిక్షిప్తమై ఉంది. సినిమా ప్రస్థానంలో డ్యాన్సుకు ప్రత్యేక స్థానం ఉంది. మన చిత్రరంగంలో డ్యాన్స్ పరిణామక్రమాన్ని ఒక సారి చూద్దాం.
సినిమాలు అప్పుడప్పుడే ఆదరణ పొందుతున్న సమయంలో ఎక్కువగా భక్తి పాటలు ఉండేవి. వాటిని హాయిగా కూర్చొని పాడేవారు. పాడడంలోనే హావభావాలను పలికించేవారు. ఆ తరువాత జనపద పాటలను పొలాల గట్లపై, సంధ్య కాంతులలో కేవలం హావభావాలతో ప్రేక్షకులను రంజింప చేసేవారు. ఆ తరువాత పాటకు ఆట తోడైంది. అలా మొదలైన ఆట ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్, హిపాప్, బెల్లీ, వెస్టర్న్ లాంటి డ్యాన్సులతో కుర్రకారును వెర్రెత్తిస్తుంది. సిల్వర్ స్క్రీన్‌పై మొదటి సారి డ్యాన్స్ చేసిన లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు. 1941లో మొదలైన ఆయన ప్రయాణం మొదట్లో అందరిలానే కథానాయకి వెనుకాల నడుస్తూ పాడేవారు.. కానీ అందులో తనదైన స్టైల్ ఉండేది. చేతులో పువ్వులు పట్టుకొని, నాయకీ కొంగు పట్టుకొని అలా సిగ్గు పడుతూ.. హావభావాలను పలికించేవారు. ‘భలే రాముడు’ వంటి చిత్రాలలో ”ఓహో మేఘమాల” అంటూ అందంగా కెమెరా ముందు పాడారు. ఇదే స్టైల్‌ను అనుసరిస్తూ ఏఎన్ఆర్ సమకాలీకుడు అయినా ఎన్టీఆర్ ”అవునంటే కాదననిలే, కాదంటే అవుననిలే” అన్నారు. అలాగే కాంతారావు పాటలలో ఎక్కువగా కదిలేవాడు. కెమరా ముందు పరిగెత్తేవాడు, ఇదే తరహాలో జగ్గయ్య ”సోగ్గాడే చిన్ని నాయన ఓ పిట్టనన్న కొట్టని సోగ్గాడే” అంటూ సాగే పాటలో నడిచారు.
ఆ సమయంలో అంతా పాట పాడుతూ నడవడం, కథనాయక వెనుకాల పరిగెత్తడం, గడ్డివాములపై దూకడం లాంటివి చేస్తుండేవారు. వీరి పంథాలోనే హరినాథ్, రాజబాబు, చలం వంటి నటులు కొనసాగారు. అలాంటి సమయంలో ఏఎన్ఆర్ తొలిసారిగా డ్యాన్స్ మూమెంట్స్ వేశారు. ”హవ్వారే హవ్వా హవ్వా హో హైలేసా” అంటూ జానపద డ్యాన్స్‌లు వేయడం ప్రారంభించారు. తెలుగు తెరపై మొదటి సారి డ్యూయేట్కు డ్యాన్స్ చేసింది నాగేశ్వరరావు మాత్రమే. ఆ తరువాత ”పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లా”, ”కడవెత్తుకొచ్చింది కన్నెపెల్లా”, ”ఒక లైలా కోసం” అంటూ అనేక సూపర్ హిట్ పాటలకు తనదైన డ్యాన్సులతో రెచ్చిపోయారు. ‘బుద్ధిమంతుడు’, ‘శ్రీమంతుడు’, ‘ప్రేమనగర్’, ‘దసరా బుల్లోడు’ వంటి చిత్రాలలో ఆయన అద్భుతమైన డ్యాన్స్‌లతో తోటి హీరోలకు సవాల్ విసిరారు. ఈయన బాటలోనే ఎన్టీఆర్ సైతం జానపద డ్యాన్సులు ప్రారంభించారు. దీనిలో ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన శైలీని రూపోందించుకున్నారు. ఎక్కువగా చేతులను ఆడిస్తూ.. కనుబొమ్మలను కదిలిస్తూ, కాళ్లు ఎడంగా వేస్తూ మూమెంట్స్ చేసేవారు. అలా ”ఆరేసుకోబోయి పారేసుకున్నాను”, ”ఆకుచాటు పిందె తడిసే” వంటి ఎన్నో సూపర్ హిట్ పాటలకు ఆయన సిగ్నేచర్ స్టెప్లు వేశారు.
వీరి తరువాత ‘సూపర్ స్టార్ కృష్ణ’, ‘సోగ్గాడు శోభన్ బాబు’ కృష్ణం రాజు, మురళి మోహాన్, చంద్రమోహాన్ వంటి నటులు వచ్చారు కానీ ఏఎన్ఆర్ను మించిన డ్యాన్సర్స్ కాలేదు. కానీ అదే సమయంలో తెలుగు తెరపై ఒక కొత్త డ్యాన్స్ వెలుగులోకి వచ్చింది. అదే క్లబ్ డ్యాన్స్. జానపదాలు కాకుండా కమర్షియల్ చిత్రాలలో ముక్యంగా క్లబ్ డ్యాన్సులు ఫేమస్ అయ్యాయి. క్లబ్‌లలో, ప్రత్యేక గితాలలో ఈ రకమైన డ్యాన్స్ ఉండేది. అలాంటి సమయంలో చింరజీవి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే ఉన్న డ్యాన్స్‌ను తన మొదటి సినిమాల్లో ప్రదర్శించారు. ఆ తరువాత హాలీవుడ్లో ట్రెండ్‌లో ఉన్న డిస్కో డ్యాన్స్‌ను పరిచయం చేశారు. వేగంగా స్టెప్పులు వేయడం డ్యాన్స్‌లోని ప్రత్యేకత. ఇదే డ్యాన్స్‌ను హీరో సుమన్, బాలకృష్ణ సైతం చేసి మెప్పించారు. ఆ తరువాత చిరంజీవి అంటే డ్యాన్స్ అనేలా చేసిన డ్యాన్స్ బ్రేక్ డ్యాన్స్. అప్పట్లో పాప్ ఇండస్ట్రీని ఉర్రుతలూగిస్తున్న మైకల్ జాక్సన్ ఇన్సిపిరేషన్‌తో తెలుగులో ”చక్కిని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్” పాట అప్పట్లో ఓ ట్రెండును క్రియేట్ చేశారు. హీరోయిన్లతో వేసే డ్యూయేట్ స్టెప్పులలో కూడా కొత్త రకమైన స్టెపులను వేస్తూ ఆకట్టుకున్నారు. అలాగే బాలయ్య సైతం ‘ముద్దుల మామయ్య’ చిత్రంలో ”హే రాజా కులాంసంగానీ” అనే పాట బ్రేక్ డాన్స్ వేసి అందరిని ఆశ్చర్యపరిచారు.
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ లాంటి నటులు వచ్చారు. మోడర్న్ డ్యాన్స్ వేశారు. ఇక పవన్ కల్యాణ్ స్టార్‌గా ఎదుగుతున్న తరుణంలో చాలా రకాల ప్రయోగాలు చేశారు. బాల్ రూమ్ డ్యాన్స్, జాజ్ డ్యాన్సులు వేశారు. అంటే గ్రూప్ అంతా ఓ సెట్లో డ్యాన్సులు వేయడం, ఈ రకమైన నాట్యంలో బాడీ మూమెంట్స్ హెవీగా ఉంటాయి. ఆ తరువాత వీరంత స్టార్స్ అయిన తరువాత చిన్న చిన్న మూమెంట్స్ వేస్తూ వస్తున్నారు. వీరి తరువాత తెలుగు తెరమీద చిరంజీవి తరువాత డ్యాన్స్ చేసే హీరోలలో ‘జూనియర్ ఎన్టీఆర్’, అల్లు అర్జున్, రామ్ చరణ్ పేర్లు వస్తాయి. వీరితో పాటు నితిన్, రామ్ పొతినేని సైతం డ్యాన్సులు చేశారు. అయితే ఫోక్ డ్యాన్స్ అనేది కేవలం స్పెషల్ పాటలకు అంకితం అయిపోయింది. హిపాప్, వెస్టర్న్, మోడర్స్ డ్యాన్సులు తెరమీదకు వచ్చాయి. చాలా ఫాస్ట్ మూమెంట్స్ వచ్చేశాయి. ముఖ్యంగా ఇప్పుడు చేస్తున్న డ్యాన్సులలో సిగ్నేచర్ స్టెప్ అనేది పాపులర్ అయింది. ఆ స్టెప్ ఏ స్టైల్లో ఉన్నా సరే సిగ్నేచర్ స్టెప్ అనేది కామన్ అయిపోయింది.
1930, 1940లలో పాటలను పాడుతూ హావభావాలను ప్రదర్శించేవారు, 1950లలో ఏఎన్ఆర్ మొదటి సారి పాటలకు డ్యాన్స్ వేయడం మొదలు పెట్టారు. 1970-80లలో చిరంజీవి దాన్ని బ్రేక్ చేస్తూ బ్రేక్ డ్యాన్స్, డిస్కో డ్యాన్సులను పరిచయం చేశారు. దాన్ని కొనసాగిస్తూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నటులు హిపాప్, మోడర్న్, టాప్ డ్యాన్స్, స్లో మోషన్ లాంటి డ్యాన్సులు వేస్తూ వచ్చారు. ఇక వీరంత 40కి దగ్గరకొస్తున్న తరుణంలో వెండితెరపై డ్యాన్స్‌ను ముందుకు తీసుకోబోయే కుర్రహీరోలు ఎవరు అంటే.. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ డ్యాన్సర్లు ఎవరూ లేరు. ఇక మీద వచ్చే యంగ్ స్టర్స్ ఎవరైనా డ్యాన్సులు వేస్తూ.. కొత్తరకమైన ప్రయోగాలకు శ్రీకారం చుడుతారేమో చూడాలి.