Dil Raju Press Meet
దిల్ రాజు మీడియా సమావేశం
నిజనిజాలు తెలుసుకుని వార్తలు రాయండి.. మీడియా సమావేశంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు
గత మూడు, నాలుగు రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు నిర్మాతల మీద ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన మీద జరిగిన ఐటీ దాడులు, మీడియాలో వచ్చిన ఆరోపణలు, కొందరు రాసిన రూమర్ల మీద స్పందించారు. ఈ క్రమంలో ఆయన ఏం చెప్పారంటే..
‘ఐటీ రైడ్స్ అనేవి కామన్‌గా జరుగుతుంటాయి. గతంలో అంటే 2008లో మాపై ఐటీ రైడ్స్ జరిగాయి. మళ్లీ ఇప్పుడు జరిగాయి. ఏ వ్యాపారంలో ఉన్న ఇలాంటి రైడ్స్ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ మీడియాలో కొందరు తెలిసీ తెలియక ఇష్టమొచ్చినట్టుగా వార్తలు రాశారు. ఖరీదైన డాక్యుమెంట్లు లభ్యం అయ్యాయని, కోట్ల రూపాయల నగదు లభ్యం అయ్యిందనే ప్రచారాలు చేశారు. కానీ అవన్నీ అవాస్తవాలే. మా అందరి దగ్గర కలిపి రూ.20 లక్షల నగదు మాత్రమే దొరికింది. వాటికి కూడా అన్నీ లెక్కలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ ఇలా అన్నింటికి సంబంధించిన పత్రాలు అడిగారు. అన్నింటినీ చూపించాం. అలాగే బంగారంకి లెక్కలు చూపించాం. ఎవరి దగ్గర ఎంత ఉండాలో అంతే ఉంది. గత ఐదేళ్లలో మేము ఎలాంటి ఆస్తులను కొనుగోలు చేయలేదు. ఆ విషయాన్ని ఐటీ అధికారులకు తెలియజేశాం.ఐటీ రైడ్స్‌కి పూర్తిగా సహకరించాం . సినీ పరిశ్రమలో బ్లాక్ మనీ అనేది లేదు. దాదాపుగా ఎనభై శాతం మంది ఆడియన్స్ టిక్కెట్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు. ఇక బ్లాక్‌మనీ ఎక్కడి నుండి వస్తుంది. అమ్మకు గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గు ఉంది. ఇటీవల దగ్గు ఎక్కువ కావడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశాం. దాంతో ఆమెకు గుండెపోటు అంటూ వార్తలు రాశారు. లంగ్స్ ఇన్‌ఫెక్షన్ వల్ల కాస్త దగ్గు ఎక్కువైంది. ఆమె వయసు 81 ఏళ్లు, ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఆసుపత్రి నుంచి ఇప్పటికే ఆమె డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. మీడియాలో ఇలా తెలిసీ తెలియక ఇష్టమొచ్చినట్టుగా రాస్తున్నారు. సెలెబ్రిటీలం కాబట్టి మా మీద ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. కానీ నిజాలు తెలుసుకుని రాయండి’ అని అన్నారు.