Reading Time: 3 mins

Ghantasala Venkateshwararao Birth Anniversary
ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి 

ఘంటసాల ఈ పేరు వింటే చాలు వెయ్యి వేణువుల మధుర సంగీతాన్ని ఆస్వాదించిన అనుభూతి. ఆ తరం ఈ తరం కాదే ఏ తరానికైనా ఆయన స్వరం వీనుల విందు. అందుకే ఆయన్ను గాన గంధ‌ర్వుడు అని పిలుచుకుంటారు. ఆయన పూర్తి పేరు ఘంటశాల వెంకటేశ్వరరావు. ఆయన గొంతు మాత్రమే కాదు ఆయన వ్యక్తిత్వం కూడా అంతే తీయనైనది . ఎంతో మంది సంగీత ప్రియులకు, కళాకారులకు ఆరాధ్యగురువు. భక్తి పాటల నుంచి ప్రేమ పాటల మీదుగా దేశభక్తి, జానపదాల వరకు ఏ పాటైనా ఘంటసాల గాత్రంలో అమృతం. అందుకే ఆయన దివికేగి శ‌తాబ్ధం గడిచినా నేటికీ ప్ర‌తి తెలుగువాడి గుండెను మీటుతూ త‌న పాట‌ల‌తో చిర‌స్థాయిగా మిగిలిపోయారు. డిసెంబర్ 4 ఆయన జయంతి సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

1922 డిశంబర్‌ 4న కృష్ణా జిల్లా గుడివాడ మండలం చౌటపల్లిలో ఘంటశాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు ఆరుగురు సంతానంలో ఒకరు. తండ్రి సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. ఆయనతో పాటే కచేరీలకు తీసుకెళ్లేవాడు. అలా ఘంటసాలకు చిన్నతనంలో సంగీత బీజం పడింది. ఎప్పటికైనా సంగీతంలో ప్రావీణ్యం సాధించాలనే తన తండ్రి ఆశను లక్ష్యంగా చేసుకొని సంగీత గురుకులంలో చేరాడు. అక్కడి కట్టుబాట్లు తట్టుకోలేక తిరిగి సొంత ఊరికి వచ్చేసి సంగీత విద్వాంసుల ఇళ్ళలో పని చేస్తూ సంగీతం నేర్చుకున్నారు. అది సరైన పద్దతి కాదు అని విజ‌య‌న‌గ‌రంలో ఉన్న సంగీత కళాశాలలో చేరారు. అద్దె కట్టేందుకు డబ్బు లేక అక్క‌డే ఉన్న ఎల్లమ్మ దేవాలయంలో తలదాచుకునేవాడు. ఒక రోజు విషయం తెలుసుకున్న పట్రాయని సీతారామశాస్త్రి ఘంటశాలకు ఉచితంగా సంగీతం నేర్పడానికి ఒప్పుకొని ఇంటికి తీసుకెళ్లారు. మాస్టరు పేదవాడే కావడంతో అదే ఊరిలో జోలపట్టుకొని మాధుకరం(బిక్షాటన) చేసేవాడు. ఎన్ని కష్టాలు వచ్చినా సంగీతాన్ని వీడలేదు.

స్వతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో ఘంటసాల వెంకటేశ్వరరావు 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నారు. అనంతరం 1944లో తన మామ కూతురు అయిన సావిత్రమ్మను   వివాహం చేసుకున్నారు. తన పెళ్లికి తానే సంగీత కచేరిని నిర్విహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఘంటశాలలోని గాన సామర్థ్యాన్ని గుర్తించిన సముద్రాల మద్రాసు వచ్చి కలువమని చెప్పారు. రెండు నెలలు కచేరీలు చేసి దాసుకున్న డబ్బు, కొంత అప్పు చేసి మద్రాసు వెళ్లి కలిశారు. అక్కడ చిత్తూరు నాగయ్య, బి.ఎన్‌ రెడ్డిలు ఘంటసాల గాత్రాన్ని విని మెచ్చుకున్నారు. అప్పుడు కూడా సినిమాలో చిన్న పనులు చేసుకుంటూ రాత్రికి పార్కులో నిద్రించేవాడు. అలాంటి సమయంలో సముద్రాల మద్రాసు రేడియో కేంద్రంలో లలిత గీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు.

పాటలు పాడుతూ సినీరంగంలో చిన్న చిన్న వేషాలు వేసుకుని జీవ‌నం సాగిస్తున్న ఆత‌నికి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా స్వర్గసీమలో మొదటిసారి నేపథ్యగాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది. ఆ తరువాత వరుసగా సినిమా పాటలు పాడారు. రత్నమాల చిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. తర్వాత బాలరాజు, మనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు. 1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమ్రోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు. తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందారు. అలా అనర్కాలి, మాయాబజార్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పాటలు పాడారు.

1969-72 మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్ధాన గాయకునిగా కొనసాగారు. 1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1969 నుంచి తరచూ ఘంటశాల అనారోగ్యానికి గురయ్యేవారు. 1971లో ఐరోపా, ఆమెరికాలో ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో ఘంటశాలకు గుండెనొప్పి వచ్చింది. హుటాహుటీన అక్కడి ఆసుపత్రికి తరలించారు. అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలనే కోరిక కలిగింది. భగవద్గీత పూర్తి చేసి సినిమా పాటలు పాడుకూడదని నిర్ణయించుకున్నారు. 1972లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు వంటి హిట్‌ చిత్రాలకు పాటలు పాడారు. ఇక 1974 ఫిబ్రవరి 11న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన గాత్ర మాధుర్యం ఎప్పుడూ నిత్యనూతనంగానే ఉంటుంది. ఆయన పాటల రూపంలో ఎప్పుడూ శ్రోతల గుండెల్లో ఉంటాడు.